Viral Video: ఇదేంటో గుర్తు పట్టగలరా..? లక్షలు పెట్టి మరీ కొనేందుకు ఎగబడుతున్నారట.. ఎందుకింత డిమాండ్ అంటే..

ABN , First Publish Date - 2023-02-21T20:56:17+05:30 IST

అలుగులకు ఎందుకంతే డిమాండ్ అంటే..

Viral Video: ఇదేంటో గుర్తు పట్టగలరా..? లక్షలు పెట్టి మరీ కొనేందుకు ఎగబడుతున్నారట.. ఎందుకింత డిమాండ్ అంటే..

ఇంటర్నెట్ డెస్క్: పైఫొటో చూశారుగా! ఈ జంతువేంటో గుర్తు పట్టారా? దీన్ని ఇంగ్లిష్‌లో పాంగోలిన్(Pangolin) అంటారు. తెలుగులో చెప్పాలంటే అలుగు. ప్రపంచంలో అత్యధికంగా అక్రమరవాణా చేసే జంతువుల్లో(Wildlife trafficking) అలుగులు రెండో స్థానంలో ఉంటాయని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల తాము ఓ అలుగును అక్రమరవాణా కాకుండా అడ్డుకున్నామని చెప్పారు. దాని ఫొటోను నెట్టింట షేర్ చేశారు. భారత్‌లో ఈశాన్య రాష్ట్రాల అడవులు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పాంగోలిన్‌లు కనిపిస్తాయని చెప్పారు.

ఎందుకింత డిమాండ్..

సంప్రదాయక వైద్య విధానాల్లో(Traditional medicine) పాంగోలిన్ శరీరంపై ఉన్న పొలుసులను(scales) ఉపయోగిస్తారు. మరోవైపు.. పాంగోలిన్‌ల వేటను అనేక దేశాలు నిషేధించాయి. దీంతో.. పాంగోలిన్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. వీటి కోసం లక్షలు వెచ్చించేందుకు కూడా వెనకాడరు. అలుగుల పొలుసుల్లో ఔషధ గుణాలు ఎక్కవన్న భావనతో ఆసియా దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. ఇక చైనా, వియత్నాం దేశాల్లో కొందరు అలుగులను మాంసం(Pangolin meat) కోసం వేటాడతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది రకాల పాంగోలిన్ జాతులు ఉన్నాని. ఆసియాలో నాలుగు రకాల పాంగోలిన్‌లు ఉండగా.. ఆఫ్రికాలో మరో నాలుగు జాతులు ఉన్నాయి. చిన్న చిన్న పురుగులను తినే ఈ జీవాలు.. మనుషులకు ఎటువంటి హానీ తలెపెట్టవు. పైపెచ్చు.. అపాయం కలుగుతుందనే సమయంలో గుండ్రంగా ముడుచుకుపోతాయి. దీంతో.. నేరస్థులు వాటిని సులభంగా అక్రమరవాణా చేయగలుగుతున్నారు.

కాగా.. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలుగును కాపాడిన టీంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. చట్టాల అమల్లో లొసుగుల కారణంగానే నేరగాళ్లు యథేచ్ఛగా పాంగోలిన్‌ల వేటకు పూనుకుంటున్నారని చెప్పారు.

Updated Date - 2023-02-21T21:02:36+05:30 IST