Auto Driver: బాబోయ్.. ట్రాఫిక్ జామ్‌ నుంచి తప్పించుకునేందుకు మరీ ఇంత రిస్కా..? ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-04T17:45:13+05:30 IST

ట్రాఫిక్ జాం నుంచి బయటపడేందుకు ఓ డ్రైవర్ తన ఆటోను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై నుంచి తోలడం సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా బాట పట్టడంతో పోలీసులు ఆటో డ్రైవర్‌ను, అతడికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేశారు.

Auto Driver: బాబోయ్.. ట్రాఫిక్ జామ్‌ నుంచి తప్పించుకునేందుకు మరీ ఇంత రిస్కా..? ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడో చూస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ జాం అంటే ఎవరికైనా చిరాకే! కానీ, అలాంటి సందర్భాల్లో మన ఇష్టారీతిన వ్యవహరించకూడదు. మనలాంటి చాలా మంది అదే ట్రాఫిక్ ఝంఝాటంలో ఇరుక్కున్నారన్న విషయాన్ని గుర్తెరిగి జాగ్రత్తగా మసులు కోవాలి. కానీ ఢిల్లీలో ఓ ఆటో డ్రైవర్ పూర్తి విరుద్ధంగా చేశాడు. చివరకు జైలు పాలయ్యాడు. అతడు చేసిన పని బహుశా మనదేశంలో ముందెన్నడూ జరగలేదేమో. అందుకే ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ నోరెళ్ల బెట్టడమే కాకుండా ఆటో డ్రైవర్‌ను తిట్టిపోస్తున్నారు కూడా.

ఇంతకీ జరిగిందేంటంటే.. దక్షిణ ఢిల్లీలోని(South Delhi) సంగమ్ విహార ట్రాఫిక్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ జాం అవడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి(Traffic jam). అందులోంచి ఎప్పుడు బయటపడతామో తెలీక అందరూ నెత్తిబాదుకుంటున్నారు. కానీ మున్నా(25) అనే ఆటోడ్రైవర్‌కు సహనం పూర్తిగా నశించింది. దీంతో, అతడు ఇతరుల గురించి అసలేమాత్రం ఆలోచించకుండా అత్యంత ప్రమాదకరమైన చర్యకు దిగాడు.


అతడున్న చోటే ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉండటంతో అతడు మరో ఆలోచన లేకుండా తన ఆటోను బ్రిడ్జ్‌పైకి పోనిచ్చేశాడు. తొలుత అతడు తన స్నేహితుడు అమిత్‌తో కలిసి ఆటోను రెండు మూడు మెట్లు ఎక్కించాడు. ఆ తరువాత దాని స్పీడు పెంచడంతో అది స్పీడుగా పైకెళ్లిపోయింది(Youth drives auto on foot over bridge). పక్కనే ఉన్న ఇతర పాదచారులు ఇదంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో మున్నా పోలీసులకు చిక్కాడు.

సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా మున్నాను, అతడి స్నేహితుడు అమిత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ఆటోను కూడా సీజ్ చేశారు. నిందితులపై డీపీ యాక్ట్ సెక్షన్ 66 కింద ఆటోను జప్తు చేసినట్టు దక్షిణ ఢిల్లీ డీసీపీ మీడియాకు తెలిపారు. నెట్టింట్లో ఈ ఘటన తాలూకు వీడియో చూసిన వారందరూ మున్నా, అతడి స్నేహితుడిని తిట్టిపోస్తున్నారు.

Updated Date - 2023-09-04T17:45:16+05:30 IST