Rinku singh: తన కుటుంబ అసలు పరిస్థితి ఏంటో చెప్పేసిన రింకు సింగ్..! చిన్నప్పుడు నాన్నతో కలిసి

ABN , First Publish Date - 2023-04-11T17:21:35+05:30 IST

ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)కు రింకు సింగ్(Rinku Singh)

Rinku singh: తన కుటుంబ అసలు పరిస్థితి ఏంటో చెప్పేసిన రింకు సింగ్..! చిన్నప్పుడు నాన్నతో కలిసి

కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)కు రింకు సింగ్(Rinku Singh) రూపంలో ఓ మెరుపు ఆటగాడు లభించాడు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరిగిన గత మ్యాచ్‌లో చివరి ఓవర్ చివరి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఒక్క ప్రదర్శనతో రింకు సింగ్ తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. ‘ఎన్‌డీటీవీ’తో జరిపిన చిట్‌చాట్‌లో రింకు పలు విషయాల గురించి చెప్పుకొచ్చాడు.

రింకు తండ్రి ఇప్పటికీ..

రింకూది సంపన్న కుటుంబమేమీ కాదు. ఆయన తండ్రి ఇప్పటికీ గ్యాస్ సిలిండర్లను హోం డెలివరీ చేస్తుంటారు. రింకు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారడానికి ముందు ఆయన కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రింకు సింగ్ ఇప్పుడు కేకేఆర్ స్టార్ బ్యాటర్‌గా మారిపోయాడు.

‘‘కుటుంబం కోసం ఏం చేయాలో అన్నీ చేశాను. ఇప్పుడు కష్టకాలం తొలగిపోయింది. ఉద్యోగం వదిలేయమని మా నాన్నకు చెప్పాను. ఆయన 30 ఏళ్లుగా మా కోసం కష్టపడుతున్నారు. ఉద్యోగం మానేయమని చెబుతున్నా, ఆయన మాత్రం వదిలేది లేదంటున్నారు. మా నాన్నతో కలిసి నేను, మా అన్నయ్యలం ఇంటింటికి వెళ్లి గ్యాస్ సిలిండర్లు వేసేవాళ్లం. నేను క్రికెట్ ఆడడం నా తండ్రికి ఇష్టం ఉండేది కాదు. నేను కూడా ఆయనతో కలిసి పనిచేయాలని, డబ్బు సంపాదించాలని కోరుకునేవారు. అయితే, మా అమ్మ మాత్రం నన్ను బాగా సపోర్ట్ చేసింది’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కెరీర్‌కు ఇదే టర్నింగ్ పాయింటా?

గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్ కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న ప్రశ్నకు రింకు మాట్లాడుతూ.. అది తన జీవితంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అని అన్నాడు. టీమిండియాలో చోటు సంపాదించాలన్న లక్ష్యం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడడంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్టు చెప్పాడు.

సోదరుల్లో రింకు ఒక్కడే..

రింకు తన టీనేజ్‌లో సోదరులతో కలిసి క్రికెట్‌ ఆడేవాడు. అయితే, ఆ తర్వాత వారంతా క్రికెట్‌ను వదిలేయగా, రింకు మాత్రమే క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా మార్చుకున్నాడు. అయితే, అతడి తమ్ముడు మాత్రం అన్న అడుగుజాడల్లో నడవాలని చూస్తున్నాడు. తనకో తమ్ముడు ఉన్నాడని, అతడికి కూడా క్రికెట్‌పై చాలా ఆసక్తి ఉందని పేర్కొన్నాడు. అతడు ఎంత కష్టపడతాడు? నైపుణ్యాలను ఏ మేరకు మెరుగుపరుచుకుంటాడనే దానిపై అతడి ఐపీఎల్ కాంట్రాక్ట్ ఆధారపడి ఉంటుందన్నాడు.

‘‘ఐపీఎల్‌లో అడుగుపెట్టడం చాలా కష్టం. తొలుత దేశవాళీ క్రికెట్‌లో నువ్వేంటో నిరూపించుకోవాలి. నేను క్రికెట్ ఆడబట్టి ఆరేడేళ్లు అవుతోంది. అలాగే, మనకు జట్టు మద్దతు కూడా అవసరం అని రింకు సింగ్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-04-11T17:21:35+05:30 IST