మేం అధికారంలోకి వచ్చాక.. పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తాం
ABN , First Publish Date - 2023-03-07T03:31:12+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజస్థాన్‌లో మాదిరిగా సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ తీసుకువస్తామని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో హర్షవర్థన్‌రెడ్డిని గెలిపించండి
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ టీచర్లతో ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజస్థాన్‌లో మాదిరిగా సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ తీసుకువస్తామని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. 317 జీవోతో కోల్పోయిన స్థానికతనూ పునరుద్ధరిస్తామన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డిని గెలిపించాలంటూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ టీచర్లకు విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ టీచర్ల సంక్షేమం కోసం పోరాడే సమర్థత ఉన్న నేత హర్షవర్థన్‌రెడ్డి అన్నారు. టీచర్ల పదోన్నతుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి రోజునే వేతనాలు పడేలా చూస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.