Share News

ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది

ABN , First Publish Date - 2023-11-08T22:58:28+05:30 IST

నారాయణపేటలోని పేరపళ్ల జాయమ్మ చెరువుకు కేవలం రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామల మౌతుందని, బీజేపీ అధికారంలోకి వస్తే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి ఏడాది లోపే లక్ష ఎకరాలకు సాగు అందిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది
నారాయణపేటలో నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

బీజేపీ అధికారంలోకి వస్తే జాయమ్మ చెరువుకు నిధులు కేటాయిస్తాం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌

నారాయణపేటలో రోడ్‌ షో

నారాయణపేట, నవంబరు 8: నారాయణపేటలోని పేరపళ్ల జాయమ్మ చెరువుకు కేవలం రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామల మౌతుందని, బీజేపీ అధికారంలోకి వస్తే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి ఏడాది లోపే లక్ష ఎకరాలకు సాగు అందిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. జాయమ్మ చెరువుకు నిధులివ్వాలని ప్రజలు, ప్రతిపక్షాలు అడుగుతున్నారని, తాను పాదయాత్ర చేసిన సమయంలో కూడా ప్రస్తావించానని, అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పోయేకాలం దగ్గరికొచ్చిందని అన్నారు. బీజేపీ అభ్యర్థి రతంగ్‌ పాం డురెడ్డికి మద్దతుగా నారాయణపేట జిల్లా కేంద్రంలో బుధవారం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. నారాయణపేట జిల్లాలో వలసలు ఇంకా ఉన్నాయని, తాను జిల్లాలో పాద యాత్ర చేసినప్పుడు ముంబై బస్సులో వలస వెళ్తున్న వారితో మాట్లాడి నిరూపించామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించించేందుకు పరిశ్రమలను పెడతామని ఆనాడే నిర్ణయిం చుకున్నామన్నారు.

కేసీఆర్‌ చెంప చెల్లుమనిపించేలా చేశా

పచ్చకామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కేసీఆర్‌ కుటుంబం తీరు ఉందన్నారు. కుటుంబంలో అందరికీ పదవులు ఉన్నందున తెలం గాణా అంతా బాగుందని అంటున్నాడన్నారు. జిల్లాకు వచ్చి పాలమూరు పచ్చగా కళకళ లాడుతుందని, వలసలు ఆగి పోయాయని చెబుతుంటే.. రోజూ పొట్ట చేత పట్టుకొని ముంబయ్‌, పూణెలకు వలస వెళ్తున్న వందల కుటుంబాలను తాను ప్రపంచానికి చూపించి కేసీఆర్‌ చెంప చెల్లుమనిపించేలా చేశానన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని కోటకొండ, కాన్‌కూర్తి, గార్లపాడ్‌ గ్రామాలను మండలాలుగా ప్రకటించాలనే డిమాండ్‌ ఉందని, 150 రోజులు నిరసన చేపట్టినా కేసీఆర్‌ పట్టించు కోకుండా ఇక్కడి ప్రజలను అవమానించారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల అభీష్టం మేరకు మూడు మండలాలను ప్రకటిస్తామన్నారు. బీజేపీ పార్టీ బీసీ అభ్యర్థిని సీఎం చేయడం ఖాయమమన్నారు. రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్‌ కానీ, బీఆర్‌ఎస్‌ కానీ అధికారంలోకి వస్తే మళ్లీ ఉప ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించి బీజేపీ అభ్యర్థి రతంగ్‌ పాండురెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గోవా ఎమ్మెల్యే కృష్ణ, నాయకులు నాగూరావు నామాజీ, సత్యాయాదవ్‌, రఘు రామయ్య, వెంకట్రాములు, నందు నామాజీ, నర్సిములు, రఘువీర్‌ యాదవ్‌, వెంకటయ్య బీజేపీ పదాధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-08T22:58:29+05:30 IST