‘బస్సెక్కి వస్తావో.. బండెక్కి వస్తావో... కారెక్కి వస్తావో...’ ఇవేవీ వద్దు.. ‘సైకిల్‌పై ఆఫీసుకు వస్తే డబ్బులిస్తాం’... ప్రకటన చూసి క్యూ కడుతున్న జనం!

ABN , First Publish Date - 2023-03-05T11:18:30+05:30 IST

రోడ్లపై తిరిగే వాహనాల వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతుందో మనకు తెలిసిందే. వాహనాల పొగ నుంచి వెలువడే కార్బన్ వల్ల మన వాతావరణం వేగంగా మారిపోతోంది. భూమి ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది.

‘బస్సెక్కి వస్తావో.. బండెక్కి వస్తావో... కారెక్కి వస్తావో...’ ఇవేవీ వద్దు.. ‘సైకిల్‌పై ఆఫీసుకు వస్తే డబ్బులిస్తాం’... ప్రకటన చూసి క్యూ కడుతున్న జనం!

రోడ్లపై తిరిగే వాహనాల వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతుందో మనకు తెలిసిందే. వాహనాల పొగ నుంచి వెలువడే కార్బన్ వల్ల మన వాతావరణం వేగంగా మారిపోతోంది. భూమి ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో పర్యావరణాన్ని కాపాడటానికి, కర్బన ఉద్గారాలను అరికట్టడానికి చాలా దేశాలు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నాయి. వీటిలో ఒకటి సైకిల్‌ను ప్రోత్సహించడం. అంటే, వీలైనంత వరకు సైకిల్‌పై ప్రయాణించడం. సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు కొన్ని యూరోపియన్ దేశాలు వినూత్న మార్గాన్ని కనుగొన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరోపా దేశమైన బెల్జియంలో సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లేవారు ప్రభుత్వం నుంచి నగదు అందుకుంటారు. ఈ నగదును కిలోమీటర్ ప్రాతిపదికన అందజేస్తారు. మరోవైపు నెదర్లాండ్స్‌లో కూడా సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లే వారికి ఏటా నగదు అందజేస్తారు. నెదర్లాండ్స్‌లో రోజూ 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కితే, సంవత్సరానికి 480 యూరోలు అంటే భారతీయ రూపాయలలో సుమారు 41 వేల 916 ​​రూపాయలు అందుకుంటారు.

ఇటలీలో కూడా సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లే వారికి నెలకు దాదాపు 25 యూరోలు లభిస్తాయి. బ్రిటన్‌లో సైకిల్-టు-ఆఫీస్ పథకంలో వివిధ కంపెనీలు ఉద్యోగుల కోసం సైకిళ్లను కొనుగోలు చేస్తాయి. వీటిని ఉద్యోగులు నెలవారీ చెల్లింపుల మేరకు తీసుకోవచ్చు. దీనిలో వారికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. లక్సెంబర్గ్ దేశంలో సైకిల్ లేదా ఇ-బైక్ ధర సుమారు 600 యూరోలు ఉంటే, 50% వరకు ధర తగ్గింపు పొందుతారు. సైకిల్ తొక్కుతూ ఆఫీసులకు వెళ్లేవారిలో క్యాన్సర్ ముప్పు 45% మేరకు తగ్గుతుందని గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది.

గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 46 శాతం మేరకు తగ్గుతుంది. దీంతో పాటు రోజూ సైకిల్ తొక్కుతూ ఆఫీసుకు వెళితే పర్యావరణానికి హాని జరగదు. ఈ రకమైన పథకం యూరోపియన్ దేశాలలో విజయవంతమైంది. అయితే ఇప్పటివరకు మనదేశంలో అలాంటి పథకం ఏదీ ప్రభుత్వం అమలు చేయలేదు. భవిష్యత్తులో ఇదే జరిగితే భారత్‌లో ఈ పథకం విజయవంతమవుతుందా లేదా అనేది చూడాలి.

Updated Date - 2023-03-05T11:18:30+05:30 IST