Tushar Gandhi: తాతయ్యా...ఇదే చివరి ఆలింగనం

ABN , First Publish Date - 2023-01-09T16:42:31+05:30 IST

''సబర్మతి ఆశ్రమాన్ని కోల్పోయే ముందు, ఇదే చివరి ఆలింగనం బాపూ'' అంటూ గాంధీజీ ముని మనుమడు తుషార్ గాంధీ సోమవారంనాడు సోషల్ మీడియాలో...

Tushar Gandhi: తాతయ్యా...ఇదే చివరి ఆలింగనం

న్యూఢిల్లీ: ''సబర్మతి ఆశ్రమాన్ని కోల్పోయే ముందు, ఇదే చివరి ఆలింగనం బాపూ'' అంటూ గాంధీజీ ముని మనుమడు తుషార్ గాంధీ (Tushar Gandhi) సోమవారంనాడు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ సంచలనమవుతోంది. గుజరాత్ ప్రభుత్వం మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ చేసిన ప్రతిపాదనను మొదట్నించీ గాంధీ మనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకిస్తూ వచ్చారు. తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి ఈ కేసు గుజరాత్ హైకోర్టుకు రావడం, తుషార్ పిల్‌ను హైకోర్టు తోసిపుచ్చడం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో గాంధీ చేసిన తాజా ట్వీట్ సంచలనమవుతోంది. ఏమైంది సార్?, ఎందుకు సబర్మతిని కోల్పోతున్నాం? గాంధీజీ సిద్ధాంతాలను వదులుకోం, ఇండియా గెలవాలి, త్వరలోనే ఈ ఆశయ సిద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం అని కొందరు, సబర్మతి మీ వారసత్వం కాదని, మోదీ వ్యతిరేక ఐడియాలిజీని క్రియేట్ చేయవద్దంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సబర్మతీ ఆశ్రమంతో గాంధీజీ జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం జరుగుతోందా? రీడవలప్‌మెంట్‌తో గాంధీజీ జ్ఞాపకాలను భావితరాలకు అందించే విశిష్ట ప్రయత్నం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

పూర్వాపరాల్లోకి...

ప్రపంచ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమాన్ని పునరుద్ధరించనున్నట్టు 2019లో కేంద్ర ప్రకటించింది. 1200 కోట్లతో రీడవలప్‍మెంట్‍ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 48 ఎకరాల వారసత్వ ఆస్తులతో కలిపి 54 ఎకరాల్లో ఆకర్షణీయమైన వీఐపీ అతిథి గృహాలు, నూతన మ్యూజియం, ఫుడ్ కోర్టులు, దుకాణాలతో గోళాకృతిలో తీర్చిదిద్దనున్నట్టు పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రాజెక్టును నిర్వహించేందుకు కార్యనిర్వాహక మండలి, పాలక మండలిని ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యంలోని సబర్మతి రివర్ ఫ్రంట్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రణాళిక అమలుకు నిర్ణయించింది.

కాగా, సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ ప్రతిపాదనను మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ ప్రతిపాదన గాంధీ వ్యక్తిగత అభిప్రాయాలకు భిన్నంగానూ, సబర్మతి ఆశ్రమ ప్రత్యేకతను మసకబార్చే విధంగానూ ఉందని, పర్యట ఆకర్షణ శక్తిని తగ్గిస్తుందని తుషార్ గాంధీ తన పిల్‌లో వాదించారు. ఏడు దశాబ్దాలుగా ట్రస్టుల పర్యవేక్షణలో ఆశ్రమ నిర్వహమ బాగానే ఉందని, ఇప్పుడెందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటోందని ఆయన నిలదీశారు. అదీగాక, ప్రైవేటు వ్యక్తులు, పారిశ్రామికవేత్తల నుంచి స్మారక నిధి సేకరిస్తోందన్నారు. కమిటీ నియామకంలో ప్రభుత్వం పాలుపంచుకోలేదని, ప్రస్తుత ప్రాజెక్టులో కూడా వేర్వేరు నిర్మాణాల కోసం కేంద్ర నిధులను విడుదల చేస్తుందని, దాంతో ఆశ్రమంపై కేంద్రానికి ఎలాంటి హక్కులు ఉండవని అన్నారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలో సబర్మతి ఆశ్రమం ప్రముఖంగా నిలిచిందని, చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేయవద్దని కోరారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తుషార్ పిల్‌ను తోసిపుచ్చింది. ఆశ్రమ ప్రాంతంలోని కీలకమైన 5 ఎకరాల స్థలం జోలికి వెళ్లమని, అది యథాతథంగానే ఉంటుందని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన హామీతో కోర్టు ఏకీభవించింది.

సుప్రీంకోర్టుకు..తిరిగి హైకోర్టుకు..

గుజరాత్ హైకోర్టు నిర్ణయాన్ని తుషార్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే ఈ కేసును తిరిగి హైకోర్టుకు అత్యున్నత న్యాయస్థానం తిప్పిపంపింది. కేసులోని మంచిచెడ్డలను పరిగణనలోకి తీసుకుని తిరిగి విచారణ జరపాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి గుజరాత్ హైకోర్టులో తుషార్ వేసిన పిటిషన్‌ విచారణకు వచ్చింది. తుషార్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను హైకోర్టు రెండోసారి కూడా తోసిపుచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టు మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆలోచనను మరింత ప్రమోట్ చేసేలా ఉన్నాయని, ఇందువల్ల సమాజానికి, మానవ శ్రేయస్సు మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రితో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సబర్మతి ఆశ్రమ్ ప్రిజర్వేషన్ అండ్ మెమోరియల్ ట్రస్టు, ఖాదీ గ్రామోద్యోగ్ ప్రయోగ్ సమితి, హరిజన్ ఆశ్రమ్ ట్రస్టు, శబర్మతి ఆశ్రమ గోశాల ట్రస్టు, హరిజన్ సేవక్ సంఘ్ ట్రస్టు అనుమతి, సహకారంతోనే రీడవలప్‌మెంట్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిన విషయాన్ని తమ తీర్పులో ధర్మాసనం తెలియజేసింది. గవర్నింగ్ కౌన్సిల్‌లో ఈ ట్రస్టుల ప్రతినిధులను కూడా చేర్చనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిందని తెలిపింది. మహాత్మాగాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ రీసెర్చ్ వర్క్ ఆధారంగానే రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. గాంధీజీ సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఉపకరించే విధంగా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తుందనే నమ్మకం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

trust1.jpg

18 శాతం పనులు పూర్తి...

కాగా, సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఇంతవరకూ 18 శాతం పనులు పూర్తయ్యాయని ఆశ్రమ వర్గాల భోగట్టా. సబర్మతి ఆశ్రమ గోశాల సిబ్బంది క్వార్టర్లను కూల్చివేశారు. 51 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.

Updated Date - 2023-01-09T16:42:33+05:30 IST