రైతుబంధుకు బ్రేకు

ABN , First Publish Date - 2023-01-26T00:51:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకానికి బ్రేకులు వేయడంతో కొంతమంది రైతులు పెట్టుబడి సహాయం అందడం లేదు. గంజాయి సాగు చేస్తున్న రైతులపై వానకాల సీజన్‌ నుంచి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరక్షరాస్యులైన కొంతమంది అమాయక ఆదివాసీ గిరిజన రైతులు చట్టాలపై అవగాహన లేక నష్టపోతున్నారు. గతంలో మాదిరిగానే తమ అవసరాల నిమిత్తం సాగు చేసుకుంటున్నా అధికారులు కేసులు పెట్టి రైతుబంధు రాకుండా చేస్తున్నారని వాపోతున్నారు. మంగళవారం నిర్వహించిన గిరిజనుల దర్బార్‌లో ఇద్దరు రాష్ట్ర మంత్రుల ముందే గిరిజన రైతులు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

 రైతుబంధుకు బ్రేకు

బాధితులందరూ ఆదివాసీ గిరిజనులే

అవగాహన కల్పించకుండానే అధికారుల చర్యలు

కనికరం చూపాలంటూ అధికారులను వేడుకుంటున్న అన్నదాతలు

ఆదిలాబాద్‌, జనవరి25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకానికి బ్రేకులు వేయడంతో కొంతమంది రైతులు పెట్టుబడి సహాయం అందడం లేదు. గంజాయి సాగు చేస్తున్న రైతులపై వానకాల సీజన్‌ నుంచి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరక్షరాస్యులైన కొంతమంది అమాయక ఆదివాసీ గిరిజన రైతులు చట్టాలపై అవగాహన లేక నష్టపోతున్నారు. గతంలో మాదిరిగానే తమ అవసరాల నిమిత్తం సాగు చేసుకుంటున్నా అధికారులు కేసులు పెట్టి రైతుబంధు రాకుండా చేస్తున్నారని వాపోతున్నారు. మంగళవారం నిర్వహించిన గిరిజనుల దర్బార్‌లో ఇద్దరు రాష్ట్ర మంత్రుల ముందే గిరిజన రైతులు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

జిల్లాలో ఎక్కువ మంది రైతులపై గంజాయి కేసులు

రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో ఎ క్కువ మంది రైతులపై గంజాయి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 37 మంది రైతులకు రైతుబంధు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నా ఈలెక్క మాత్రం మరింత ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి సాగును చేయడం చట్ట వ్యతిరేకమే అయినా ఎలాం టి అవగాహన, హెచ్చరికలు చేయకుండానే సాగుకు అందించే పెట్టుబడి సొమ్మును నిలిపి వేయడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నా యి. ఇప్పటికే రైతుబంధు పథకం అమలులో పరిమితులు విధించాలం టూ పలు రకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్లనైతే వెంచర్లు వేసి అమ్మేసుకున్న భూములకు సైతం రైతుబంధు సొమ్ము అందుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను అడ్డుకోని అధికారులు కేవలం ఐదారు మొక్కలు దొరికిన కేసులు నమోదు చేసి రైతుబందు రాకుండా చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఏదో తెలిసి తెలియక చేసిన తప్పును మన్నించి తమపట్ల కనికరం చూపాలంటూ అన్నదాతలు అధికారులను వేడుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాము ఏమి చేయలేమంటూ సంబంధిత అధికారులు చేతులెత్తేస్తున్నారు.

ఉచ్చులో దింపుతున్న ముఠాలు

ఆదివాసీ రైతుల అమాయకత్వం, అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బుఆశ చూపుతూ గంజాయి ముఠాలు ఉచ్చులో దింపుతున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడి ఖర్చు, కష్టపడకుండానే చేతికి అదనంగా ఆదాయం రావడంతో రైతులు గుట్టుచప్పుడు కాకుండా అంతర్‌పంటగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల దాడుల్లో పట్టుబడి కటకటలా పాలవుతున్నా రు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమవుతున్నారు. జిల్లాలో గంజాయి కేసులు నమోదైన రైతులంత ఆదివాసీ గిరిజనులే కావడం గమనార్హం. గతంలో గుడుంబా తయారీదారులను గుర్తించి ప్రత్యామ్నాయం చూపిన మాదిరిగా గంజాయి సాగు చేస్తున్న రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గంజాయి ముఠాలు ఆశచూపడంతో రైతులు వారి ఉచ్చులో పడుతున్నారు. ఈ ముఠాల కదలికలను పసిగట్టి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

హెచ్చరికలు చేయకుండానే..

ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే అధికారులు గంజాయి రైతులపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం అందిస్తున్న రై తుబంధు సొమ్మును నిలిపి వేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు సార్లు హెచ్చరించి మూడోసారి కూడా పట్టుబడిన వారి పైననే చర్యలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుబంధు పథక అమలు సమయంలో ఎలాంటి షరతులు విధించకుండానే ప్రభుత్వం రైతుబంధుకు బ్రేకులు వేయడం సరైంది కాదంటున్నారు. మారుమూల గ్రామాల్లో అంతర్‌పంటగా సాగవుతున్న గంజాయిపై వానకాల సీజన్‌ ప్రారంభంలోనే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఉంటే కొంత మేరకైనా కట్టడి చేసే అవకాశం ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లే కనిపించడం లేదు.

ఒకటి రెండు సార్లు అవకాశం ఇవ్వాలి..

సంగెపు బొర్రన్న (జిల్లా రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు)

చట్టాలపై ఏ అవగాహన లేని ఆదివాసీ గిరిజన రైతులు గంజాయి మొక్కలను సాగు చేస్తే అధికారులు కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించడం సరికాదు. హెచ్చరికలు, అవగాహన కల్పించకుండానే కేసులు నమోదు చేసి రైతుబంధును నిలిపివేయడం మంచి పద్ధతి కాదు. సాగు చేస్తున్న రైతులను గుర్తించి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.

ఎక్సైజ్‌ అధికారుల కేసులతోనే

రమేష్‌ కుమార్‌ (ఏడీఏ, ఆదిలాబాద్‌)

ఎక్సైజ్‌ అధికారులు నమోదు చేసిన కేసుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సొమ్మును నిలిపివేసినట్లు తెలుస్తుంది. రైతుబంధు ను నిలిపి వేయాలని ఎలాంటి ఆదేశాలు లేవు. ఇప్పటికే పలువురు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో కోర్టు కేసులు, రెవెన్యూ కేసులు ఉన్న రైతుబందు నిలిచి పోతుంది. ఏదైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే రైతుబంధు సొమ్మును జమ చేయడం జరుగుతుంది.

Updated Date - 2023-01-26T00:51:35+05:30 IST