Viral News: నాలుగు రెక్కలు ఉన్న ఫ్యాన్ మంచిదా..? మూడు రెక్కల ఫ్యాన్‌ను వాడాలా..? రెండింటిలో ఏది బెస్ట్ అంటే..!
ABN , First Publish Date - 2023-09-05T15:20:23+05:30 IST
మార్కెట్లో మూడు రెక్కలు, నాలుగు రెక్కలు ఉన్న సీలింగ్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి మధ్యలో తేడాలు ఏంటో, అవసరానికి తగ్గట్టు వేటిని ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త సీలింగ్ ఫ్యాన్(Ceiling fan) కొనాలనుకుంటున్నారా? నాలుగు రెక్కలు ఉన్నది(4-blade fan) కొనాలా లేక మూడు రెక్కలు ఉన్నది(3-blade fan) కొనాలో తేల్చుకోలేకపోతున్నారు. అయితే..ఈ కథనం మీకోసమే. ఈ రెండింటి ఉపయోగాలు వేర్వేరుగా ఉంటాయి(3-blade vs 4-blade). వాటి పనితీరుపై పూర్తి అవగాహనతో కొనుక్కుంటే మన అవసరం చక్కగా తీరుతుంది. డబ్బు వృథా చేసుకున్నామన్న బాధ కూడా తప్పుతుంది.
మనకు తెలిసింది నాలుగు, మూడు రెక్కలున్న(బ్లేడ్స్) ఫ్యాన్లే కానీ ఐదు, ఆరు రెక్కలున్నవి కూడా ఉన్నాయని నిపుణులు చెబుతారు. నాలుగు రెక్కల వాటిని ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వాడుతారట. ఏసీ లేదా కూలర్‌కు అనుబంధంగా వీటిని వినియోగిస్తారు. వీటికి నాలుగు రెక్కలు ఉండటంతో ఏసీ లేదా కూలర్ నుంచి వచ్చే చల్లటి గాలిని గదంతా పరుచుకునేలా చేయగలవని నిపుణులు చెబుతారు. ఇక నాలుగు రెక్కలున్న ఫ్యాన్‌తో ఎక్కువ గాలి వస్తుందనుకోవడం కూడా తప్పని టెక్నిషియన్లు అంటున్నారు. నాలుగు రెక్కల ఉన్న కారణంగా గాలితో ఒరిపిడి ఎక్కువై ఫ్యాను కాస్తంత నెమ్మదించినట్టు అవుతుందని అంటున్నారు.
భారత్‌లో అత్యధికంగా మూడు రెక్కలున్న ఫ్యాన్లే వాడతారట. వాటి నుంచి వేగంగా గాలి వీచడమే దీనికి కారణం. మూడు రెక్కలే ఉండటంతో ఫ్యాను తిరిగి సమయంలో గాలితో ఒరిపిడి తగ్గి ఫ్యాను వేగం కాస్తంత పెరుగుతుంది. దీంతో, మన శరీరానికి ఎక్కువగా తగులుతుంది. ఈ కారణంగానే ఏసీ వినియోగం తక్కువగా ఉన్న భారత్‌లో ప్రజలు మూడు బ్లేడ్ల ఫ్యాన్‌లను ఇష్టపడతారు. వీటి విద్యుత్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఏసీ లేని ఇళ్లకు ఇది తగిన ఫ్యాన్ అని టెక్నీషియన్లు చెబుతారు. అయితే, ఇవి వేగంగా తిరిగే కారణంగా చప్పుడు ఎక్కువ వస్తుందని కూడా చెబుతున్నారు.
ఇక మూడు బ్లేడ్లు ఉన్న ఫ్యాన్లు నాలుగు బ్లేడ్స్ ఉన్న వాటి కంటే ఖరీదు కూడా తక్కువే. అయితే, నాలుగు బ్లేడ్స్ ఉన్నవి కాసంత అందంగా కనిపించడంతో కొందరు వీటిని ఇంటి అలంకరణ దృష్ట్యా కొనుగోలు చేస్తారు. బాగా ఖరీదైన, లగ్జరీ ఇళ్లల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని టెక్నీషియన్లు చెబుతారు. సో..మీమీ అవసరాలకు ఏదీ తగినదని అనుకుంటే అది కొనుగోలు చేయండి!