మండలానికి 30 వేలు ఏం సరిపోతయ్‌?

ABN , First Publish Date - 2023-06-02T02:03:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు డబ్బులెలా సర్దుబాటు చేయాలో తెలియక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)లు తలలు పట్టుకుంటున్నారు.

మండలానికి 30 వేలు  ఏం సరిపోతయ్‌?

ఉత్సవాలకు కనీసం రూ.10 లక్షల ఖర్చు!

నిర్వహణకు డబ్బులు ఎలా సర్దాలి?

సీఎం కప్‌తోనే జేబుకు చిల్లులు పడ్డాయ్‌

దశాబ్ది ఉత్సవాల భారం మోయలేం!

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవోల గగ్గోలు

అధికారుల చూపు సర్పంచుల వైపు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు డబ్బులెలా సర్దుబాటు చేయాలో తెలియక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)లు తలలు పట్టుకుంటున్నారు. ఖర్చు బారెడైతే.. సర్కారు ఇస్తున్నది బెత్తెడని.. ఆ సొమ్ముతో రోజువారీ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలని ఆందోళన చెందుతున్నారు. ‘నిన్న.. సీఎం కప్‌ క్రికెట్‌ పోటీలకు మండలానికి రూ.15 వేల చొప్పున ఇచ్చారు. కానీ, నిర్వహణ ఖర్చు తడిసి మోపెడై మా జేబులకు చిల్లు పెట్టింది. ఇప్పుడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట మండలానికి కేవలం రూ.30 వేలు ఇస్తే ఏం చేయాలి’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 21 రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలకు, ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు ఏ మాత్రం పొంతన లేదని చెబుతున్నారు. ఒక్కో మండలానికి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని, రూ.30 వేలిస్తే ఏం చేయాలో దిక్కు తోచడం లేదని ఓ ఎంపీడీవో వాపోయారు. అది కూడా కొన్ని జిల్లాల్లో విడుదలయ్యాయని, కొన్ని చోట్ల ఆ డబ్బులూ ఇవ్వలేదని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల పేరిట రోజువారీ కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ ఏర్పాట్ల బాధ్యతలను ఆయా శాఖలకు అప్పగించకుండా.. తమపైనే భారం మోపారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మండలానికి 10 లక్షల పైనే..

దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రైతు వేదికల వద్ద సమావేశాల నిర్వహణకు ఒక్కో వేదిక వద్ద సౌండ్‌ సిస్టమ్‌, టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం, ఇతర ఏర్పాట్లతోపాటు వెయ్యి మందికి మాంసాహారంతో భోజనాలు ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. దీని ప్రకారం ప్రతి మండలంలో నాలుగైదు రైతు వేదికల వద్ద వారు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.6.25 లక్షల వరకు ఖర్చవుతుందని వారు అంచనా వేస్తున్నారు. అదే విధంగా గ్రామాల్లోని చెరువు కట్టల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి.. అక్కడ భోజనాలు, టెంట్లు, కుర్చీలు, తాగునీరు.. ఇలా అన్ని రకాల ఏర్పాటు చేయాలి. గ్రామంలో 200-300 మంది చొప్పున పాల్గొనాల్సి ఉండడంతో మండలం మొత్తంలో నాలుగు వేల మందికి పైగా భోజనాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని.. ఇందుకు ప్రతి మండలానికి రూ.4 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని ఎంపీడీవోలు అంచనా వేస్తున్నారు. ఇలా ప్రతి మండలానికి ఆయా కార్యక్రమాల నిర్వహణకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం కేవలం రూ.30 వేలిస్తే.. వాటిని ఎలా సర్దుబాటు చేయాలని ప్రశ్నిస్తున్నారు.

సెలవులూ రద్దు చేశారు

మేలో జేపీఎస్‌, ఓపీఎ్‌సలను రప్పించడంలో భాగంగా రెండో శనివారం, ఆదివారం కూడా సెలవులు రద్దు చేశారని.. ఇప్పుడు గురువారం నుంచి 22వ తేదీ వరకు సెలవుల్లేవని అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవోలు పేర్కొన్నారు. ఇతర శాఖలకు చెందిన కార్యక్రమాల భారం కూడా తమపై మోపడం సరికాదని, సెలవుల్లో కుటుంబాలతో గడిపే పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తహసీల్దార్లకూ ఇవ్వలేదు!

కేంద్రానికి సంబంధించిన కార్యక్రమం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి రూ.30 లక్షల చొప్పున ఖర్చయిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించారని.. వాటి నిర్వహణకు డబ్బులు సర్దుబాటు చేయగా, వారికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో తిరిగి చెల్లింపులు జరపలేదని సమాచారం.

సీఎం కప్‌తో జేబులకు చిల్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీఎం కప్‌ క్రీడా పోటీలకు ఆయా మండలాల్లో ఏర్పాట్లు చేయడానికే జేబులకు చిల్లులు పడ్డాయని మండల అధికారులు అంటున్నారు. గ్రామాల్లో క్రీడా పోటీల నిర్వహణ, మూడు రోజులపాటు క్రీడా ప్రాంగణాల్లో టెంట్ల ఏర్పాటు, వసతి, భోజనం, బహుమతుల కోసం ప్రతి మండలానికి రూ.5 లక్షల వరకు ఖర్చయిందని, ప్రభుత్వం విడుదల చేసిన రూ.15000 ఏ మూలకూ సరిపోలేదని ఎంపీడీవోలు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల వద్దకు విద్యార్థులను ప్రత్యేకంగా తరలించడానికీ ఖర్చు పెట్టామని, ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియడం లేదని వాపోతున్నారు. నిన్న మొన్ననే.. డబ్బులు సర్దుబాటు చేసిన తమకు దశాబ్ది ఉత్సవాల నిర్వహణ మరింత భారంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు.

ఖర్చుల కోసం సర్పంచుల వైపు..

దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు డబ్బులు సర్దుబాటు చేస్తే ప్రభుత్వం ఇస్తుందో, లేదోనన్న అనుమానంతో రాష్ట్రంలోని చాలా మంది అధికారులు నిర్వహణ భారాన్ని సర్పంచులపై మోపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కొందరు సర్పంచులను పురమాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా డబ్బులు వస్తే సర్దుబాటు చేస్తామని అధికారులు చెప్పినా.. ఇప్పటికే నిధులు రాక ఇబ్బంది పడుతున్న తాము ఏమీ చేయలేమని బీఆర్‌ఎ్‌సతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచులూ తేల్చిచెబుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరు, ఆయా మండలాధికారుల వైఖరిని చాలా మంది సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2023-06-02T02:03:21+05:30 IST