సమీపిస్తున్న పదో తరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2023-03-26T22:34:40+05:30 IST

పదో తరగతి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టులపై పట్టు సాధించేలా విద్యార్థు లను సమాయత్తం చేస్తున్నారు.

 సమీపిస్తున్న పదో తరగతి పరీక్షలు

ఏసీసీ, మార్చి 26 : పదో తరగతి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టులపై పట్టు సాధించేలా విద్యార్థు లను సమాయత్తం చేస్తున్నారు. భయాందోళనలకు గురి కాకుండా ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికతో చదివించి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేలా అవగాహన కల్పిస్తున్నారు. స్థాయిల వారీగా విద్యార్థులను విభజించి రోజువారీ లక్ష్యాలతో బోధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 167 పాఠశాలలు ఉండగా వీటిలో పదో తరగతి విద్యార్థులు 6678 మంది ఉన్నారు. డిసెంబరు నెలాఖరు వరకు అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యా యులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఇంటి వద్ద విద్యార్థులు చదివేలా చూడాలని కోరారు.

-ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు

జిల్లా వ్యాప్తంగా నవంబర్‌ 11వ తేదీ నుంచి ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు మార్చి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం ఒక్కో సబ్జెక్టులో అనుమానాలను నివృత్తి చేయడం, చదివించడం, సాయంత్రం ఆ సబ్జెక్టులకు సంబంధించి స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రిపరేషన్‌లో మార్పులు చేపడుతూ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

-పకడ్బందీగా పది పరీక్షలు

జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ విద్యార్థులకు 54 పరీక్ష కేంద్రాలు, సప్లిమెంటరీ విద్యార్థులకు ఒక కేంద్రం ఏర్పాటు చేయగా 10,297 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లో 5550 మంది బాలురు, 4875 మంది బాలికలు ఉన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఐదు నిమిషాలు అలస్యమైతే పరీక్షకు అనుమతించరాదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 55 పరీక్ష కేంద్రాల్లో 41 కేంద్రాలను ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో ఏర్పాటు చేయగా, 14 కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. 55 పరీక్ష కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్‌ అధికారులను, పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌, జిల్లా వ్యాప్తంగా 3 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందంలో విద్యాశాఖ అధికారి, డిప్యూటీ తహసీల్దార్‌, ఏఎస్‌ఐ ఉంటారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సీ సెంటర్‌లైన జెడ్పీహెచ్‌ఎస్‌ ముత్యంపల్లి, జెడ్పీహెచ్‌ఎస్‌ ఇందారం, జెడ్పీహెచ్‌ఎస్‌ పారుపెల్లి, వేమనపల్లిలో నలుగురు కస్టోడియన్‌లను నియమించారు. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున 515 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌, ఫ్యాన్‌లు, తాగునీరు, మందులు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి సమీపంలోని ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచనున్నారు.

ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా ఉన్నాయి

-అఖిల, 10వ తరగతి , పొక్కూరు, చెన్నూరు మండలం

ప్రత్యేక తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అదనపు తరగతుల వల్ల పాఠ్యాంశాల పునచ్ఛరణతోపాటు ఏమైనా సందేహాలుంటే అప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుంటున్నాం. ప్రతి పాఠ్యాంశంపై పరీక్షలు నిర్వహిస్తుండడంతో సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఏర్పడింది. పబ్లిక్‌ పరీక్షలపై భయం పోయింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తామనే నమ్మకం ఏర్పడింది. అలాగే ప్రత్యేక తరగతుల్లో ఉదయం, సాయంత్రం స్నాక్స్‌ అందిస్తున్నారు.

Updated Date - 2023-03-26T22:34:40+05:30 IST