Gold: ఎంత తవ్వితే అంత బంగారం

ABN , First Publish Date - 2023-07-30T15:59:13+05:30 IST

మన దేశంలోనే కాదు.. ప్రపంచమంతా బంగారానికి దాసోహం అంటుంది. ఎంత పేదవాళ్లయినా సరే.. తులమైనా మెడలో మెరుస్తుంటుంది.

Gold: ఎంత తవ్వితే అంత బంగారం

మన దేశంలోనే కాదు.. ప్రపంచమంతా బంగారానికి దాసోహం అంటుంది. ఎంత పేదవాళ్లయినా సరే.. తులమైనా మెడలో మెరుస్తుంటుంది. ఇంత విలువైన స్వర్ణం మనకు ఆభరణాల్లోనే కనిపిస్తుంది. ఆ లోహం గనుల్లో నుంచి తీయడానికీ, శుద్ధి చేసి రవాణా చేయడానికీ, దాన్ని మళ్లీ కరిగించి ఆభరణాలుగా మార్చడానికీ పెద్ద తతంగమే జరుగుతుంది. ఆకలి దేశాల ఆఫ్రికా ఖండం గనుల్లో నుంచి ఈ స్వర్ణం మన వరకు ఎలా వస్తుంది? దీని వెనక ఎవరికష్టం.. ఎవరి లాభం ఎంత ఉంది? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..

‘‘వారికేం? బంగారం తినేన్ని ఆస్థిపాస్తులు ఉన్నాయి..’’ ధనికుల గురించి మాట్లాడేప్పుడు కచ్చితంగా పుత్తడి ప్రస్తావన రానే వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విలువైన లోహాలు ఉండొచ్చు.. కానీ మనందరి జీవితంలో భాగమైన బంగారమంత విలువైన లోహం మరొకటి లేదు. అందుకే పుత్తడిని తలుచుకోని సందర్భం అంటూ ఉండదు. అయితే ప్రకృతి ఉన్నవాడికి అందకుండా చేస్తుంది అనేందుకు ఆఫ్రికా ఒక నిదర్శనం. అక్కడ తవ్వి తీసిన బంగారంతో ప్రపంచమంతా వ్యాపారం చేస్తుందికానీ.. గనుల్లో శ్రమించిన కార్మికుల జీవితాలు మాత్రం బాగుపడటం లేదు. గనుల యజమానులు, బంగారం వ్యాపారులు ధనికులు అవుతున్నారు.

ఆకలి, కటిక దారిద్య్రం, అంటువ్యాధులు.. నిత్యం జరిగే అంతర్యుద్ధాలతో అట్టుడుకుతుంటుంది ఆఫ్రికా.. అయితే దురదృష్టం అనాలో, అదృష్టం అనాలో తెలియదు కానీ.. ఆకలి దేశాలలో నిండుకున్న అపార బంగారం నిల్వల కోసం అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్లు పోటీ పడుతున్నాయి. ఈ పేద దేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా... దుబాయి మీదుగా భారతనాట పసిడి పరుగులు పెడుతుంది. బులియన్‌ మార్కెట్లకు సవాల్‌ విసురుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఆఫ్రికా నుండి దుబాయి మీదుగా ముంబయి ద్వారా కడపజిల్లాలోని ప్రొద్దుటూరు వరకు బంగారం చేతులు మారుతూ చేరుకుంటుంది.


Untitled-5.jpg

అత్యధికం అక్కడి నుంచే..

ఇంత విలువున్న బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ దేశం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది? ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలే! చైనా, రష్యా, ఆస్ర్టేలియా, అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలు అధికారికంగా ప్రపంచ బంగారం ఉత్పత్తిలో సగ భాగం కలిగి ఉన్నాయి. ఇందులో అధికవాటా దక్షిణాఫ్రికాది. వీటితోపాటు ఆఫ్రికాలోని ఘనా, కాంగో, సిర్రియోలోన్‌, జింబాబ్వే, మాలీ, బుర్కినాఫాసొ, రువాండా, నైజర్‌, నైజీరియా దేశాలతోపాటు సూడాన్‌ కూడా అనధికారికంగా మరో సగం వాటా కలిగి ఉంది. ప్రపంచంలోకెల్లా బంగారం ఉత్పత్తులలో ఆఫ్రికా అగ్రభాగాన ఉండగా దిగుమతుల్లో మాత్రం మన దేశం ఉంది. బంగారం వ్యాపారంలో గుజరాతీల ప్రాబల్యం అధికం. వాణిజ్యం సంగతి అలా ఉంచితే.. పుత్తడి విలువైన లోహం కాబట్టి అక్రమ మార్గాల్లోనూ దేశాలు దాటుతోంది. దీనిని నిలువరించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్డుమార్గంలో నిఘావర్గాలు కాపుకాచినా.. ఎలాగోలా దొడ్డిదారిన బంగారాన్ని తీసుకొస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ వ్యాపారానికి ముప్పు ఏర్పడుతోందని భావిస్తున్నాయి లండన్‌, స్విట్జర్లాండ్‌ బులియన్‌ మార్కెట్లు. ఆఫ్రికాలోని కొన్ని దేశాలు దశాబ్దాలుగా సంప్రదాయ పద్ధతుల్లో బంగారాన్ని వెలికితీసి ఎగుమతి చేస్తుండగా.. గత కొన్నేళ్లుగా సుడాన్‌ కూడా ముడి బంగారం ద్వారా ఈ రంగంలో శరవేగంగా దూసుకెళుతోంది. తక్కువ సమయంలోనే అత్యధిక బంగారం ఎగుమతులతో ఆఫ్రికాలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నది సుడాన్‌. ఆ దేశంలో సైన్యం, దాని అనుబంధ సాయుధ దళాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధానికి ప్రధాన కారణం బంగారు గనులపై పట్టు సాధించడానికే!. ఉక్రెయిన్‌ యుద్ధం తరువాత తన ఆర్థిక అవసరాల కోసం రష్యా కూడా సుడాన్‌ బంగారంపై ఆధారపడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్న కొందరు తెలుగువాళ్లు కూడా భారీవేతనాలు కలిగిన ఉద్యోగాలను వదులుకుని సుడాన్‌కు తరలివెళ్లారు. అక్కడ బంగారు గనుల అన్వేషణలో మునిగిపోయారు. హైదరాబాద్‌, చెన్నై, ముంబయి విమానాశ్రయాలలో సుడాన్‌ జాతీయ మహిళలు ఒక్కొక్కరు కిలోకుపైగా బంగారం కడ్డీలను అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. ఇలాంటి కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. బంగారం ముసుగులో ధనికవ్యాపారుల స్వార్థానికి పేదలు బలిపశువులు అవుతున్నారు.

దళారులకు విక్రయిస్తూ..

బంగారాన్ని గనుల్లో నుంచి తీసి శుద్ధి చేసి.. మార్కెట్‌ చేయడం సహజప్రక్రియ. అయితే ఆఫ్రికా దేశాల్లో ఆయా తెగల ప్రజలు భూమిని తవ్వుతూ పుత్తడిని వెలికితీస్తున్నారు. మన దేశంలోని అడవుల్లో తునికాకు సేకరించి బీడీ పరిశ్రమలకు అమ్ముతున్నట్లుగా వీరు కొన్ని భూములను తవ్వి, ముడి బంగారాన్ని సేకరిస్తున్నారు. ఇలా దొరికిన లోహాన్ని శుద్ధి చేసి దళారులకు విక్రయిస్తారు. అలా సమకూరిన ముడిలోహాన్ని దుబాయికి పంపించి, అక్కడ పూర్తిస్థాయిలో శుద్ధి చేసి.. భారతదేశానికి పంపిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లోని అస్థిరత, తెగల మధ్య సాయుధ పోరాటాల కారణంగా ప్రభుత్వ పాలనా వ్యవస్థ బలహీనమైంది. పన్ను విధానం పటిష్టంగా లేదు. అమెరికన్‌ డాలర్‌తో కాకుండా స్థానిక కరెన్సీలో అధికారికంగా పుత్తడిని కొనుగోలు చేస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదు. ఆఫ్రికా నుంచి దుబాయికి ప్రయాణదూరం అనుకూలం కాబట్టి అక్కడికే పంపుతున్నారు. ఎలాంటి అధికారిక రుసుములు చెల్లించకుండా స్థానిక సాయుధ మూకల సహాయంతో సరిహద్దులు దాటుకుంటూ దుబాయికి చేరుకుంటున్న బంగారాన్ని కడ్డీలుగా మార్చి .. ఇక్కడి నుండి భారతీయ బులియన్‌ మార్కెట్‌కు తరలిస్తుండగా .. మరికొందరు ఆఫ్రికా నుండి భారత్‌కు అధికారికంగా ఎగుమతి చేస్తున్నారు.

అస్థిరత్వమే అవకాశం..

ఆఫ్రికాలో బంగారం వెలికితీసే దేశాల్లో ప్రాబల్యశక్తిగా ఎదిగిన దేశం చైనా. ఆఫ్రికాలో చైనాను ఎదుర్కొనేందుకు.. అక్కడి పేద దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, ఖనిజాలపై సుంకాలను మినహాయించింది భారత్‌. ఈ అరుదైన అవకాశాన్ని ఆఫ్రికాలోని భారతీయ బంగారం వ్యాపారులు, అధికశాతం గుజరాతీలు తెలివిగా వాడుకుంటున్నారు. జీరో కస్టమ్‌ విధానం కింద భారత్‌కు గోల్డ్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కింద దిగుమతి చేసుకోవడానికి బంగారం వ్యాపారస్థులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం? రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారుల కంటపడటం. ఆఫ్రికాలో బంగారం గనులు కలిగిన, రవాణా అయ్యే దేశాలలో భారతీయ నిఘా సంస్థలు ప్రత్యేకించి రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు నిరంతరం నిఘా పెడుతుంటారు. ‘వేదాంత’తోపాటు మరికొన్ని భారతీయ సంస్థలు ఆఫ్రికాలోని బంగారు ఖనిజాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నా.. స్థానిక అస్థిరత్వ కారణాల వల్ల సాహసం చేయలేకపోతున్నాయి.

ముడిబంగారాన్ని దుబాయికి పంపించి అక్కడి నుండి రిటైల్‌గా లేదా టోకుగా ప్రయాణికుల ద్వారా నేరుగా భారత్‌కు పంపించడం ఒక పద్ధతి.. దుబాయి నుండి బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మయన్మార్‌ దేశాలకు పంపించి అక్కడి నుండి గుజరాత్‌ లేదా కేరళలకు చేరవేయడం మరో పద్ధతి. టోకు వర్తకంలో గుజరాతీలకు పెట్టింది పేరు కాగా .. ఆభరణాల వ్యాపారంలో కేరళ వాసులు ముందున్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా విదేశాలలో ఉన్న అనేక ప్రముఖ బంగారం ఆభరణాల దుకాణాలన్నీ కేరళకు చెందినవే!.

భారత్‌లో ముడి బంగారాన్ని శుద్ధి చేసే రిఫైనరీలు 40 వరకు ఉన్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 300 టన్నులు. ఈ రిఫైనరీలు అత్యధికంగా గుజరాత్‌లో ఉండటం విశేషం. గత కొన్నాళ్లుగా భారత్‌లో ఆఫ్రికా ముడి బంగారం దిగుమతులు క్రమేణా పెరిగిపోతున్నాయి. మన దేశం సగటున ఏడాదికి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అందులో దాదాపు సగం వరకు ఆఫ్రికా నుంచి వచ్చే ముడి బంగారమే!. మిగిలింది స్విట్జర్లాండ్‌ నుండీ శుద్ధి చేసిన పుత్తడి వస్తోంది. ఆ దేశం కూడా ఆఫ్రికా నుండి ముడి బంగారాన్ని తీసుకుని శుద్ధి చేసి.. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.

1.jpg

ఎడారి దేశంలో..

దుబాయి ఫెస్టివల్‌ అనగానే గుర్తుకొచ్చేది.. బంగారు ఆభరణాల కొనుగోలు. ఆ వేడుకకు అనేక దేశాల పర్యాటకులు తరలివస్తారు. షాపింగ్‌ చేయడానికే దుబాయి వచ్చేవాళ్లు అధికం. ఈ నగరం వెళితే ఎంతోకొంత బంగారం కొనకుండా ఇంటికిరారు. బంగారానికి దుబాయి అంత ప్రసిద్ధి. చమురు కంటే ముందుగా పుత్తడి వర్తకంపై ఆధారపడి ఉంది. ఐరోపా నుండి భారత్‌కు మార్గమధ్యంలో ఉన్న దుబాయి బంగారం రవాణాకు కేంద్రం. అరేబియా సముద్ర జలాలలో ముత్యాలను ఏరుకుంటూ సమీపంలోని సూరత్‌ నగరానికి ఓడలపై వెళ్లి విక్రయించి జీవించడం.. లేదంటే ఆఫ్రికాలో వ్యాపారులకు నగదుకు బదులుగా బంగారాన్ని సర్దుబాటు చేయడం.. ఇలా.. దుబాయి అరబ్బులకు, గుజరాతీలకు ఏర్పడిన సంబంధం కాలక్రమేణా మరింత బలోపేతమైంది. ఆఫ్రికాలో ప్రత్యర్థి తెగల పాలకులకు అధికారికంగా పన్నులు చెల్లిస్తూ.. పాశ్చాత్య దేశాల అనుకూల వ్యాపార సంస్థలకు బదులుగా.. దుబాయి మార్కెట్‌తో అనుసంధానమైన దళారులకు విక్రయిస్తుంటారు. ఫలితంగా.. లండన్‌, స్విట్జర్లాండ్‌ల కంటే మెరుగైన ధరలు పొందడం కూడా స్థానికులకు కలిసి వస్తున్నది. ఆఫ్రికా నుండి దుబాయి మీదుగా స్విట్జర్లాండ్‌, ఇంగ్లండ్‌ దేశాలలోని రిఫైనరీలకు బంగారం రవాణా అయ్యేది. ఇప్పటికీ రవాణా అవుతున్నది కానీ లండన్‌, జ్యూరిక్‌ నగరాలకు బదులుగా తామే నేరుగా బంగారం వర్తకం చేయాలని భావించిన దుబాయి.. ఆ దిశగా ప్రయాణిస్తూ పురోగతి సాధిస్తోంది.

ఆఫ్రికా ఖండం నుండి తీసుకొచ్చే బంగారం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని అమెరికా, ఐరోపా సమాజం కూడా దుబాయిపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. వ్యాపారం చేయడానికి వచ్చే వారికోసం తమ ద్వారాలు ఎప్పటికీ తెరిచే ఉంటాయని, అదే విధానం బంగారం ఎగుమతి, దిగుమతిదారులకు కూడా వర్తిస్తుందని దుబాయి చెబుతోంది. స్విట్జర్లాండ్‌ రిఫైనరీలకు వచ్చే బంగారం ఎక్కడిదని కూడా దుబాయి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గుత్తాధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలివని ఆ దేశం విమర్శిస్తోంది. పారదర్శకత లేని బంగారం లావాదేవీలు మనీ లాండరింగ్‌ లేదా హవాలా విధానానికి ఊతమిస్తాయని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయి. అయితే అసలు నల్లధనం అనేది పుట్టిందే స్విట్జర్లాండ్‌ నుండి అనే విషయాన్ని అరబ్బు వర్తకులు గుర్తు చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌ దేశాలు కూడా ఎప్పుడూ తాము కొనుగోలు చేస్తున్న బంగారం ఏ గనుల నుండి వచ్చిందో బహిర్గతం చేయలేదని, అలాంటప్పుడు తామెందుకు వెల్లడించాలని కూడా ప్రశ్నిస్తున్నాయి అరబ్బు దేశాలు.

ప్రఖ్యాత హిందీ సినిమాల నిర్మాత యశ్‌చోప్రా నిర్మించే సినిమాలలోని ప్రకృతిరమణీయమైన స్విట్జర్లాండ్‌ గురించే మనకు ఎక్కువగా తెలుసు.. ఎక్కడో ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితర ప్రాంతాల నుండి రక్తపు నదులు దాటుకుంటూ బంగారం స్విట్జర్లాండ్‌కు వస్తుందనే విషయం మాత్రం బహుశా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. స్విస్‌లో బంగారం గనులు లేకున్నా విశ్వవ్యాప్తంగా ఏటా ఉత్పత్తి అయ్యే బంగారంలో 50 శాతానికి పైగా ఈ దేశంలోనే శుద్ధి అవుతుంది. ఇక్కడున్న ఐదు బంగారం రిఫైనరీలు ప్రపంచ విపణికి కావాల్సిన బంగారాన్ని అందిస్తున్నాయి. ఇలా.. మెరిసే బంగారం వెనక కోట్లు కొల్లగొట్టే వ్యాపారంతోపాటు కన్నీటికథలు అనేకం.

Untitled-210.jpg

ప్రపంచ స్వర్ణ మండలి (వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌) అంచనా ప్రకారం.. భారత్‌లో సుమారు మూడు లక్షలకు పైగా గుర్తింపు పొందిన బంగారు ఆభరణాల దుకాణాలు ఉన్నాయి.

మన దేశం 90 శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.

భారత్‌లో 40 శాతం గోల్డ్‌ మార్కెట్‌.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలదే!.

సగటు భారతీయ కుటుంబం తన మదుపు మొత్తంలో ఏడు శాతం బంగారానికే ఖర్చు చేస్తుంది.

పసుపురంగును కలిగిన ఏకైక లోహం స్వర్ణం.

స్వచ్ఛమైన బంగారానికి ఎలాంటి వాసన, రుచి ఉండవు.

ప్రపంచంలోని మొత్తం బంగారాన్ని ఐదు మైక్రాన్ల వైరుగా మారిస్తే.. దాంతో భూగోళానికి 1.10 కోట్ల రౌండ్లు చుట్టవచ్చు.

నాగరికత మొదలైనప్పటి నుంచీ నేటి వరకు గనుల్లో నుంచి వెలికితీసిన బంగారం.. 1,87,200 టన్నులు.

బంగారం పరమాణువు సంఖ్య 79.. అంటే ప్రతి అణువులోని కేంద్రకంలో 79 ప్రొటాన్లు ఉంటాయి.

గోల్డ్‌ అనేది ఒక పాత ఆంగ్ల పదం. జ్ఛౌజూఠ, అనే పదం నుండీ వచ్చింది. దానర్థం పసుపువర్ణం.

1064 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద బంగారం కరుగుతుంది.

బంగారం సుతిమెత్తని లోహం. ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఆభరణాలను సులువుగా చేయొచ్చు.

భూమి మీదున్న అన్ని ఖండాల్లో బంగారం దొరుకుతుంది.

అత్యధిక బంగారం నిల్వలున్న దేశం దక్షిణాఫ్రికా.

శుద్ధమైన బంగారాన్ని కారట్స్‌లో కొలుస్తారు. 24 కారట్స్‌లో ఉంటే అది మేలిమి బంగారం.

వేల సంవత్సరాల కిందట మారక ద్రవ్యం బంగారమే!.

తొలిసారిగా రోమన్లు బంగారు నాణేలను, అందమైన వస్తువులను తయారుచేశారు.

అంతరిక్ష వ్యోమగాములు వేసుకునే సూట్‌ తయారీలో కూడా పుత్తడిని వాడతారు.

పురాతన ఈజిప్టువాసులు బంగారాన్ని దేవుని చర్మంగా భావించేవారు. అందుకని దేవాలయాలు, సమాధులపైన బంగారురేకులతో తాపడం పట్టేవారు.

పుత్తడిని సన్నటి దారంగా మార్చి, దుస్తులను తయారుచేయవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు.

విమానాల్లోని ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్‌ సాంకేతిక వ్యవస్థల తయారీకి బంగారాన్ని వాడతారు.

- మొహమ్మద్‌ ఇర్ఫాన్‌

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి.

Updated Date - 2023-07-30T15:59:24+05:30 IST