Michael Bracewell: జాక్ స్థానాన్ని భర్తీ చేసిన ఆర్సీబీ..

ABN , First Publish Date - 2023-03-18T18:19:12+05:30 IST

గాయపడి ఐపీఎల్‌కు దూరమైన ఇంగ్లండ్ యువ ఆటగాడు విల్ జాక్స్(Will Jacks) స్థానాన్ని భర్తీ చేస్తూ అభిమానుల ఉత్కంఠకు

Michael Bracewell: జాక్ స్థానాన్ని భర్తీ చేసిన ఆర్సీబీ..

బెంగళూరు: గాయపడి ఐపీఎల్‌కు దూరమైన ఇంగ్లండ్ యువ ఆటగాడు విల్ జాక్స్(Will Jacks) స్థానాన్ని భర్తీ చేస్తూ అభిమానుల ఉత్కంఠకు ఆర్సీబీ(RCB) తెరదించింది. కివీస్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రాస్‌వెల్‌(Michael Bracewell)తో జరిగిన చర్చలు ఫలించడంతో ఈ సీజన్‌లో బ్రాస్‌వెల్ బెంగళూరు జెర్సీ ధరించబోతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విల్ జాక్స్ గాయపడ్డాడు. గాయం తీవ్రంగా ఉండడంతో ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు.

గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో జాక్స్‌ను రూ.3.2 కోట్లకు తీసుకున్న ఆర్సీబీ.. బ్రాస్‌వెల్‌ను మాత్రం అతడి కనీస ధర అయిన కోటి రూపాయలకే ఇప్పుడు తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ స్వయంగా వెల్లడించింది. జాక్స్ స్థానాన్ని బ్రాస్‌వెల్‌తో భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. 32 ఏళ్ల బ్రాస్‌వెల్ ఇటీవల భారత పర్యటనలో బంతితో ఇరగదీసినట్టు ట్వీట్ చేసింది. ఇండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బ్రాస్‌వెల్ అత్యధిక వికెట్లు తీసుకోవడమే కాకుండా ఓ వన్డేలో 140 పరుగులు కూడా చేసినట్టు ట్వీట్ చేసింది.

బ్రాస్‌వెల్ ఇప్పటి వరకు 16 టీ20లు ఆడి 113 పరుగులు చేశాడు. 21 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, ఆరు టెస్టులు, 19 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 224, వన్డేల్లో 510 పరుగులు చేశాడు. వన్డేల్లో రెండు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 18, వన్డేల్లో 15, టీ20ల్లో 21 వికెట్లు పడగొట్టాడు.

హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరిగిన వన్డేలో బ్రాస్‌వెల్ చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ బాదడంతో టీమిండియా 349 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ 170 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సరిగ్గా అప్పుడే బ్రాస్‌వెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. 78 బంతుల్లో 140 పరుగులు చేసి భారత్‌ను వణికించాడు. దీంతో న్యూజిలాండ్ 337 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈజీగా సిక్సర్లు బాదే బ్రాస్‌వెల్ ఆర్సీబీకి మంచి బలం అవుతాడని భావిస్తున్నారు.

Updated Date - 2023-03-18T18:40:28+05:30 IST