Viral: ఇలాంటి పని చేశావేంటమ్మా! పులి నోటికి చిక్కిన యువతికి ఏం చేయాలో పాలుపోక..
ABN , First Publish Date - 2023-06-06T18:24:11+05:30 IST
పులి తలనిమిరిన ఓ యువతి లేనిపోని ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది. పులి ఒక్కసారిగా ఆమె చేయిని నోట కరిచిపట్టుకోవడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. చేతిని బలంగా వెనక్కు లాగితే పులిని మరింత రెచ్చగొట్టినవుతుందని, జాగ్రత్తగా తప్పించుకునేందుకు నానా యాతనా పడుతుంది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: జీవితమంతా బోనులో గడిపినా పులి పులే! వేటాడటం దాని సహజ లక్షణం. నరనరానా ఇంకిపోయిన ఈ అలవాటు క్షణానికోమారు తలెగరేస్తుంటుంది. అందుకే తమ ఎదురుగా ఏదైనా పరిగెడితే చాలు పులులు వాటి వెంటపడతాయి. వేటాడి నోటపట్టేందుకు ఎగ ఉబలాట పడతాయి. టైం బాలేకపోతే ఒక్క పంజా విసిరి ప్రాణాలు తీసేస్తాయి. కానీ కొందరికి ఇలాంటివి అర్థం కావు. బోనులో ఉన్న పులే కదా అనుకుంటూ వాటిని తాకే ప్రయత్నం చేస్తారు. కుక్కనో పిల్లినో ముద్దు చేస్తున్నట్టు పెద్ద పులితో వ్యవహరిస్తారు. సరిగ్గా ఇలాంటి తేడా చర్యకు పూనుకున్న ఓ యువతి ఊహించని ప్రమాదంలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ యువతి పులి తల నిమిరి చిక్కుల్లో పడింది. ఆమె తన తలపై చేయి వేశాక కాసేపు ఊరుకున్న పులి ఒక్కసారిగా ఆమె చేయి నోటకరిచిపట్టుకుంది(Tiger catch hold of woman). పులికి దాడి చేసే ఉద్దేశం లేనట్టు కనిపించినా మహిళకు మాత్రం గుండె జారినంత పనైంది. పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది మరింత గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో దాని నాలుకకు రక్తం రుచి తగిలితే పరిస్థితి చేయిదాటి పోయినట్టే.
అందుకే మహిళ పులితో చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. పులినోటిలోని చేయిని బలవంతంగా లాగే ప్రయత్నం చేయకుండా ఓపిగ్గా దాని తలనిమురుతూ పులి దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది. దీంతో, చేయి వదిలేసిన పులి మహిళ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఈసారి కాలు పట్టుకుంది. ఆమెను ఎటూ కదలనీకుండా చేసి నడుము, చేతులు, తొడ నోట కరిచే ప్రయత్నం చేసింది. ఇదంతా జరుగుతున్నప్పుడు మహిళ మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, ఆమె వెంట ఉన్నవారు కూడా ఒక్కసారిగా షాకయిపోయారు. పులికి ఎక్కడ కోపం వస్తుందో అనుకుంటూ మిన్నకుండిపోయారు. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో కనిపించనప్పటికీ నెటిజన్లు మాత్రం దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు.
క్రూర జంతువులతో పరిహాసాలు ఆడితే ఏం జరుగుతుందో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ అని అనేక మంది కామెంట్ చేశారు. బోనులో పెట్టినంత మాత్రాన పులి, సింహం, ఇతర క్రూర జంతువులు వేటాడే లక్షణాన్ని కోల్పోవని, వాటితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరికొందరు మహిళపై విమర్శలు గుప్పించారు. అనవసరంగా ప్రమాదానికి ఎదురెళ్లావంటూ మండిపడ్డారు. మరి నెట్టింట గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.