నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు

ABN , First Publish Date - 2023-09-20T01:11:01+05:30 IST

గోదావరి పరివాహానికి ఆను కొని ఉన్న జిల్లాలో కొత్తగా 23 చెక్‌డ్యాంలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ జారీ చేసింది.

నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు
కుంటాల మండలంలో నిర్మించిన చెక్‌ డ్యాం

రూ. 133.79 కోట్ల విడుదలకు సర్కారు ఆమోదం

లక్ష్మీపూర్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌కు అటవీశాఖ ఆటంకాలు

టెండర్‌దశలో ప్రక్రియ

నిర్మల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గోదావరి పరివాహానికి ఆను కొని ఉన్న జిల్లాలో కొత్తగా 23 చెక్‌డ్యాంలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ జారీ చేసింది. గోదావరి నది ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి నీటి ప్రవాహవృధాను అరికట్టాలన్న లక్ష్యంతో ఈ చెక్‌డ్యాంల ప్రతిపాదనలు రూపొందాయి. గతంలో నిర్మించిన చెక్‌డ్యాంల నిర్మాణాలపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అందుకు అనుగుణంగా లోపాలను సరిదిద్ది దిట్టుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 23 కొత్త చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడమే కాకుండా రూ.133.79 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్త ర్వులు వెలువరించింది. క్షేత్రస్థాయిలో ఉన్న ఆటంకాలను అధిగమించి పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా ఈ పనులకు సంబంధించి టెండర్‌ల ప్రక్రియ మొదలుకానుంది. వీటితో పాటు ఖానాపూర్‌ నియోజకవర్గం కడెం మండలంలోని పాండ్వపూర్‌ వద్ద లక్ష్మీపూర్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణానికి సైతం ప్రభుత్వం ఇటీవలే ఆమో దం తెలపడమే కాకుండా రూ.40 కోట్లను మంజూరు చేసింది. అయితే ఐదు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించే ఈ లక్ష్మీపూర్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణానికి అటవీశాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ జారీ కాగానే పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ప్రతియేటా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి సంబందించిన ఉప నదులు, కాలువల ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు వృధా అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా నీటి వృధాను అరికట్టడమే కాకుండా నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూపకల్పన జరిగింది.

నిర్మల్‌ నియోజకవర్గంలో..

కాగా నిర్మల్‌ నియోజకవర్గంలో కొత్తగా ఏడు చెక్‌డ్యాంలను నిర్మించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ జారీ చేసింది. మొత్తం ఏడు చెక్‌డ్యాంల నిర్మాణాలకు గానూ రూ.36.87 కోట్ల నిధులు మంజూరయ్యాయి. సోన్‌ మండలంలోని జాప్రాపూర్‌, లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి, నిర్మల్‌ మండలంలోని వెంగ్వాపూర్‌లలో ఈ చెక్‌డ్యాంలను నిర్మించనుండగా సారంగాపూర్‌ మండలంలోని పోట్యా తాండ, తాండ్ర, బోరిగాం, కౌట్ల(బి) గ్రామాల్లో చెక్‌డ్యాంలను నిర్మించ తలపెట్టారు. మొత్తం రూ. 36 కోట్లతో నిర్మించనున్న ఈ చెక్‌డ్యాంలు దాదాపు 20 గ్రామాలకు సాగునీరు అందించనున్నాయి. గోదావరి నదికి ఉపనదిగా పిలవబడే స్వర్ణ నది కాలువపైనే వీటన్నింటిని నిర్మించనున్నారు. స్వర్ణ నది నీరంతా ప్రతియేటా పెద్ద ఎత్తున గోదావరి నదిలో వృధాగా కలుస్తోంది. అయితే ఈ కొత్త చెక్‌డ్యాంల నిర్మాణంతో నీటి ప్రవాహమంతా వాగులోనే నిలిచిపోయి నాలుగైదు గ్రామాలకు తాగునీటితో పాటు బహుళ ప్రయోజనాలు దక్కనున్నాయి.

ముథోల్‌ నియోజకవర్గంలో..

ఇదిలా ఉండగా ముథోల్‌ నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగానే ఈ తొమ్మిది చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.44.53 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. భైంసా మండలంలోని దేగాం, కామోల్‌, లోకేశ్వరం మండలంలోని పుస్పూర్‌, హద్గాం, సాద్గాం, కుభీర్‌ మండలంలోని రాజురా, కుస్లీ గ్రామాల్లో ఈ చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టనున్నారు. తానూర్‌ మండలంలోని జరి(బి) గ్రామంలో కూడా ఈ చెక్‌డ్యాంను నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీంతో ముథోల్‌ నియోజకవర్గంలో అదనపు ఆయకట్టు సాగులోకి రానుందంటున్నారు. సాగునీటితో పాటు భూగర్బ జలాల పెంపు, పశువులకు తాగునీటి సౌక ర్యం, ఇతరత్రా సౌకర్యాల కోసం ఈ నీరు ఉపయోగపడనుంది.

ఖానాపూర్‌ నియోజకవర్గంలో...

ఖానాపూర్‌ నియోజకవర్గంలోని గోదావరి పరివాహాకంపై ఏడు చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించేందుకు తలపెట్టారు. దీని కోసం గానూ రూ. 52.38 కోట్లను మంజూరు చేశారు. పెంబి మండలంలో మొత్తం ఐదు చోట్ల ఈ చెక్‌డ్యాంల నిర్మాణాలను చేపట్టనున్నారు. కొసగుట్ట, తాటిగూ డ, శేట్‌పెల్లి, ఇటీక్యాల తాండ, మదనపల్లె గ్రామాల్లో ఈ చెక్‌డ్యాంలను నిర్మిస్తారు. అలాగే జన్నారం మండలంలోని రోటిగూడ, మొర్రిగూడతో పాటు తదితర గ్రామాల్లో వీటిని నిర్మించనున్నారు.

లక్ష్మీపూర్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

గత ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఖానాపూర్‌ నియోజకవర్గంలోని లక్ష్మీపూర్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే రూ.40 కోట్లను సైతం మంజూరు చేసింది. అయితే అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చినప్పటికి వైల్డ్‌లైఫ్‌ విభాగం నుంచి అనుమతులు జారీ కాలేదు. ఈ లిప్ట్‌ ఇరిగేషన్‌ పూర్తయితే దోస్త్‌నగర్‌, నవాబ్‌పేట్‌, లక్ష్మిపూర్‌, కల్లెడ, అక్కొండపేట్‌ గ్రామాల్లోని 3వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. లిప్ట్‌ ఇరిగేషన్‌ పూర్తయితే ప్రాంతానికి సాగునీరు పుష్కలంగా అందనుంది.

Updated Date - 2023-09-20T01:11:01+05:30 IST