‘బెల్ట్‘ ఫుల్
ABN , First Publish Date - 2023-06-26T22:49:03+05:30 IST
జిల్లాలో బెల్ట్ షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. అబ్కారిశాఖ అధికారు ల అండదండలతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా గల్లిగల్లికో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తోంది.
- కిరాణా దుకాణాల్లోనూ జోరుగా విక్రయాలు
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
- తిరగబడ్డ మహిళలపై కేసులు
మంచిర్యాల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బెల్ట్ షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. అబ్కారిశాఖ అధికారు ల అండదండలతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా గల్లిగల్లికో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తోంది. మంచినీళ్లు దొరకని షాపులు ఉన్నాయంటే అతిశయో క్తికాదు గానీ, మద్యం దొరకని చోటంటూ లేకపోవడం గమనార్హం. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది. వైన్, బార్ షాపుల్లో సమయసారిణి ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్టు షాపుల్లో మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటోంది. సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు.
వైన్ షాపులకు అనుబంధంగా...
మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో వైన్‌షాపుల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వైన్ షాపు పరిధిలో కనీసం 30 చొప్పున బెల్టు షాపులు అనుబంధంగా పని చేస్తున్నాయంటే అతిశయోక్తికాదు. తమ టార్గెట్లు చేరుకొనేందుకు బెల్టు షాపులను ఏర్పాటు చేయిస్తూ, అక్రమంగా మద్యం అమ్మకాలు సాగించే లా వైన్ షాపుల నిర్వాహకులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైన్ షాపుల నుంచి ఎమ్మార్పీ ఽధరలకు కొనుగోలు చేస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్‌పై 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. పల్లెల్లో ఎక్కడ చూసినా ప్రతి వాడలో కనీసం 10 వరకు బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల కారణంగా గ్రామాల్లోని వైన్ షాపుల్లో కూడా గణనీయంగా మద్యం అమ్మకాలు నమోదవుతున్నాయి. పట్టణాల్లో ఒక్కో వైన్ షాపులో సగటున రోజు 5 లక్షల రూపాయల వరకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్రమంగా సిట్టింగ్‌లు..
బెల్ట్ షాపుల్లో అక్రమంగా సిట్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ మందు బాబులను ఆకట్టుకుంటున్నారు. రెస్టారెంట్ మాదిరిగా అప్పటికప్పుడు ఆహార పదార్థాలు తయారు చేస్తూ నిర్వాహకులు అందజేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరిగా బెల్ట్ షాపుల్లో చికెన్, మటన్, గుడ్లు, ఆమ్లేట్, తదితర ఆహార పదార్థాలను అందుబాటులో పెడుతున్నారు. విచ్చిల విడిగా బెల్ట్ షాపులు, వైన్ షాపుల్లో సిట్టింగ్ కారణంగా బార్ అండ్ రెస్టారెంట్లలో గిరాకీలు పడిపోయాయి. దీంతో కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాటు చేస్తున్న బార్లకు నష్టం వాటిల్లుతుందని యజమానులు వాపోతున్నారు. జిల్లాలో 8 బార్ అండ్ రెస్టారెంట్లు, 63 వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాపుల్లో ఎక్కడ చూసినా అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతుండగా, బార్‌లలో విక్రయాలు క్రమంగా పడిపోతున్నాయి.
ఎక్సైజ్‌శాఖ చర్యలు శూన్యం..
విచ్చల విడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతుండగా అబ్కారీశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకో వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లిప్తతతో మద్యం కల్తీ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెల్టు షాపుల్లో మద్యం కల్తీ విపరీతంగా జరుగుతున్నట్లు ఆరోపణలు న్నాయి. కల్తీ మద్యం కారణంగా ప్రజలు ఆనారోగ్యాల భారిన పడే ప్రమాదం ఉంది. అయినా సరే అధికారులు పట్టించుకున్న పాపాన పోవ డం లేదు. పైగా వైన్ షాపులు, బెల్టు షాపుల నుంచి నెలవారీ మామూళ్లు అందుకుంటున్నారని బహిరంగ ప్రచారం జరుగుతోంది.
అడ్డుకుంటున్న మహిళలు..
విచ్చల విడిగా బెల్టు షాపులు ఏర్పాటవుతుండడంతో మహిళలు కొందరు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసి, కటకటాల పాలయ్యారు. మం దమర్రికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామిళ్ల రాధిక నేతృత్వంలో రెండు రోజుల క్రితం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. మందమ ర్రి పట్టణంలోని పలు బెల్ట్ షాపుల్లోకి వెళ్లి మద్యం అమ్మకాలు నిలిపివే యాలని హెచ్చరించారు. వినకుండా ఎదురుతిరిగిన వారి షాపులకు వెళ్లి మద్యం సీసాలను బహిరంగంగా రోడ్డుపై పగుల గొట్టారు. దీంతో షాపుల నిర్వాహకులకు, కాంగ్రెస్ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బెల్ట్ షాపుల నిర్వాహకులే రాధిక వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. దీన్ని నిరసిస్తూ రాధిక దీక్ష చేస్తుండగా పోలీసులు ఆమెను సోమవారం మంచిర్యాల కోర్టులో హాజరుపరిచారు. కోర్డు ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విఽ దించింది. రాధిక పగులగొట్టిన బెల్ట్ షాపు అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారిది కావడంతోనే పోలీసులు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.