IPL Lcknow vs Benguluru : పూరన్‌ పూనకాలు

ABN , First Publish Date - 2023-04-11T03:01:32+05:30 IST

ఒక్క మ్యాచ్‌లో ఎన్ని అద్భుతాలో.. రింకూ సిక్సర్ల ధమాకాను ఇంకా మర్చిపోకముందే ఐపీఎల్‌లో మరో సంచలన మ్యాచ్‌. బెంగళూరు టాపార్డర్‌ రెచ్చిపోవడంతో లఖ్‌నవూ ముందు 213 పరుగుల విజయలక్ష్యం.

IPL Lcknow vs Benguluru : పూరన్‌ పూనకాలు

15 బంతుల్లో నికోలస్‌ ఫిఫ్టీ

ఆఖరి బంతికి లఖ్‌నవూ విజయం

ఆర్‌సీబీ ఓటమి

బెంగళూరు: ఒక్క మ్యాచ్‌లో ఎన్ని అద్భుతాలో.. రింకూ సిక్సర్ల ధమాకాను ఇంకా మర్చిపోకముందే ఐపీఎల్‌లో మరో సంచలన మ్యాచ్‌. బెంగళూరు టాపార్డర్‌ రెచ్చిపోవడంతో లఖ్‌నవూ ముందు 213 పరుగుల విజయలక్ష్యం. అయితే 23/3 స్కోరుతో ఇక ఓటమి ఖాయమే అనిపించిన స్థితిలో స్టొయినిస్‌ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65) ఆశలు రేపాడు. అతడి బాటలో రూ.16 కోట్ల బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 62) అత్యంత ‘విలువైన’ ఇన్నింగ్స్‌తో కదం తొక్కి జట్టును మురిపించాడు. ఇక ఆఖరి ఓవర్‌లో కాస్త టెన్షన్‌ నెలకొన్నా ఫలితం రాహుల్‌ సేనకే అనుకూలించింది. తద్వారా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎ్‌సజీ వికెట్‌ తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. డుప్లెసి (46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 నాటౌట్‌), కోహ్లీ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 59) అర్ధసెంచరీలు సాధించారు. ఆ తర్వాత ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేసి నెగ్గింది. బదోని (30) సహకరించాడు. సిరాజ్‌, పార్నెల్‌లకు మూడేసి, హర్షల్‌ 2 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పూరన్‌ నిలిచాడు.

దడ పుట్టించాడు..: భారీ ఛేదనలో లఖ్‌నవూ తొలి నాలుగు ఓవర్లలోనే మేయర్స్‌ (0), దీపక్‌ హుడా (9), క్రునాల్‌ పాండ్యా (0) వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లేలో స్కోరు 37/3 మాత్రమే. ఈ స్థితిలో ముందుగా స్టొయినిస్‌ జట్టును ఆదుకున్నాడు. ఎనిమిదో ఓవర్‌లో వరుసగా 6,4,4తో బ్యాట్‌కు పనిచెప్పిన తను తర్వాతి ఓవర్‌లోనూ 6,4,4తో జోరు చూపాడు. పదో ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు బాదడంతో 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తయ్యింది. కానీ ప్రమాదకరంగా కనిపించిన స్టొయినిస్‌ను కరణ్‌ అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీ శిబిరంలో రిలీఫ్‌ కనిపించింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 76 పరుగులు జత చేసింది. ఇక నిదానంగా ఆడిన కెప్టెన్‌ రాహుల్‌ (18)ను సిరాజ్‌ వెనక్కి పంపడం నిజంగా లఖ్‌నవూకు కలిసివచ్చినట్టయ్యింది. ఎందుకంటే పూరన్‌-బదోని జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా పూరన్‌ సింగిల్స్‌ కన్నా ఎక్కువగా సిక్సర్లతో దడ పుట్టించాడు. దీంతో చేయాల్సిన రన్‌రేట్‌ పది లోపునకు పడిపోయి ఒత్తిడి తగ్గింది. బంతి ఎక్కడ వేసినా అయితే సిక్సర్‌ లేకుంటే ఫోర్‌ అనే మాదిరి చిన్నస్వామి స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. దీంతో 15 బంతుల్లోనే 50 రన్స్‌ పూర్తి చేయడంతో స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. అయితే సిరాజ్‌ 17వ ఓవర్‌లో పూరన్‌ను అవుట్‌ చేయగా 35 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి విజయానికి 3 ఓవర్లలో 24 రన్స్‌ దూరంలో ఉంది. అయితే ఏడు పరుగుల దూరంలో బదోని సిక్సర్‌ బాదినా బ్యాట్‌ వికెట్లకు తాకడంతో హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు.

ఆఖర్లో హైడ్రామా

చివరి ఓవర్‌లో ఐదు రన్స్‌ కోసం హైడ్రామా సాగింది. హర్షల్‌.. రెండో బంతికి ఉడ్‌ (1), ఐదో బంతికి ఉనాద్కట్‌ (9)లను అవుట్‌ చేయడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇక చివరి బంతికి సింగిల్‌ అవసరపడగా.. హర్షల్‌ నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న బిష్ణోయ్‌ను మన్కడింగ్‌ చేయాలనుకుని విఫలమయ్యాడు. అయితే తొలుత విఫలమైన హర్షల్‌..తర్వాత మరోసారి రనౌట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. నిబంధనల ప్రకారం ఇలా రెండోసారి ప్రయత్నించడం కుదరదు కాబట్టి అంపైర్‌ దాన్ని తిరస్క రించాడు. ఇక చివరి బంతిని కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ సరిగా అందుకోలేక బైస్‌ రూపంలో సింగిల్‌ రావడంతో లఖ్‌నవూ సంబరాల్లో మునిగింది.

దుమ్మురేపిన టాపార్డర్‌: ఆర్‌సీబీ తరఫున ముందుగా విరాట్‌ విధ్వంసం.. ఆ తర్వాత డుప్లెసి-మ్యాక్స్‌వెల్‌ అతడికి మించిన బాదుడుతో లఖ్‌నవూ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఈ జోడీ చివరి ఏడు ఓవర్లలో ఏకంగా 108 రన్స్‌ రాబట్టింది. రెండో ఓవర్‌లో కోహ్లీ 6,4, నాలుగో ఓవర్‌లో 2 ఫోర్లు, ఆరో ఓవర్‌లో 4,6తో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 56 రన్స్‌ సాధించింది. తొలి ఆరు ఓవర్లలో కోహ్లీ 42 రన్స్‌ చేయడం కూడా ఇదే తొలిసారి. ఇదే జోరుతో 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన కోహ్లీకి అమిత్‌ మిశ్రా తన తొలి ఓవర్‌లోనే షాకిచ్చాడు. పుల్‌ షాట్‌ ఆడిన తను డీప్‌ మిడ్‌ వికెట్‌లో స్టొయిని్‌సకు క్యాచ్‌ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 96 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కానీ ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తూ డుప్లెసి-మ్యాక్స్‌ జోడీ విజృంభించింది. మిశ్రా ఓవర్‌లో మ్యాక్స్‌ 4,6 సాధించగా.. ఆ తర్వాత బిష్ణోయ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో డుప్లెసీ బాదిన రెండు సిక్సర్లలో ఒకటి (115మీ.) స్టేడియం బయటికి వెళ్లింది. అటు మ్యాక్స్‌ 6తో ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్‌లో మరో సిక్సర్‌తో డుప్లెసి కూడా 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇక ఉనాద్కట్‌ ఓవర్‌ (18)లో డుప్లెసీ 6,6,4 మ్యాక్స్‌ 4తో ఏకంగా ఆర్‌సీబీకి 23 పరుగులు సమకూరాయి. తర్వాతి ఓవర్‌లోనూ 20 పరుగులు రావడంతో స్కోరు 200 దాటేసింది. ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి మ్యాక్స్‌వెల్‌ను ఉడ్‌ బౌల్డ్‌ చేశాడు.

ఐపీఎల్‌ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్‌ (15 బంతుల్లో) ఫిఫ్టీ సాధించిన పూరన్‌. రాహుల్‌, కమిన్స్‌ (14 బంతుల్లో) ముందున్నారు.

స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) స్టొయినిస్‌ (బి) అమిత్‌ 61, డుప్లెసి (నాటౌట్‌) 79, మ్యాక్స్‌వెల్‌ (బి) ఉడ్‌ 59, దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 212/2; వికెట్ల పతనం: 1-96, 2-211; బౌలింగ్‌: ఉనాద్కట్‌ 2-0-27-0, అవేశ్‌ ఖాన్‌ 4-0-53-0, క్రునాల్‌ 4-0-35-0, ఉడ్‌ 4-1-32-1, బిష్ణోయ్‌ 4-0-39-0, అమిత్‌ మిశ్రా 2-0-18-1.

లఖ్‌నవూ: మేయర్స్‌ (బి) సిరాజ్‌ 0, రాహుల్‌ (సి) కోహ్లీ (బి) సిరాజ్‌ 18, హుడా (సి) కార్తీక్‌ (బి) పార్నెల్‌ 9, క్రునాల్‌ (సి) కార్తీక్‌ (బి) పార్నెల్‌ 0, స్టొయినిస్‌ (సి) షాబాజ్‌ (బి) కర్ణ్‌శర్మ 65, పూరన్‌ (సి) షాబాజ్‌ (బి) సిరాజ్‌ 62, బదోని (హిట్‌ వికెట్‌/బి) పార్నెల్‌ 30, ఉనాద్కట్‌ (సి) డుప్లెసి (బి) హర్షల్‌ 9, ఉడ్‌ (బి) హర్షల్‌ 1, బిష్ణోయ్‌ (నాటౌట్‌) 3, అవేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 213/9; వికెట్ల పతనం: 1-1, 2-23, 3-23, 4-99, 5-105, 6-189, 7-206, 8-209, 9-212; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-22-3, విల్లే 4-0-32-0, పార్నెల్‌ 4-0-41-3, హర్షల్‌ 4-0-48-2, కరణ్‌ శర్మ 3-0-48-1, షాబాజ్‌ 1-0-15-0.

2 చేతిలో ఓ వికెట్‌ ఉండి ఆఖరి బంతికి గెలిచిన రెండో జట్టు లఖ్‌నవూ. 2018లో ముంబైపై హైదరాబాద్‌ ఇదే రీతిన గెలిచింది.

4 ఐపీఎల్‌లో ఇది నాలుగో అత్యధిక ఛేదన (213)

5 తొలిసారి బ్యాటింగ్‌కు దిగి 200+ స్కోరు చేసినా ఎక్కువసార్లు(5) ఓడిన జట్టుగా ఆర్‌సీబీ.

Updated Date - 2023-04-11T03:01:36+05:30 IST