Share News

చెన్నూరు లిఫ్ట్‌పై నీలినీడలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:31 PM

కాళేశ్వరం ప్రాజెక్టుల సము దాయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన చెన్నూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై నీలినీడలు అలుముకున్నాయి. 1,658 కోట్ల రూపాయల అం చనా వ్యయంతో రూపుదిద్దుకున్న పథకానికి ఫిబ్రవరిలో జరిగిన శాసన సభ బడ్జెట్‌ సమావేశంలో నిధులు కేటాయించకపోవడంతో అడుగు ముం దుకు పడలేదు.

చెన్నూరు లిఫ్ట్‌పై నీలినీడలు

మంచిర్యాల, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుల సము దాయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన చెన్నూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై నీలినీడలు అలుముకున్నాయి. 1,658 కోట్ల రూపాయల అం చనా వ్యయంతో రూపుదిద్దుకున్న పథకానికి ఫిబ్రవరిలో జరిగిన శాసన సభ బడ్జెట్‌ సమావేశంలో నిధులు కేటాయించకపోవడంతో అడుగు ముం దుకు పడలేదు. దీంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు ఆశనిపాశమే ఎదురైంది.

10 టీఎంసీలు ఎత్తిపోసే లక్ష్యంతో..

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌ నుంచి 10 టీఎంసీల నీరు ఎత్తిపోయడం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 90 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రణాళికలు రూపొందించారు. పథకంలో భాగంగా మొత్తం మూడు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లిఫ్ట్‌-1 ద్వారా మం దమర్రి మండలంలోని పొన్నారం, శంకర్‌పల్లి, జైపూర్‌ మండలంలోని గంగిపల్లి ట్యాంకుల వరకు, లిఫ్ట్‌-2 ద్వారా భీమారం మండలం ఆరెపల్లి, చెన్నూరు మండలం ఆస్నాద్‌, రెడ్డిపల్లి ట్యాంకుల వరకు, లిఫ్ట్‌-3 ద్వారా కోటపల్లి మండలంలోని శంకర్‌పూర్‌ ట్యాంక్‌ వరకు నీళ్లందించేలా డీపీఆర్‌ తయారు చేశారు. మూడు లిఫ్ట్‌ల ద్వారా చెన్నూరు మండలంలో 31,947 ఎకరాలు, కోటపల్లి మండలంలో 22,025 ఎకరాలు, భీమారం మండలంలో 10,606 ఎకరాలు, జైపూర్‌ మండలంలో 19,987 ఎకరాలు, మందమర్రి మండలంలో 5,435 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. ఈ విషయమై రెండేళ్లుగా ఇరిగేషన్‌ అధికారులు సమీక్షలు నిర్వహించడమే గాకుండా రూట్‌ మ్యాప్‌లు సిద్ధం చేశారు. లిఫ్ట్‌ ఏర్పాటు చేసేందుకు సుమారు మూడు వేల ఎకరాలకుపైగా భూములు అవసరం కాగా స్థానిక ప్రజల నుంచి సేకరించనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.

డీపీఆర్‌ను సిద్ధం చేసినా..

చెన్నూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం అధికారులు డిలెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిద్ధం చేశారు. పథకంలో భాగంగా జైపూర్‌ మండలం శెట్‌పల్లి గోదావరి వద్దగల సుందిళ్ల ప్రాజెక్టు సమీపంలో పంప్‌హౌస్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిత స్థలాన్ని గత సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ పరిశీలించారు. దీంతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రితోపాటు ఉన్నతాధికారులు ప్రకటించారు. టెండర్‌ ప్రక్రియనే మిగిలి ఉందన్న ప్రచారం జోరుగా జరిగింది. ప్రాజెక్టు ఏర్పాటు కోసం సర్వేలు నిర్వహిం చేందుకు గత సంవత్సరం 6.87 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇం దులో ఎన్ని నిధులు విడుదల అయ్యాయో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెన్నూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని ముఖ్యమంత్రి హోదాలో జూన్‌ 9న జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ వచ్చే నాటికి ఐదు నెలల సమయం ఉన్నా మళ్లీ నిధులు విడుదల చేయకపోవడంతో అడుగులు ముందుకు పడలేదు.

కాళేశ్వరం కుంగుబాటుతో..

మరోవైపు జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద తాకిడికి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగుబాటుకు గురయ్యాయి. మరమ్మ తులకు కూడా కష్టసాధ్యమని అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయమై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టులో నీటి నిలువ కూడా ప్రశార్థకంగా మారింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుల సముదా యంపై ఆఽధారపడి నిర్మించతలపెట్టిన చెన్నూరు లిఫ్ట్‌ స్కీం భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కాళేశ్వరం పనికిరాదని భావిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత ప్రణాళిక ప్రకారం ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరిం చాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో చెన్నూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కథ కంచికేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

Updated Date - Dec 17 , 2023 | 10:31 PM