Share News

చీరలంటూ 3 లక్షలకు టోకరా

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:42 AM

ఊర్లోకొచ్చి చీరలమ్మో చీరలంటూ బైక్‌ల మీద తిరిగే వారి విషయంలో జాగ్రత్త! అదో మాయదారి ముఠా కావొచ్చు. అప్రమత్తంగా లేకపోయారో చీరలమ్మే ముసుగులో మిమ్మల్ని మాటల్లో పెట్టి ఇంట్లో సొమ్మంతా కాజేసినా కాజేయొచ్చు! ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ గిరిజనుడి

చీరలంటూ 3 లక్షలకు టోకరా

చీరలు విక్రయించే ముసుగులో మధ్యప్రదేశ్‌ ముఠా మాయ

నోట్లను రంగునీళ్లలో ముంచితే పదింతలవుతాయని మోసం

డబ్బుతో పరార్‌.. ఆదిలాబాద్‌ జిల్లాలో ఘటన.. నలుగురి అరెస్టు

ఇచ్చోడ, డిసెంబరు 25: ఊర్లోకొచ్చి చీరలమ్మో చీరలంటూ బైక్‌ల మీద తిరిగే వారి విషయంలో జాగ్రత్త! అదో మాయదారి ముఠా కావొచ్చు. అప్రమత్తంగా లేకపోయారో చీరలమ్మే ముసుగులో మిమ్మల్ని మాటల్లో పెట్టి ఇంట్లో సొమ్మంతా కాజేసినా కాజేయొచ్చు! ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ గిరిజనుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని.. ఇంట్లో ఉన్న డబ్బును పదింతలు చేస్తామని నమ్మించి రూ.3లక్షల తీసుకొని పరారైందో ముఠా. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ సర్కిల్‌ కార్యాలయంలో ఉట్నూర్‌ డీఎస్పీ నాగేందర్‌ కేసు వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతానికి చెందిన పర్నాల్‌ గౌండ్‌, కువార్‌దేవి గౌండ్‌, సలామ్‌ గౌండ్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు. సిరికొండ మండలం రాజంపేట్‌ గ్రామంలో చీరలు, బెడ్‌షీట్లు అమ్ముతామంటూ బైక్‌ల మీద తిరిగారు. ఆ గ్రామస్థుడైన పెందూర్‌ జంగు అనే గిరిజనుడు నుంచి చీరలు కొన్నారు. మాటల్లో భాగంగా జంగు తన సమస్యలను చీరలు అమ్మే వ్యక్తులకు చెప్పుకొన్నాడు. తనకు ఆర్థికంగా ఇబ్బందులున్నాయని, సంతానం కూడా లేదని చెప్పుకొని వాపోయాడు. తమకు మహారాజ్‌ బాబా అనే గురువు తెలుసునని, ఆయన్ను కలిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగి పోతాయని, సంతానం కూడా కలుగుతుందని జంగుకు వారు చెప్పారు. వారి మాటల్ని పూర్తిగా నమ్మినం జంగు.. వారు చెబితే వెళ్లి ఇచ్చోడలో సదరు మహారాజ్‌ బాబాను కలిశాడు. రూ.3లక్షలు తెచ్చిస్తే ఆ డబ్బును మంత్రించి ప్రత్యేక రసాయనాలు కలిపిన రంగునీటిలో ముంచుతానని, ఆ నగదు రూ.30లక్షలతో పదింతలవుతుందంటూ జంగును బాబా నమ్మించాడు.

ఇటీవల రూ.3లక్షల నగదును మహారాజ్‌ బాబాకు జంగు అప్పగించాడు. అయితే ప్రస్తుతం తాను రంగు నీటిలో కలిపే రసాయనాలు తీసుకురాలేదని, మళ్లీ వచ్చినప్పుడు పదింతలు చేసిస్త్తానని చెప్పి జంగు వద్ద నుంచి రూ.3లక్షల నగదు తీసుకొని వెళ్లిపోయాడు. అయితే ఆ మహారాజ్‌ బాబా మళ్లీ గ్రామానికి రాకపోవడంతో జంగుకు అనుమానమొచ్చి పోలీసులను ఆశ్రయించాడు. ఇచ్చోడ సీఐ పెద్దపల్లి చంద్రశేఖర్‌ తన సిబ్బందితో రంగంలోకి దిగి చాకచక్యంగా వ్యవహరించారు. జంగుతో ముఠాలోని నిందితులకు ఫోన్‌ చేయించి మాట్లాడించారు. తాను మరో రూ.7లక్షల నగదును ఏర్పాటు చేశానని ఫోన్‌లో జంగు చెప్పగా, సరేనన్న నిందితులు తాము వస్తామని డబ్బుతో సిద్ధంగా ఉండాలని అతడికి చెప్పారు. మహారాజ్‌ బాబాతో పాటు పర్నాల్‌ గౌండ్‌, కువార్‌దేవి గౌండ్‌, సలామ్‌ గౌండ్‌ రెండ్రోజుల క్రితం రాజంపేటకు ఓ కారులో గ్రామానికొచ్చారు. ముందుగానే కాపు కాసిన పోలీసులు మహారాజ్‌ బాబా, పర్నాల్‌ గౌండ్‌, కువార్‌దేవి గౌం డ్‌, సలామ్‌ గౌండ్‌ను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 2.10 లక్షల నగదు, కారు, రెండు బైక్‌లు, నాలుగు ఫోన్లు, రంగు నీటి కోసం ఉపయోగించే బకెట్‌, సరుపు ప్యాకెట్‌, రెండు గాజు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. మహారాజ్‌ బాబాగా చెలామణి అవుతున్న అతడి అసలు పేరు రామ్‌వీర్‌ గౌండ్‌ అని.. అతడూ ఆ ముఠాలోని సభ్యుడేనని నిర్ధారించారు.

Updated Date - Dec 28 , 2023 | 07:19 AM