ఇక రేషన్‌ దుకాణాల్లో బహుళ సేవలు

ABN , First Publish Date - 2023-03-31T01:39:12+05:30 IST

చాలా ఏళ్ల నుంచి రేషన్‌ దుకాణాల డీలర్లు తమ కమీషన్‌ను పెంచాలని, ఇతర వస్తువుల అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలంటూ కోరుతున్నప్పటికీ వారి డిమాండ్‌ను ఇప్పటి వరకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.

ఇక రేషన్‌ దుకాణాల్లో బహుళ సేవలు
జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఇదే

బ్యాంకింగ్‌ సేవలు.. ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపులు

డీలర్లకు ఆదాయం పెంచేందుకే సర్కారు నిర్ణయం

అలాగే తపాలా సేవలు కూడా అమలుకు సన్నాహాలు

అవసరమైతే మినీ ఏటీఎంలు ఏర్పాటు

నిర్మల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : చాలా ఏళ్ల నుంచి రేషన్‌ దుకాణాల డీలర్లు తమ కమీషన్‌ను పెంచాలని, ఇతర వస్తువుల అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలంటూ కోరుతున్నప్పటికీ వారి డిమాండ్‌ను ఇప్పటి వరకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. గతంలో కిరోసిన్‌, ఫామాయిల్‌, గోధుమలు లాంటి వస్తువులను సబ్సిడీ ధరలపై రేషన్‌దుకాణాల్లో అమ్మేవారు. క్రమంగా ఫామాయిల్‌, గోధుమల అమ్మకాలను నిలిపివేయగా ఇటీవలే కిరోసిన్‌ అమ్మకాలను కూడా ఆపేశారు. దాదాపు మూడు, నాలుగు ఏళ్ల నుంచి కేవలం బియ్యం మాత్రమే రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దీంతో వందలాది మంది రేషన్‌డీలర్లు కమీషన్‌ డబ్బులు తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులపాలు అవుతున్నారు. అలాగే రేషన్‌ దుకాణాల నిర్వహణకు అధికవ్యయాన్ని భరిస్తున్నారు. కమీషన్‌ తక్కువగా వస్తుండడం, దుకాణాల కిరాయి పెరిగిపోతుండడం, కూలీల భారం, కరెంటు బిల్లులు లాంటి వాటివి డీలర్లకు అదనపు భారమయ్యాయి. దీంతో వారంతా కమీషన్‌లు పెంచాలని లేదా తమకు నెలసరి వేతనం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. వీరి డిమాండ్‌పై ప్రభుత్వం కనీసస్థాయిలో ఇప్పటి వరకు స్పందించలేదు. రేషన్‌డీలర్ల ఒత్తిడి పెరిగిపోతుండడం అలాగే ప్రతిపక్షాల నుంచి విమర్శలు తలెత్తుతున్న కారణంగా ప్రభుత్వం కొత్త కార్యచరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ఇక నుంచి రేషన్‌ దుకాణాలను మల్టీపర్పస్‌ రేషన్‌ దుకాణాలుగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టబోతోంది. ఇందులో భాగంగానే రేషన్‌ దుకాణాల్లో ఇతర వస్తువుల విక్రయాలతో పాటు మిని బ్యాంకింగ్‌ రంగ సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో కరెంటు బిల్లుల చెల్లింపు, ఎల్‌ఐసీ ప్రీమియంల చెల్లింపుతో పాటు పరిమితికి లోబడి నగదు బదిలీ, పోస్టల్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కార్యకలాపాలకు సంబందించి డీలర్లకు కమిషన్‌లు కూడా చెల్లించాలని యోచిస్తున్నారు. మీ సేవా కేంద్రాల మాదిరిగా వారు అందించే సేవలకు గానూ కమీషన్‌ను ఖరారు చేస్తున్నారు. దీని కారణంగా రేషన్‌డీలర్లకు ప్రస్తుతం సబ్సిడీబియ్యం అమ్మకాలతో వచ్చే కమీషన్‌ డబ్బులకు ఈ సేవలకు వచ్చే డబ్బులు తోడవుతాయంటున్నారు. దీని కారణంగా డీలర్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

డీలర్లపై నిర్వహణ భారం

ప్రస్తుతం రేషన్‌దుకాణాల నిర్వహణ సంబంధిత డీలర్లకు తడిచి మోపెడవుతోందంటున్నారు. ఈ దుకాణాల్లో కేవలం బియ్యంను మాత్రమే పంపిణీ చేస్తుండడం, కమిషన్‌లు పెరగకపోవడంతో వారు ఆర్థికంగా సతమతమవుతున్నారు. షాపుల నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో కమిషన్‌ డబ్బులతో పాటు మరికొంత తమ సొంత డబ్బులను నిర్వహణ కోసం వ్యయం చేయాల్సి వస్తోందంటున్నారు. కేవలం ఒక్క బియ్యంను మాత్రమే రేషన్‌దుకాణాల్లో అమ్ముతున్న కారణంగా కమిషన్‌ నామమాత్రంగానే వారికి లభిస్తోంది. రేషన్‌దుకాణం అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో డీలర్లు ఆ అద్దెను చెల్లించలేకపోతున్నారు. అలాగే కూలీల భారం, కరెంటుబిల్లులు కూడా వారికి అదనమవుతున్నాయంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ దుకాణాల అద్దె కనీసం రూ.5వేలకు తక్కువగా కాకుండా ఉంటోందంటున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్‌లలో దుకాణాల అద్దె భారీగా ఉంటోందని చెబుతున్నారు. దీనికి తోడు మండల కేంద్రాల్లో కూడా అద్దెలు సమస్యగా మారుతోందని పేర్కొంటున్నారు. దీనికి తోడు బియ్యం సంచుల్లో తరుగు పెద్దమొత్తంలో రావడం తమకు నష్టం కలిగిస్తోందని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 412 మంది రేషన్‌ డీలర్లు కొనసాగుతున్నారు.

మల్టీపర్పస్‌ సర్వీస్‌ సెంటర్‌లుగా..

ఇదిలా ఉండగా రేషన్‌ దుకాణాలను ఇక నుంచి మల్టీపర్పస్‌ సర్వీస్‌ సెంటర్‌లుగా మార్చేందుకు కసరత్తు మొదలైందంటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యంతో పాటు మరికొన్ని ఆహర వస్తువులను కూడా ఈ రేషన్‌దుకాణాల్లో విక్రయించాలని భావిస్తున్నారు. మినీ సూపర్‌బజార్లుగా మార్చి ఆహార వస్తువులతో పాటు అవసరమైతే ఇతర వస్తువులను కూడా విక్రయించేందుకు నిర్ణయించారు. దీంతో పాటు నగదు లావాదేవీల ప్రక్రియను కూడా రేషన్‌దుకాణాల్లో మొదలుపెట్టే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయంటున్నారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపులు, కరెంటు బిల్లుల చెల్లింపులు, మినీ ఏటీయంల ఏర్పాటు, పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు లాంటి వాటిని రేషన్‌ దుకాణాల్లో మొదలుపెట్టాలని యోచిస్తున్నారు.

ఆచరణపైనే సందిగ్ధత..

కాగా రేషన్‌దుకాణాలను మల్టీపర్పస్‌ సెంటర్‌లుగా తీర్చిదిద్దాలన్న సర్కారు నిర్ణయంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఆచరణలో ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందోలేదోనన్న సంశయాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా నగదు లావాదేవీల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని ఇప్పటికే పలు బ్యాంకులకు సంబందించి సర్వీస్‌ సెంటర్‌లలో అవకతవకలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రేషన్‌దుకాణాల్లో నగదు లావాదేవీల వ్యవహారం సాధ్యం అవుతుందో లేదోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే రేషన్‌కార్డుదారులు ఎక్కడైనా బియ్యాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించడం అలాగే 15 రోజులు మాత్రమే విక్రయాలు జరపాలన్న నిబంధన ఉండడంతో కార్డుదారులు ఒకేసారి పెద్దసంఖ్యలో దుకాణాలకు తరలివస్తుంటారు. దీంతో రేషన్‌ దుకాణాలు అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు లబ్దిదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైన కార్యకలాపాలు నిర్వహించడం, ఇతర వస్తువుల విక్రయాలు చేపట్టడం, ఆర్థిక పరమైన కార్యకలాపాలను నిర్వహించడం లాంటి వ్యవహారాలు డీలర్లకు భారంకావచ్చని చెబుతున్నారు.

Updated Date - 2023-03-31T01:39:12+05:30 IST