Air India Water Leak: ఎయిర్ ఇండియా విమానంలో లగేజీ బిన్స్ నుంచి సీట్లపై నీళ్లు లీక్.. నెట్టింట వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-11-30T19:23:42+05:30 IST
ఎయిర్ ఇండియా విమానంలో లగేజీ బిన్స్ నుంచి సీట్లపై నీళ్లు లీకవుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఎయిర్‌పై విమర్శలు సంధిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానంలో నీళ్లు లీకవుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది(viral video). ప్రయాణికుల సీట్లకు పైన లగేజీ పెట్టుకునే బిన్స్ నుంచి బొట్లుబొట్లుగా నీళ్లు సీట్లపై పడటం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ప్రయాణికులు ఇవేవీ పట్టించుకోకుండా నిద్రపోవడం కూడా వీడియోలో రికార్డైంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఘటనపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి(Water leaks through overhead bins on Air India flight).
నీళ్లు లీక్ అవడానికి కారణంపై స్పష్టత లేకపోవడంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేశారు. కొందరు ఏసీలో సమస్య ఉందని చెబితే మరికొందరు విమానం నిర్వహణ సరిగ్గా లేదని కామెంట్ చేశారు. ఎయిర్ ఇండియా అందించే అద్భుత ప్రయాణానుభవంలో ప్రయాణికులను మునిగితేలుతున్నారంటూ కొందరు సెటైర్లు పేల్చారు.
ఓవర్ హెడ్ బిన్స్‌లో పేరుకుపోయిన మంచు కరిగి బొట్లుబొట్లుగా కిందపడుతోందని అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా ఇలాంటి నీరు బయటకు పోయేందుకు బిన్స్‌లోనే ఓ మార్గం ఉంటుంది. ఏకారణంగా అయినా అది దెబ్బతింటే ఇలా జరగొచ్చని సదరు నెటిజన్ చెప్పుకొచ్చాడు. కారణం ఏదైనా, విమానం నిర్వహణ సరిగా ఉంటే ఇలాంటివి జరగవని స్పష్టం చేశాడు. అయితే, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది.