గ్రూప్ వన్ మెయిన్స్‌కు.. ఒక పోస్టుకు 150 మందిని పిలవాలి
ABN , First Publish Date - 2023-03-04T04:08:55+05:30 IST
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్‌సపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపిక కోసం ఒక పోస్టుకు 150 మంది అభ్యర్థులను పిలవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి..

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్‌సపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపిక కోసం ఒక పోస్టుకు 150 మంది అభ్యర్థులను పిలవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎంకు రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మీ ప్రభుత్వంలో మొదటి సారిగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. నిరుద్యోగులు అనేక మంది గ్రూప్ వన్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కానీ మెయిన్స్ ఎంపికకు ఒక పోస్టుకు 50 మంది అభ్యర్థులకే అవకాశాలను కల్పించడం వల్ల దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది నష్టపోతారని పేర్కొన్నారు. మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే వరకు చాలా మంది నిరుద్యోగులు వయసు రీత్యా దరఖాస్తు చేసుకోవడానికే అర్హత కోల్పాతారని తెలిపారు. అందువల్ల మెయిన్స్ ఎంపిక కోసం నిర్వహించే రాతపరీక్షకు ఒక పోస్టుకు 50 మందిని కాకుండా 150 మందికి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే పరీక్షా పత్రం కూడా ఆంగ్ల భాషలో ఉంటుందని, అయితే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థులు ఎక్కువగా తెలుగు మీడియం చదివిన వారు ఉంటారని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమైన పరీక్షలన్ని ఆంగ్లభాషతో పాటు ప్రాంతీయ భాషల్లో ఉంటున్నాయని తెలిపారు. అందువల్ల మన రాష్ట్రంలోనూ గ్రూప్‌వన్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఉద్యోగ ప్రవేశ పరీక్షలన్నిటికీ పరీక్షా పత్రాలను ప్రాంతీయ భాషలో ఇవ్వాలని జగ్గారెడ్డి ఆ లేఖలో కోరారు.