పద పదవే... వయ్యారి గాలిపటమా...

ABN , First Publish Date - 2023-01-15T13:54:16+05:30 IST

సంక్రాంతి అనగానే... ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిపళ్లు, హరిదాసు కీర్తనలతో పాటు వెంటనే గుర్తొచ్చేది గాలిపటాలు. పంచవన్నెల పతంగులకు మాంజా దారం కట్టి మైదానంలోకి వెళ్లి.....

పద పదవే... వయ్యారి గాలిపటమా...

సంక్రాంతి అనగానే... ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిపళ్లు, హరిదాసు కీర్తనలతో పాటు వెంటనే గుర్తొచ్చేది గాలిపటాలు. పంచవన్నెల పతంగులకు మాంజా దారం కట్టి మైదానంలోకి వెళ్లి... ఆకాశంలోకి ఎగరేస్తే ఆ మజాయే వేరు. ఏడాది పొడవునా మన ఆశలూ, ఆశయాలూ కూడా గాలిపటాల్లా ఎత్తుగా ఎగరాలన్నంత సంబరం. మనకే కాదు... ప్రపంచవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో ఈ సంబరం అంబరాన్ని అంటుతుంది మరి.

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు లోగిళ్లలో రంగురంగుల ముగ్గులతో పాటు... ఆకాశం సప్త వర్ణాలతో ఇంద్రధనుస్సులా మెరిసిపోతుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా రకరకాల ఆకారాల్లో పతంగులను ఎగరవేస్తూ, ఆకాశంలో అవి చేసే విన్యాసాలు చూస్తూ కేరింతలు కొడతారు. వీటిని ఎగరేయడంలో ఒక్కోచోట ఒక్కో సంస్కృతి, సాంప్రదాయం కనిపిస్తుంది. అతి పేద దేశాల నుంచి అగ్ర దేశాల దాకా ఏదో ఒక సందర్భంలో పతంగుల ఉత్సవాలను నిర్వహిస్తుంటాయి. గాలి పటాలు ఎగరేయడంలో కొన్ని దేశాల్లో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మరి కొన్ని దేశాలు దీనిని క్రీడగా ప్రోత్సహిస్తున్నాయి.

  • పురాతనమైన క్రీడల్లో గాలిపటాలు ఒకటి. 3 వేల ఏళ్లుగా మానవులు గాలిపటాలను ఎగరవేస్తున్నారు. మొదట్లో ఎండిన ఆకులను పతంగులుగా ఎగరవేసేవారట.

  • గాలి లేనిదే పతంగులు ఎగరవు అనుకుంటాం.

  • కానీ అది వాస్తవం కాదు.

  • గాలిపటాలు పిల్లల నేస్తాలు. కానీ పిల్లల కన్నా పెద్ద వాళ్లే వీటిని ఎక్కువగా ఎగరవేస్తున్నారంటే నమ్మగలరా?

  • కైట్స్‌ను ఎగరవేసే ఉత్సవాలు అన్ని చోట్లా కనిపిస్తాయి. అయితే జపాన్‌లో బరువుగా ఉండే పతంగులు ఎక్కువ. కొన్నిటి బరువు 2 టన్నుల వరకూ ఉంటుందట. పొడవాటి గాలిపటాలకి పేరు చైనా. 600 మీటర్ల పొడవున్నవీ ఇక్కడ చూడవచ్చు.

  • ఇప్పటి వరకూ ఉన్న రికార్డుల ప్రకారం ప్రపంచంలో అతి పొడవైన గాలిపటం 1034 మీటర్ల పొడవు ఉంది.

  • నేడు ఎక్కువగా అభివృద్ధి చెందుతోన్న క్రీడల్లో ఒకటి గాలిపటాలను ఎగరవేయడం. అయితే చేపలు పట్టడం, పక్షులను వెళ్లగొట్టడం, ఉత్తరాలను అందచేయడం కోసమే కాకుండా యుద్ధసమయాల్లో కూడా గాలిపటాలను వినియోగించడం విశేషం.

  • గాలిపటాన్ని గంటకు 193 కిలోమీటర్ల వేగంతో ఎగరేసి

  • రికార్డు నెలకొల్పారు.

  • పది నిమిషాలో, గంటో కాదు 180 గంటలు గాల్లో ఓ గాలిపటం ఎగిరి రికార్డు నెలకొల్పింది.

  • జపాన్‌లో గాలిపటాలను తయారుచేసే ఓ కంపెనీ ఒకే వరుసలో 11284 గాలిపటాలను ఎగరేసి రికార్డుల్లోకి ఎక్కింది. క్రీ.శ. 1760లో జపాన్‌లో గాలిపటాలను ఎగరేయడాన్ని నిషేధించారు. ఆనాటి ప్రజలు పనిచేయడం కన్నా గాలిపటాలతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారన్నది ప్రధాన కారణం.

  • ఎగిరే గాలిపటాలను వీక్షించడం వల్ల కంటి చూపు మెరుగవుతుందని చైనాలో ప్రజల నమ్మకం.

  • పతంగులను ఎగరేయడంలోనూ నియమాలు ఉన్నాయి. ఒక్క థాయిలాండ్‌లో దీనికి సంబంధించి 78 నియమాలు పాటిస్తారు.

  • అమెరికాలో ప్రతి ఏటా 5 కోట్ల కైట్స్‌ను ఎగరవేస్తున్నారు.

పిల్లల ఆరోగ్యం కోసం...

గాలిపటం ఎగరేయడం ఓ సరదానే కానీ జపనీయులకు మాత్రం బిడ్డల ఆరోగ్యం కోసం ప్రార్థించే క్రతువు. గాలిపటం ఎంత పైకి ఎగిరితే బిడ్డడి ఆరోగ్యం అంత చల్లగా ఉంటుందనే నమ్మకం వారిది. గాలిపటాల సంబరాన్ని ఆ దేశంలో ‘హిమమాత్సు’గా పిలుస్తారు. ఏటా మే 3 నుంచి 5 వరకు ఈ ఉత్సవాలను జరుపుకొంటారు. దీన్నే గోల్డెన్‌ వీక్‌గా కూడా పిలుస్తారు. క్రీ.శ. 1558 లో హిమమత్సు రాజుకు కొడుకు పుట్టిన సందర్భంలో గాలిపటమ్మీద కొడుకు పేరు రాసి గాల్లో ఎగరేశాడు. ఆ సంబరం క్రమంగా రాజ్యమంతటా పాకింది. నేటికీ కొనసాగుతోంది. చంటి పిల్లల ఇళ్లల్లో ఈ వేడుక ఎక్కువే. హిమమాత్సులోని నకతైమా ఇసుక తెన్నెలు ప్రధాన వేదికగా మారతాయి. మే 3న ఉదయం 11 గంటలకు గంట కొట్టగానే ఒకేసారి ఆకాశంలోకి 100 పతంగులను ఎగరవేసి వేడుకకు శ్రీకారం చుడతారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ల నుంచి ఈ ఇసుక తిన్నెల దగ్గరకి ఉచిత బస్‌ సేవలను అందించడం విశేషం. సమురాయ్‌ ఆటలకు ప్రసిద్ధిచెందిన జపాన్‌లో ప్రత్యేకంగా ‘రొక్కాకు’ అనే పోటీ పతంగులు ఫేమస్‌.

జాతీయ సెలవు దినం...

సంక్రాంతి పండగలో భాగంగా గాలిపటాలను ఎగరేయడం మన దగ్గర చూస్తాం. గుజరాత్‌, తెలంగాణ, రాజస్థాన్‌, కర్ణాటకలలో అనేక నగరాలు ఈ వేడుక కోసం సిద్ధం అవుతాయి. అయితే అహ్మదాబాద్‌ కైట్‌ క్యాపిటల్‌గా పేరుతెచ్చుకుంది. ఇక్కడ పతంగుల పండగ జనవరి 13న మొదలై మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో పిల్లల ప్రధాన కాలక్షేపం గాలిపటాలే. జనవరి 13న అక్కడ జాతీయ సెలవు దినం. 2012లో అత్యధికంగా 42 దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు పతంగుల పండగలో పాల్గొని రికార్డుల కెక్కారు. సబర్మతీ తీరంలో ఎన్నో వేల గాలి పటాలను చూసే అవకాశం లభిస్తుంది. ఎంత లేదన్నా అయిదు లక్షల మంది ప్రేక్షకులు గాలిపటాలను చూసేందుకు వస్తుంటారు.

పేద్ద మ్యూజియం

అంగరంగ వైభవంగా పతంగుల పండగ జరుపుకునే దేశం చైనా. ఏప్రిల్‌ మాసంలో వారం రోజుల పాటు ఈ పండగను ఇంటిల్లిపాదీ ఎంతో వేడుకగా జరుపుకొంటారు. దీనికి సంబంధించి ప్రముఖమైన నగరం వైఫాంగ్‌. పతంగుల ఉత్సవాల సమయానికి దేశవ్యాప్తంగా చాలా మంది టూరిస్టులు ఇక్కడికి చేరుకుంటారు. ఎన్నో రంగులు, సైజులు, ఆకారాలవి కనువిందు చేస్తాయి. వీటిలో ఎక్కువగా కనిపించేవి డ్రాగన్‌ కైట్లే. స్వహస్తాలతో చేసిన గాలిపటాలకు డిమాండ్‌ ఎక్కువ. నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా ‘వైఫాంగ్‌ కైట్‌ మ్యూజియం’ పేరుతెచ్చుకుంది. ఇక్కడ అనేక రకాల గాలిపటాలను చూడవచ్చు.

పతంగుల పండగకు కేరాఫ్‌...

అమెరికాలో పతంగుల పండగకు కేరాఫ్‌ అడ్రస్‌గా వాషింగ్టన్‌ మారింది. ఇక్కడ ప్రతి ఏడాది ఆగస్టు 3వ వారం గాలిపటాల పండగను నిర్వహిస్తారు. దాదాపు 45 కిలోమీటర్ల పొడవున్న ‘లాంగ్‌ బీచ్‌ పెనిన్సులా’ ఈ వేడుక కోసం ముస్తాబవుతుంది. అంతర్జాతీయ కైట్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఓటింగ్‌లో వాషింగ్టన్‌ పతంగుల పండగ గొప్పదిగా మొదటి స్థానాన్ని పొందింది. పిల్లలూ పెద్దలూ రకరకాల గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషిస్తుంటారు. పతంగుల చరిత్ర, కళ, శాస్త్రానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేసే ‘వరల్డ్‌ కైట్‌ మ్యూజియం’ కూడా ఇక్కడే ఉంది.

అంతర్జాతీయ సంబరం

అతి పెద్ద ముస్లిం దేశం అయినప్పటికీ ఇండోనేషియాలో అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పండగ నిర్వహిస్తారు.. ఏటా జూలై నెలలో రెండు రోజుల పాటు ఈ పండగను రాజధాని జకార్తాలో జరుపుకొంటారు. ఈ వేడుకలో పాల్గొనడం కోసం చైనా, మలేషియా, జపాన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల నుంచి విదేశీ టూరిస్టులు వస్తుంటారు. అయితే ప్రతిసారీ అతి పెద్ద డ్రాగన్‌ గాలిపటాన్ని జకార్తా నీలాకాశంలో ఎగరవేయడం ఇక్కడ ఆనవాయితీగా నడుస్తోంది.

ఇండోనేషియాలోనే భాగమైన బాలి ద్వీపంలో మాత్రం దేవతలకు సందేశం పంపే క్రతువుగా ఈ పండగను భావిస్తారు. ‘లయాంగ్‌- లయాంగ్‌’గా పేర్కొనే గాలిపటాల పండగ అక్కడ పరమపవిత్రమైనది. ఏడాదిలో రెండుసార్లు ఈ పండగను నిర్వహిస్తారు. మొదటి వారం స్థానికులకు, రెండో వారం విదేశీ టూరిస్టుల కోసం నిర్వహించడం విశేషం.

Updated Date - 2023-01-15T13:54:18+05:30 IST