గుజరాత్‌ బోణీ

ABN , First Publish Date - 2023-04-01T01:27:25+05:30 IST

గత సీజన్‌లో దుమ్మురేపిన డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఈసారీ ఘనంగా బోణీ చేసింది....

గుజరాత్‌ బోణీ

తొలి మ్యాచ్‌లో చెన్నైపై విజయం

రాణించిన గిల్‌

రుతురాజ్‌ పోరాటం వృథా

అహ్మదాబాద్‌: గత సీజన్‌లో దుమ్మురేపిన డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఈసారీ ఘనంగా బోణీ చేసింది. ఛేజింగ్‌లో తిరుగులేదని నిరూపిస్తూ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. గిల్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) అర్ధసెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించారు. అటు చెన్నై ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92) మినహా ఎవరూ రాణించకపోవడం దెబ్బతీసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. షమి, జోసెఫ్‌, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి గెలిచింది. రషీద్‌ ఖాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

దూకుడుగా..: భారీ ఛేదనలో గుజరాత్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ముందుగా ఓపెనర్‌ సాహా (25) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి నాలుగో ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత గిల్‌, సాయి సుదర్శన్‌ (22) భారీ షాట్లతో వేగంగా ఆడడడంతో పవర్‌ప్లేలోనే జట్టు 65 పరుగులు సాధించింది. రెండో వికెట్‌కు వీరు 53 పరుగులు జోడించారు. సాహా, సుదర్శన్‌ల వికెట్లను అరంగేట్ర యువ పేసర్‌ హంగర్గేకర్‌ తీశాడు. 11వ ఓవర్‌లో 4,6తో గిల్‌ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. స్వల్ప సమయంలోనే పాండ్యా (8)ను జడేజా బౌల్డ్‌ చేయగా.. జోరు మీదున్న గిల్‌ను తుషార్‌ అవుట్‌ చేశాడు. ఇక చివరి 18 బంతుల్లో 30 రన్స్‌ అవసరమయ్యాయి. ఈ దశలో భారీ సిక్సర్‌తో ఊపు మీదున్న విజయ్‌ శంకర్‌ (27)ను హంగర్గేకర్‌ అవుట్‌ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే 19వ ఓవర్‌లో రషీద్‌ (10 నాటౌట్‌) 6,4 బాదేయడంతో 15 పరుగులు రాగా.. ఆఖరి ఓవర్‌లో తెవాటియా (15 నాటౌట్‌) 6,4తో మ్యాచ్‌ గుజరాత్‌ వశమైంది.

ఒక్కడై..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రుతురాజ్‌ అంతా తానై నడిపించాడు. మరో ఎండ్‌లో గుజరాత్‌ బౌలర్లు వరుసగా వికెట్లు తీసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆత్మవిశ్వాసంతో కనిపించిన రుతురాజ్‌ ఫ్లిక్‌, డ్రైవ్‌, కట్‌, లాఫ్టెడ్‌ ఇలా కచ్చితమైన షాట్లతో ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టాడు. కానీ అతడికి సహకారం కరువవడంతో 190+ స్కోరు రాలేకపోయింది. మరో ఓపెనర్‌ కాన్వే (1) మూడో ఓవర్‌లోనే వెనుదిరిగినా... తను మాత్రం భారీ సిక్సర్లతో అదరగొట్టాడు. మొయిన్‌ అలీ (23) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. రెండో ఓవర్‌లో రుతురాజ్‌ రెండు ఫోర్లు బాదగా.. లిటిల్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో తన 6,4.. అలీ 4తో 15 పరుగులు వచ్చాయి. ఇక తర్వాతి ఓవర్‌లోనే అలీ చెలరేగి 4,6,4తో 17 రన్స్‌ రాబట్టి రషీద్‌ చేతిలో అవుటయ్యాడు. వీరి ధాటికి సీఎ్‌సకే పవర్‌ప్లేలో 51 పరుగులు సాధించింది. స్టోక్స్‌ (7)ను కూడా రషీద్‌ అవుట్‌ చేసినా.. రుతురాజ్‌ మాత్రం హార్దిక్‌, జోసెఫ్‌ ఓవర్లలో రెండేసి సిక్సర్లు బాది 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 11 ఓవర్లలోనే స్కోరు 100కి చేరింది. రాయుడు (12) నిరాశపర్చగా.. అతడి భారీ షాట్‌ను బౌండరీ లైన్‌ దగ్గర గాల్లోకి ఎగిరి సిక్సర్‌ను అడ్డుకున్న విలియమ్సన్‌ గాయంతో మైదానం వీడాడు. 13-16 ఓవర్ల మధ్య బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో రన్స్‌ నెమ్మదించాయి. 17వ ఓవర్‌లో భారీ సిక్సర్‌ సాధించిన రుతురాజ్‌ తృటిలో శతకం కోల్పోయాడు. జోసెఫ్‌ ఒకే ఓవర్‌లో తనతోపాటు జడేజా (1) వికెట్‌ తీశాడు. ఆ వెంటనే దూబే (19) వెనుదిరగడంతో ధోనీ (14 నాటౌట్‌) బరిలోకి దిగాడు. ఆఖరి ఓవర్‌లో 6,4 బాదిన తను 13 రన్స్‌ రాబట్టడంతో పోరాడే స్కోరు సాధించింది.

తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌

ఐపీఎల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను ఆరంభ మ్యాచ్‌లోనే చెన్నై, గుజరాత్‌ వాడుకున్నాయి. గాయపడిన విలియమ్సన్‌ స్థానంలో బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ను టైటాన్స్‌ తీసుకోగా.. ఛేజింగ్‌లో రాయుడును పక్కనబెట్టి బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండేను చెన్నై ఆడించింది.

ఎక్కువ వయస్సు కలిగిన ఐపీఎల్‌ కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనీ (41 ఏళ్ల 267 రోజులు) రికార్డు. ద్రవిడ్‌ (40 ఏళ్ల 268)ను అధిగమించాడు.

సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనే ఎక్కువ స్కోరు చేసిన మూడో బ్యాటర్‌గా రుతురాజ్‌. మెకల్లమ్‌ (158 నాటౌట్‌), రోహిత్‌ (98 నాటౌట్‌) ముందున్నారు.

టీ20ల్లో రషీద్‌ చేతిలో అవుట్‌ కావడం స్టోక్స్‌కిది నాలుగోసారి

ఒకే జట్టు తరఫున 200 సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌గా ధోనీ.

స్కోరుబోర్డు:

చెన్నై: కాన్వే (బి) షమి 1; రుతురాజ్‌ (సి) గిల్‌ (బి) జోసెఫ్‌ 92; మొయిన్‌ అలీ (సి) సాహా (బి) రషీద్‌ ఖాన్‌ 23; స్టోక్స్‌ (బి) రషీద్‌ 7; రాయుడు (బి) లిటిల్‌ 12; దూబే (సి) రషీద్‌ (బి) షమి 19; జడేజా (సి) విజయ్‌ శంకర్‌ (బి) జోసెఫ్‌ 1; ధోనీ (నాటౌట్‌) 14; శాంట్నర్‌ (1 నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 8;

మొత్తం: 20 ఓవర్లలో 178/7. వికెట్ల పతనం: 1-14, 2-50, 3-70, 4-121, 5-151, 6-153, 7-163.బౌలింగ్‌: షమి 4-0-29-2; హార్దిక్‌ 3-0-28-0; లిటిల్‌ 4-0-41-1; రషీద్‌ 4-0-26-2; యష్‌ 1-0-14-0.

గుజరాత్‌: సాహా (సి) దూబే (బి) హంగర్గేకర్‌ 25; గిల్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 63; సాయిసుదర్శన్‌ (సి) ధోనీ (బి) హంగర్గేకర్‌ 22; పాండ్యా (బి) జడేజా 8; విజయ్‌ శంకర్‌ (సి) శాంట్నర్‌ (బి) హంగర్గేకర్‌ 27; తెవాటియా (నాటౌట్‌) 15; రషీద్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 19.2 ఓవర్లలో 182/5. వికెట్ల పతనం: 1-37, 2-90, 3-111, 4-138, 5-156. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-29-0; తుషార్‌ 3.2-0-51-1; హంగర్గేకర్‌ 4-0-36-3; శాంట్నర్‌ 4-0-32-0; జడేజా 4-0-28-1.

Updated Date - 2023-04-01T01:27:28+05:30 IST