సమీకరణ లక్ష్యం

ABN , First Publish Date - 2023-06-03T00:53:42+05:30 IST

జిల్లాకేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్‌ పర్యటనకు సంబందించి పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 సమీకరణ లక్ష్యం
కొత్త కలెక్టరేట్లో ఏర్పాట్లపై మంత్రి, కలెక్టర్‌

అంతా మంత్రి అల్లోల కనుసన్నల్లోనే

ముథోల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలకు బాధ్యతలు

కొత్త కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్‌ కార్యాలయాల వద్ద భారీగా ఏర్పాట్లు

బహిరంగ సభ కోసం ప్రత్యేకవేదిక నిర్మాణం

నిర్మల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్‌ పర్యటనకు సంబందించి పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కన్నుసన్నల్లోనే ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ కొత్త కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే డబుల్‌ బెడ్‌రూంను కూడా లబ్దిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమాల తరువాత నిర్వహించే భారీ బహిరంగసభ నిర్వహణను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ సభకు లక్ష మంది జనాన్ని సమీకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంతో పాటు ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని ఈ బహిరంగసభకు తరలించాలని నిర్ణయించారు. నిర్మల్‌ నియోజకవర్గ జనసమీకరణ బాధ్యతలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తీసుకోగా, ముథోల్‌ నియోజకవర్గ బాధ్యతలను అక్కడి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి, ఖానాపూర్‌ నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్యే రేఖానాయక్‌కు అప్పజెప్పారు. ఇప్పటికే భారీసంఖ్యలో వాహనాలను సమకూర్చారు. సాయంత్రం 6గంటల తరువాత ఈ భారీ బహిరంగసభను జరిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వేళలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే జనసమీకరణను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌రెడ్డిలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సీఎం ముందు బల ప్రదర్శనను తలపించే విధంగా పోటాపోటీగా జనసమీకరణ పనుల్లో వీరంతా బిజీగా మారారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జన సమీకరణకు సంబంధించి పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నిర్మల్‌ పట్టణంతో పాటు అన్ని మండలాల నుంచి భారీసంఖ్యలో జనాన్ని సీఎం సభకు రప్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు. పట్టణ పరిధిలో వార్డుల వారిగా బాద్యతలను కౌన్సిలర్‌లకు అప్పజెప్పారు. అలాగే మండల, గ్రామస్థాయిలో అక్కడి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు జనం తరలింపు భాధ్యతలు అప్పజెప్పారు. దీనికి సంబంధించి జన సమీకరణ కోసం మండలాల వారీగా వాహనాలను సమకూరుస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యేలకు జన సమీకరణ ఛాలెంజ్‌గా మారింది. జన సమీకరణ విషయంలో ఇంటలిజెన్స్‌ వర్గాలు పార్టీ అధిష్టానానికి స్పష్టమైన నివేదికలు అందించనున్నట్లు సమాచారం. ఇంటలిజెన్స్‌ నివేదికల కారణంగానే ఎమ్మెల్యేలు తమ బలాన్ని నిరూపించుకునేందు కోసం పోటాపోటీగా జన సమీకరణలో నిమగ్నమయ్యారు.

అంతా మంత్రి డైరెక్షన్‌లోనే..

కాగా సీఎం పర్యటనకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అంతా ఆయన డైరెక్షన్‌లోనే సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ బహిరంగసభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు మంత్రి సీరియస్‌గా కసరత్తు మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగానే లక్ష మందితో బహిరంగసభను నిర్వహించి సీఎం కేసీఆర్‌ వద్ద జిల్లా బలాన్ని చాటాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌రెడ్డిలకు అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులకు టార్గెట్‌లు ఖరారు చేశారు. ఈ టార్గెట్‌లకు అనుగుణంగా నేతలంతా ప్రస్తు తం జనసమీకరణలో నిమగ్నమయ్యారు. పోటాపోటీగా స్థానిక నాయకులు సైతం జనాన్ని తరలించే ఏర్పాట్లలో బిజీగా మారారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే జనాన్ని బహిరంగ సభాస్థలి వద్దకు తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జిల్లాకేంద్రంలోని నాలుగు వైపుల నుంచి జనంభారీగా తరలిరానున్నందున వాహనాల పార్కింగ్‌కు ఇబ్బం దులు లేకుండా చూస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గత నాలుగైదు రోజుల నుంచి సభావేదిక నిర్మాణంతో పాటు సభా ప్రాంగణంపై ఫోకస్‌ పెట్టారు. భారీ ఎత్తున టెంట్లు వేసి జనానికి ఎండ నుంచి ఉపశమనం కల్పించనున్నారు. అలాగే మజ్జిగ, నీటిప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

ఖానాపూర్‌ ఎమ్మెల్యేపై..

గత కొద్దికాలం నుంచి రాజకీయంగా చర్చనీయాంశమవుతున్న ఖానాపూర్‌ నియోజకవర్గంపై ఈ సారి బీఆర్‌ఎస్‌ ప్రత్యేకదృష్టి సారిస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే రేఖానాయక్‌కు టికెట్‌ విషయంలో కొంతమంది పోటీగా వస్తుండడం అలాగే వారంతా వేరువేరుగా పర్యటనలు చేస్తూ రేఖా నాయక్‌కు కంట్లోనలకగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం పర్యటనను ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. పార్టీలో తనను విభేధిస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సీఎం పర్యటనను వేదికగా మలుచుకోవాలని ఆమె భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఖానాపూర్‌ నియోజకవర్గంలోకి అన్ని మండలాల నుంచి భారీగా సీఎం సభకు జనాన్ని తరలించేందు కోసం రేఖానాయక్‌ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. మంత్రితో ఇటీవల సమావేశమైన ఎమ్మెల్యే రేఖానాయక్‌ జన సమీకరణకు సంబంధించి సీరియస్‌గా చర్చలు జరిపారు. దీనికి అనుగుణంగానే ఆమె అన్ని మండలాలతో పాటు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి భారీగా జనాన్ని సీఎం సభకు తరలించే పనిలో నిమగ్నమయ్యారంటున్నారు.

ముథోల్‌ నియోజకవర్గం...

సీఎం సభ కోసం ముథోల్‌ నియోజకవర్గం నుంచి కూడా పెద్దసంఖ్యలో జనాన్ని తరలించేందు కోసం అక్కడి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులందరితో సమావేశమైన ఎమ్మెల్యే అన్ని గ్రామాల నుంచి జనాన్ని నిర్మల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉండడం, ఆ పార్టీకి సంబందించిన ముగ్గురు నేతలు పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో సీఎం సభకు భారీగా జనాన్ని సమీకరించి తన సత్తాను చాటుకోవాలని ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి భావిస్తున్నారంటున్నారు. దీని కోసం ఆయన ఇప్పటికే స్థానిక నేతలతో సమావేశా లు నిర్వహించి రూట్‌మ్యాప్‌ సిద్దం చేశారు. దీనికి అనుగుణంగా గ్రామాల వారీగా అవ సరమైన మేరకు వాహనాలను సమకూర్చే పని లో ఉన్నారు.

Updated Date - 2023-06-03T00:53:42+05:30 IST