International women's day: నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా.. భర్త మరణించినా ఆయన ఆశయాన్ని బతికించుకున్న మహిళ..

ABN , First Publish Date - 2023-03-08T19:26:17+05:30 IST

భర్త ఆశయాన్ని కొనసాగిస్తూ అంధ బాలబాలికలకు అండగా నిలుస్తున్న వరంగల్ మహిళ.

International women's day: నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా.. భర్త మరణించినా ఆయన ఆశయాన్ని బతికించుకున్న మహిళ..

ఇంటర్నెట్ డెస్క్: అంధులైన చిన్నారులకు ఓ తల్లిగా అన్నీ తానై అండగా నిలుస్తోందా మహిళ. భర్తను కరోనా పొట్టనపెట్టుకున్నా ఆయన ఆశయాన్ని బతికించుకుంటోంది. చీకటి తప్ప మరో లోకం తెలియని చిన్నారుల్లో కొత్త వెలుగులు నింపుతోంది. భర్త దూరమైనా, కష్టాలు చుట్టుముట్టినా ఆమె అధైర్యపడలేదు. బాధను దిగమింగుకుని ముప్ఫై రెండు మంది చిన్నారుల ఆలనా పాలనా చూస్తున్న ఆ ధీరవనిత పేరు కల్యాణి (International Women's Day). ఉండేది వరంగల్‌‌లో (Warangal).. చిన్న చిన్న ఎదురుదెబ్బలకే ధైర్యం కోల్పోయి కుప్పకూలే వారున్న ప్రపంచంలో పట్టుదలగా ముందడుగేస్తూ సమాజసేవ చేస్తున్న కల్యాణి గురించి ఓ స్పెషల్ స్టోరీ మీ కోసం..

కల్యాణిది అందరిలాగే ఓ సాధారణ జీవితం. ఆమె భర్త కుమారస్వామి కూడా అంధుడే. కష్టపడి చదివిన ఆయన ప్రభుత్వోద్యోగం సంపాదించారు. వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. జీవితం సాఫీగా సాగిపోతోందనుకుంటున్న తరుణంలో వారితో విధి మరోసారి పరిహాసమాడింది. వారికి పుట్టిన కుమార్తె కూడా అంధురాలే కావడంతో ఆ దంపతులు కుంగిపోయారు. అయితే.. బిడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ భార్యాభర్తల్లో అంధులకు ఏదైనా చేయాలన్న తపన మొదలైంది. అలా ఆలోచనకు ప్రత్యక్ష రూపమే లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల. స్నేహితులు, దాతల సాయంతో అంధ బాలబాలికల కోసం ఈ పాఠశాలను నెలకొల్పారు.

ఓ ఆశయంతో ముందుకెళుతున్న ఆ దంపతులను విధి మరోసారి కాటేసింది. కుమార స్వామిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఈ పరిస్థితుల్లో మరొకరైతే పాఠశాల బాధ్యతలను వదిలేసుకునే వారే. కానీ.. కల్యాణి అలా కాదు. భర్త లేరన్న బాధ గుండెలను మెలిపెడుతున్నా..ఆయన ఆశయాన్ని బతికించుకునేందుకు ఆమె నడుం కట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయనని చెబుతున్న కల్యాణి.. భర్త బాటలో చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. తన సంపాదనతో పాటూ దాతల సాయంతో స్కూల్ విద్యార్థుల ఆలనాపాలనా చూస్తున్నారు. పదో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 32 మంది విద్యార్థులు ఉన్నారు. కల్యాణి ఆలనాపాలనలో స్కూల్ విద్యార్థులు పువ్వుల్లా వికసిస్తున్నారు. చదువు, ఆటపాటల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. పిల్లలు ఎంతో చురుకు. ఏ విషయాన్నైనా క్షణాల్లో ఆకళింపు చేసుకునే ప్రతిభ వారి సొంతం. కొందరు మిమిక్రీ కళలోనూ ప్రతిభ చూపిస్తున్నారు. నారి శక్తికి నిదర్శనంగా నిలుస్తున్న కల్యాణి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Updated Date - 2023-03-08T22:30:24+05:30 IST