Airport: విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం.. నా బ్యాగులో బాంబు ఉందంటూ బెదిరించిందో మహిళ.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-06-02T21:03:00+05:30 IST

పరిమితికి మించి లగేజీని వెంట తెచ్చుకున్న విమానప్రయాణికురాలిని ముంబై విమానాశ్రయ సిబ్బంది అదనపు చార్జీలు చెల్లించమన్నారు. దీంతో, వాగ్వాదానికి దిగిన మహిళ తన బ్యాగులో బాంబు ఉందంటూ వారిని బెదిరించే ప్రయత్నం చేసింది.

Airport: విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం.. నా బ్యాగులో బాంబు ఉందంటూ బెదిరించిందో మహిళ.. అసలేం జరిగిందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: అది ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఎయిర్‌పోర్టు ప్రయాణికుల సందడిగా ఉంది. సిబ్బంది కూడా ప్రయాణికుల లగేజీ తనిఖీలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ మహిళ ప్రయాణికురాలు సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన బ్యాంగులో బాంబు ఉందంటూ అందరినీ హడలెత్తించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆమె లగేజీని తనిఖీ చేయగా అందులో ఏ బాంబు లేదని తేలిసింది. మే 29న జరిగిందీ ఘటన.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబైకి చెందిన ఓ మహిళ తన భర్త పిల్లలతో కలిసి కోల్‌కతాకు వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆ తరువాత చెకిన్ కౌంటర్ వద్ద ఆమె తన లగేజీని తనిఖీల కోసం సిబ్బందికి ఇచ్చింది. అయితే, ఆమె చెకిన్ లగేజీ బరువు ఎక్కువగా ఉండటంతో అదనపు బరువుకు డబ్బులు చెల్లించాలని సిబ్బంది చెప్పారు.

విమానయాన నిబంధనల ప్రకారం, డొమెస్టిక్ విమానప్రయాణికులు తమ వెంట తెచ్చుకునే చెకిన్ లగేజీపై 15 కేజీల పరిమితి ఉంది. అంతకు మించిన బరువుకు ప్రయాణికులు అదనపు చార్జీలు చెల్లించాలి. అయితే, మహిళ తన వెంట మొత్తం 22.1 కేజీల బరువున్న రెండు బ్యాగులు తెచ్చుకుంది. సిబ్బంది అదనపు చార్జీ చెల్లించమని కోరడంతో వారితో తగాదాకు దిగింది. ఈ క్రమంలోనే బ్యాగులో బాంబు ఉందని చెప్పి కలకలం రేపింది. ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబులు ఏవీ లేవని నిర్ధారించుకున్నారు. అయితే, మహిళ ప్రకటనతో విమానాశ్రయంలో కలకలం రేగడంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2023-06-02T21:03:04+05:30 IST