Viral Video: రోహిత్ వివాదాస్పద ఔట్.. ఇదిగో వీడియో అంటూ నోళ్లు మూయించిన ఐపీఎల్!

ABN , First Publish Date - 2023-05-01T21:38:14+05:30 IST

రాజస్థాన్ రాయల్స్‌ (RR)తో వాంఖడే స్టేడియంలో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై

Viral Video: రోహిత్ వివాదాస్పద ఔట్.. ఇదిగో వీడియో అంటూ నోళ్లు మూయించిన ఐపీఎల్!

ముంబై: రాజస్థాన్ రాయల్స్‌ (RR)తో వాంఖడే స్టేడియంలో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే, అంతకుముందు రోహిత్ (Rohit Sharma) అవుటైన తీరు వివాదాస్పదమైంది. రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ వేసిన బంతికి రోహిత్ శర్మ బౌల్డయ్యాడు. ఈ అవుట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బంతి బెయిల్స్‌ను రాసుకుంటూ వెళ్లి కీపర్ సంజు శాంసన్ (Sanju Samson) చేతిలో పడింది. గాల్లోకి లేచిన బెయిల్స్ కిందపడ్డాయి.

రోహిత్ అవుటైన ఆనందంలో సంజు శాంసన్ సంబరాల్లో మునిగిపోగా, కాలు క్రీజులోనే ఉన్నా స్టంపౌట్ ఎలా అన్న అనుమానంలో రోహిత్ మునిగిపోయాడు. అంపైర్ కూడా అవుట్ అనడంతో రోహిత్ క్రీజు వదిలాడు. అయితే, క్రికెట్ ప్రేమికులకు మాత్రం రోహిత్ ఎలా అవుటయ్యాడన్నది మిస్టరీగా మిగిలిపోయింది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు మొదలయ్యాయి. బెయిల్స్ ఎలా కిందపడ్డాయో తెలియక అభిమానులు కూడా అయోమయానికి గురయ్యారు. బెయిల్స్ కింద పడడానికి మరేమైనా కారణం ఉందా? అని ఆరా తీశారు. మరికొందరు మాత్రం సంజు గ్లోవ్స్ తగిలే బెయిల్స్ కిందపడ్డాయని వాదించారు.

ఈ విమర్శలపై స్పందించిన ఐపీఎల్.. రోహిత్ ఎలా అవుటయ్యాడో చూడండంటూ ఓ స్పష్టమైన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో రోహిత్ ఎలా అవుటయ్యాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సందీప్ వేసిన బంతి బెయిల్‌ను రాసుకుంటూ వెళ్లి శాంసన్ చేతిలో పడింది. ఆ వెంటనే బెయిల్ కిందపడింది. దీంతో అవుట్ అంటూ సంజు సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియోలో పలు కోణాల్లో రోహిత్ అవుట్‌ను స్పష్టంగా చూపించింది. ఈ వీడియోను పోస్టు చేసి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది.

Updated Date - 2023-05-01T21:38:14+05:30 IST