దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-06-26T22:41:33+05:30 IST

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 26 : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. భీమిని మండలానికి చెందిన భీమయ్య వడాల గ్రామ శివారులో తమ తాతల భూమిని సాగు చేస్తున్నామని , పట్టా పాసు బుక్‌ అందజేయలని దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన మనోహర్‌ చెన్నూరు మండలంలోని నాగపురి శివారులో రామ్మూర్తి పేరిట ఉన్న జాయింట్‌ పట్టా ధరణిలో ఒకరి పేరుపై నమోదు చేశారని చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశాడు. మందమర్రి, జైపూర్‌, శ్రీరాంపూర్‌, నస్పూర్‌, బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, జన్నారం, దండేపల్లి, రామకృష్ణపూర్‌ల నుంచి ప్రజలు వచ్చి దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సంతోష్‌ మాట్లాడారు. నస్పూర్‌లోని నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు గమనించి ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన వచ్చిందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోని సమస్యలపై 46 దరఖాస్తులు, సంక్షేమ శాఖకు సంబంధించి 41, వ్యవసాయ శాఖకు సంబంధించి 32, రెవెన్యూ శాఖకఉ సంబంధించి 27 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇరిగేషన్‌ 28, ఇంటర్‌ విద్యాశాఖ 14, విద్యాశాఖ 18, మిషన్‌ భగీరథ 7, పంచాయతీ రాజ్‌ శాఖ 20, ఎస్సీ కార్పోరేషన్‌ 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవో లు వేణు, శ్యామలాదేవి, జిల్లా అధికారులు దుర్గా ప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ సుబ్బారాయుడు, ఫయాజ్‌ఖాన్‌, నీలిమ, రజనీ, అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:41:33+05:30 IST