IPL 2023: హైదరాబాద్‌ను ఉతికి ఆరేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. కొండంత లక్ష్యాన్ని ఛేదించేనా?

ABN , First Publish Date - 2023-04-02T17:36:28+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్

IPL 2023: హైదరాబాద్‌ను ఉతికి ఆరేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. కొండంత లక్ష్యాన్ని ఛేదించేనా?

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) బ్యాటర్లు శివాలెత్తారు. బంతులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తూ స్కోరు బోర్డును గుక్కతిప్పుకోనివ్వకుండా పరుగులు పెట్టించారు. హైదరాబాద్ బౌలర్లు చివరల్లో కొంత కంట్రోల్ చేసి వికెట్లు తీయడంతో పరుగుల వేగం కొంత తగ్గింది కానీ లేదంటేనా.. స్కోరు ఏ 250 పరుగులో దాటి ఉండేది.

టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) రాజస్థాన్ బ్యాటర్ల బాదుడు చూసి వారికి బ్యాటింగ్ ఎందుకు అప్పగించానా? అని బాధపడి ఉంటాడు. ఓ వైపు బట్లర్(Jos Buttler), మరోవైపు యశస్వి జైస్వాల్(Yashaswai Jaiswal) వీరబాదుడుకు తోడు ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson) అర్ధ సెంచరీతో విరుచుకుపడడంతో స్కోరు పరుగులు తీసింది. అయితే, సంజు అవుటైన తర్వాత స్కోరు వేగం కొంత మందగించింది. దీనికి తోడు హైదరాబాద్ బౌలర్లు కొంత పట్టుబిగించడంతో డెత్ ఓవర్లలో పరుగులు రావడం కష్టమైంది. షిమ్రన్ హెట్మెయిర్ చివర్లో 16 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేయడంతో స్కోరు 200 దాటింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 9 ఫోర్లతో 54, జోస్ బట్లర్ 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 54, శాంసన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూకీ, నటరాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-04-02T17:40:01+05:30 IST