నల్ల నేల సంబురం..
ABN , Publish Date - Dec 22 , 2023 | 10:40 PM
సింగరేణి దేశ పారిశ్రామిక రంగానికి ఇంధన వనరు.. తెలంగాణ రాష్ట్రానికి సిరుల మాగాణి... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్ష కుటుంబాలకు అన్నం పెట్టే తల్లి సింగరేణి... 133 ఏళ్లుగా అవిశ్రాంతంగా నల్ల బంగారాన్ని అందిస్తోంది... బొగ్గు ఉత్పత్తిలోనే కాదు... విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతాంగానికి, పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తోంది... శనివారం సింగరేణి ఆవిర్భావ వేడుకలను జరుపుకునేందుకు కార్మికలోకం సిద్ధమైంది...
మంచిర్యాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బొగ్గు ఉత్పత్తిలో రారాజు సింగరేణి కాలరీస్ కంపెనీ. డిసెంబరు 23తో 133 వసంతాలు పూర్తి చేసుకోనుంది. యేటేటా నూతన ఆవిష్కరణలతో సింగరేణి ముందుకు సాగుతోంది. ‘ద హైద్రాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్’గా పిలవబడే సంస్థ తొలిసారిగా 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా 1920 డిసెం బర్ 23న సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌గా అవతరించింది. దేశంలో 1774 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ రాంచీలోని రాణిగంజ్ కోల్‌ఫీల్డ్ పేరి ట మే 4న బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 1956లో బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి శాస్త్రీయ పరమైన అభివృద్ధి కార్యక్రమాలు, పంచవర్ష ప్రణాళికలు వంటివి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతదేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి పేరు, ప్రఖ్యాతులు గడించింది. 19వ శతాబ్దపు పూర్వార్థంలో ఈ ప్రాంతంలో అన్వేషణ జరిపి బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.
నూతన ఆవిష్కరణలతో...
133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థ కాలక్రమేణ తన కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో అడుగిడింది. సింగరేణి వ్యాప్తంగా 400పై చిలుకు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అందులో 109 మెగావాట్ల ఉత్పత్తిని సంస్థ ఇప్పటికే ప్రారం భించగా మణుగూరు 30, రామగుండంలో 30 మెగావాట్లు, ఇల్లందులో 39 మెగావాట్లు, మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 10 మెగావాట్ల ప్లాంటుల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. తాను ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్‌ను పవర్ గిడ్‌కు సంస్థ అనుసంధానం చేస్తూ రాష్ట్ర అవసరాలను తీరుస్తోంది. రెండో దశ సోలార్ ఉత్పత్తిలో భాగంగా సింగరేణి నిర్మిస్తున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి 90 యూనిట్ల లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రెండో దశలో భాగంగా మందమర్రి ఏరియాలోని కాసిపేటలో ప్రారంభించిన తొలి ప్లాంటు నుంచి 15 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితోపాటు కొత్తగా ఐదు సోలార్ ప్లాంట్లను సింగరేణి సంస్థ ఏర్పాటు చేయనుంది. మందమర్రి ఏరియాలోని కాసిపేటలో 75 ఎకరాల్లో 15 మెగావాట్లు, మందమర్రిలోని ప్రాణహిత కాలనీలో 28 మెగావాట్లు మిగిలిన లక్ష్యంలో కొత్తగూడెంలోని 37 మెగావాట్లు, భూపాలపల్లిలోని 10 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుతోపాటు మూడో దశలో 81 మెగావాట్ల నీటిపై తేలియాడే ప్లాంట్లను నెలకొల్పేం దుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ రాష్ట్ర గిడ్‌కు అనుసంధానం కానుండగా, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్, సింగరేణి సోలార్ ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ కలిపి మొత్తం 1500 మెగావాట్ల విద్యుత్‌ను సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అందించనున్నది.
40వేల మంది కార్మికులతో...
గతంలో లక్షా 16 వేల కార్మికులతో కళకళలాడిన సింగరేణి సంస్థ ప్రస్తుతం కార్మికులను గణనీయంగా తగ్గించే పనిలో నిమగ్నమైంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది. బొగ్గు లక్ష్యాలు పెరుగుతున్నప్పటికీ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ ఫలితంగా కార్మికుల సంఖ్యను క్రమంగా కుదిస్తూ వస్తోంది. పర్మనెంట్ కార్మికుల స్థానంలో బొగ్గు బావుల్లో సుమారు రెండున్నర లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు.
ప్రైవేటీకరణ దిశగా...
సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు ఉన్నాయి. సంస్థ పరిధిలోని కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, కళ్యాణిఖని బ్లాక్-6 శ్రావణపల్లిలోని మరో బ్లాక్‌లను ప్రైవేటీకరిస్తూ కేంద్రం టెండర్లను కూడా ఆహ్వానించింది. దీన్ని సవాలుగా తీసుకున్న ఐదు జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐన్టీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్‌తో కలిసి టీబీజీకేఎస్ ఆందోళన బాట పట్టాయి. అయితే బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోవడం కోసం టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాపోవడంతో తాత్కాలికంగా ప్రైవేటీకరణ అంశం వాయిదా పడింది. భవిష్యత్తులో మళ్లీ ప్రైవేటీకరణకు పూనుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రైవేటీకరణ జరిగితే సింగరేణికి ఉన్న దశాబ్దాల ఘన చరిత్ర కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉంది.