స్టార్టప్ క్వీన్స్
ABN , First Publish Date - 2023-03-05T10:39:24+05:30 IST
అందరికీ ఆలోచనలు వస్తుంటాయి. కానీ వాటిని సీరియస్‌గా తీసుకుని ఆచరణలో పెట్టేవారు కొందరే ఉంటారు....
అందరికీ ఆలోచనలు వస్తుంటాయి. కానీ వాటిని సీరియస్‌గా తీసుకుని ఆచరణలో పెట్టేవారు కొందరే ఉంటారు. వారు ప్రయాణంలో వచ్చే ఒడుదొడుకులను తట్టుకుని, పరిస్థితులను బట్టి ప్రణాళికలు మార్చుకుంటూ... ఎట్టకేలకు విజయ శిఖరాల వైపు తలెత్తుకుని సాగిపోతారు. తొలుత సామాన్యంగా కనిపించినవారు... నమ్మిన తోవలో తొలి అడుగును సాహసోపేతంగా వేసి, అసామాన్యులుగా అవతరిస్తారు. భిన్నమైన స్టార్టప్‌లు పెట్టి, నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న కొందరు ‘స్టార్టప్ క్వీన్’ల విజయగాథలివి...
పేరు : అదితీ గుప్తా
కంపెనీ : మెన్‌స్ట్రుపీడియా, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్ట్‌నర్
రంగం : ఆరోగ్యం, స్వస్థత
నెట్‌వర్త్ : 1.5 నుంచి 5.5 మిలియన్ డాలర్లు.
పుస్తకాలతో అవగాహన
రుతుస్రావం గురించి అంతటా అవగాహన కలిగించే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ‘మెన్‌స్ట్రుపీడియా’. జార్ఖండ్‌లో పుట్టి పెరిగిన అదితీ గుప్తా పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి తీవ్రంగా ఆలోచించింది. అదితి, ఆమె భర్త తుహిన్ పాల్ ఇద్దరూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (అహ్మదాబాద్) విద్యార్థులు. అక్కడ థీసిస్ ప్రాజెక్టుగా మెన్‌స్ట్రుపీడియాను అదితీ చేపట్టింది. ఓ కామిక్ పుస్తకాన్ని 2012లో తీసుకువచ్చింది. దీనికోసం ఏడాది పాటు డాక్టర్లను, విద్యార్థులను కలిసి సమాచారాన్ని సేకరించింది. అయితే ఈ విషయంలో మహిళలకు మరింత అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో భర్తతో కలిసి స్టార్టప్‌ను ప్రారంభించింది. ప్రీ- టీన్స్, టీనేజర్లకు ప్యూబర్టీ, లైంగికత, పీరియడ్స్ తదితర అంశాలపై రకాల కామిక్ పుస్తకాలు, యానిమేటెడ్ వీడియోలెన్నో ఈ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అవగాహనా వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తారు. కామిక్ పుస్తకాలు 14 భాషలలో లభిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు... దాదాపు 18 దేశాల ప్రజలు వీటిని ఉపయోగించడం విశేషం. పదివేలకు పైగా స్కూళ్లు, ఎన్‌జీఓలు మెన్‌స్ట్రుపీడియా వల్ల లాభపడుతున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. వెబ్‌సైట్ ద్వారా ఎంతోమందికి అవగాహన కల్పించడంతో పాటు అనేక సందేహాలను తీరుస్తున్నారు. ప్రసిద్ధ ‘ఫోర్బ్స్’ ఇండియా యు - 30 లిస్ట్‌లో అదితి పేరు నిలిచిందంటే ఆమె సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
పేరు : గుర్లీన్ కౌర్ టిక్కు
కంపెనీ : హరీపత్తి, ఫౌండర్ అండ్ సీఈఓ
రంగం : ఆర్థిక రంగం
ఆర్థిక సలహాలతో అందలం
‘డ్రీమ్ బిగ్, స్టే పాజిటివ్, వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్ ద జర్నీ..’ అని తన సహచరులకు తరచూ చెబుతుంటారు గుర్లీన్ కౌర్ టిక్కు. అవే తన విజయానికి కారణాలు అనీ పేర్కొంటారు. సంపద వృద్ధి గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది కానీ మార్గాలేవిటో తెలియదు. ఒక్కోసారి విద్యాధికులు కూడా ఈ అంశంలో తప్పటడుగులు వేస్తుంటారు. ఇక్కడే గుర్లీన్ స్థాపించిన ‘హీరాపత్తి’ సహాయపడుతుంది. ఫైనాన్స్, లాంగ్ టర్మ్, షార్ట్‌టర్మ్ మానిటరీ గోల్స్, ఇన్వెస్ట్ట్‌మెంట్ సొల్యూషన్స్ తదితరాల గురించి కస్టమర్లకు సలహాలు ఇవ్వడానికి ఏర్పరచిన సంస్థ ఇది. ఫైనాన్షియల్ ప్లానర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా గుర్లిన్ సర్టిఫికెట్ పొందడం విశేషం. భారతదేశంలోని టావ్ 30 వుమెన్ ఎంట్రప్రెన్యూర్లలో ఒకరుగా గుర్లీన్ కౌర్ వార్తల్లోకి ఎక్కడం విశేషం.