Marriage: ఫొటోగ్రాఫరే పెళ్లి కొడుకయితే.. ఇదిగో ఇలాగే ఉంటుంది.. వరుడిగా పక్కన కూర్చోవాల్సిన వ్యక్తి కాస్తా..!

ABN , First Publish Date - 2023-03-31T21:24:01+05:30 IST

పెళ్లికొడుకయిన ఫొటోగ్రాఫర్.. వివాహ వేదికపై ఇతడేం చేశాడో తెలిస్తే..

Marriage: ఫొటోగ్రాఫరే పెళ్లి కొడుకయితే.. ఇదిగో ఇలాగే ఉంటుంది.. వరుడిగా పక్కన కూర్చోవాల్సిన వ్యక్తి కాస్తా..!

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో పెళ్లిళ్ల వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొట్టాయి. పెళ్లిమండపంలోనే వరుడు లాప్‌టాప్‌పై పనిచేసుకోవడం, వరుడు నచ్చక వధువు అతడి చెంప ఛెళ్లుమనిపించడం..ఇలా రకరకాల ఘటనల తాలూకు వీడియోలు నెటిజన్లను కడుపుబ్బా నవ్వించాయి. అయితే.. వాటన్నిటికీ భిన్నమైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్(Viral Video) అవుతోంది.

ఈ వీడియోలోని వరుడు ఓ ఫోటోగ్రాఫర్. అయితే.. అతడి పెళ్లి జరిగాక ఫొటోలు దిగే కార్యక్రమం మొదలైంది. వధూవరులు ఇద్దరూ రకరకాల ఫోజులిస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో వరుడిలో మెల్లగా అసంతృప్తి మొదలైంది. ముఖ్యంగా వధువు ఫొటోలను అక్కడి ఫొటోగ్రాఫర్లు సరిగ్గా తీయట్లేదని ఫీలయ్యాడు.

దీంతో తనే స్వయంగా రంగంలోకి దిగాడు. కెమెరా పట్టుకుని తన భార్య ఫొటోలను నచ్చిన ఫోజుల్లో తనే తీయడం ప్రారంభించాడు(Groom takes brides pics). అంతేకాదు.. లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో ఓ చేత్తో కెమెరాలో లైట్ ఆన్ చేసి మరీ తనకు నచ్చిన విధంగా భార్య ఫొటోలు తీసుకున్నాడు. పెళ్లికొచ్చిన అతిథుల్లో ఒకరు ఇదంతా వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకూ 33 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈ ఘటన ఎంతగా వైరల్ అవుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక నెటిజన్లు రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు. బ్రదర్‌కు తన ప్రొఫెషన్ పట్ల నిబద్ధత ఎక్కువనుకుంటా అంటూ కొందరు కామెంట్ చేశారు. మనోడి తీరు చాలా క్యూట్‌గా ఉందంటూ కోకొల్లలుగా కామెంట్స్ వచ్చిపడ్డాయి.

Updated Date - 2023-03-31T21:24:01+05:30 IST