మరీ ఇంత దారుణమా.. అక్కడ 40 ఏళ్ళ వయసుకే జనాలంతా ముసలివాళ్ళుగా ఎందుకు కనిపిస్తున్నారంటే..!

ABN , First Publish Date - 2023-01-04T12:52:58+05:30 IST

15సంవత్సరాలు దాటితే చాలు వయసు పెరిగిపోతున్నట్టు శరీరంలో మార్పులు జరిగిపోతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితిని అనుభవిస్తున్నది స్వయానా మన దేశం ప్రజలే..

మరీ ఇంత దారుణమా.. అక్కడ 40 ఏళ్ళ వయసుకే జనాలంతా ముసలివాళ్ళుగా ఎందుకు కనిపిస్తున్నారంటే..!

కేవలం 40ఏళ్ళకే ముసలివాళ్ళుగా మారిపోతున్నారు. ఎముకలు కరిగిపోయి, శరీరం బలహీనం అయిపోయి, ముసలివాళ్ళలాగా వంగిపోతున్నారు. 15సంవత్సరాలు దాటితే చాలు వయసు పెరిగిపోతున్నట్టు శరీరంలో మార్పులు జరిగిపోతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితిని అనుభవిస్తున్నది స్వయానా మన దేశం ప్రజలే.. ఇదంతా ఎక్కడ జరుగుతోంది ఎందుకు జరుగుతోందనే విషయంలోకి వెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి అనే జిల్లా ఉంది. ఇక్కడ ప్రజలు 40సంవత్సరాలకే ముసలివాళ్ళు అయిపోతున్నారు. సాధారణంగా రాజధాని నగర ప్రాంతాలలో కాలుష్యం చాలా ఎక్కువ ఉంటుందని అందరూ వాపోతుంటారు. ఈ కాలుష్యం వల్ల చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నామని, ఆరోగ్యం దెబ్బతింటుందని అంటుంటారు. కానీ సింగ్రౌలి ప్రజలు మాత్రం ఈ కాలుష్యం వల్ల నరకం అనుభవిస్తున్నారు.

ఎక్కడిది ఇంత కాలుష్యం..

సింగ్రౌలి ప్రాంతంలో 11 ధర్మల్ పవర్ ప్లాంట్లు, 16 బొగ్గు గనులు, 10 కెమికల్ ఫ్యాక్టరీలు, 8పేలుడు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, 309 క్రషర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా సిమెంట్, ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయి. 10ధర్మల్ పవర్ ప్లాంట్ల నుండి ప్రతి రోజూ 21వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. దీనికోసం సంవత్సరానికి 103మిలియన్ టన్నుల బొగ్గు వినియోగిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మిలియన్ టన్నుల కొద్ది ఎర్రమట్టి, ఇతర రసాయనాలు వినియోగించబడుతున్నాయి.

పైన చెప్పుకున్న వినియోగాల తరువాత వాటి నుండి వెలువడే వ్యర్థపదార్థాలన్నీ సింగ్రౌలీ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నాయి. వీటికి తోడు పదార్థాల రవాణా కోసం ప్రతిరోజూ వేలకొద్ది వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఇక్కడ కాలుష్యం ప్రమాదకర స్థాయికి మారింది. ఇక్కడ గాలి నాణ్యత 900 నుండి 1200 మధ్య ఉంటోంది. ఇది 20 నుండి 25రెట్లు అధిక కాలుష్యాన్ని సూచిస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల భూమి సారవంతం తగ్గిపోయి వాటి ప్రభావం భూగర్భజలాల వరకు వెళ్ళింది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా బూడిద దర్శనమిస్తోంది. చిన్నపాటి గాలికి కూడా ఈ బూడిద పైకి లేచి కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తోంది. ఈ గాలి పీల్చుకోవడం వల్ల అక్కడి ప్రాంత ప్రజలకు టి.బి వంటి ప్రమాదకర శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల ఎముకలు ప్రభావానికి గురవుతున్నాయి. నీరు కూడా విషపూరితమైపోవడం వల్ల నీటిలో చేపలు కూడా విషంగానే మారాయి. పీల్చేగాలి, తీసుకునే ఆహారం, తాగే నీరు ఇలా అన్నింటి నుండి ప్రమాదకర స్థాయిలో శరీరాల్లోకి పాదరసం చేరడం వల్ల శరీరంలో ఎముకలు కరిగిపోయి 40 సంవత్సరాలకే శరీరం వంగిపోయి ముసలివాళ్ళు అయిపోతున్నారు.

వీరి పరిస్థితి విన్న వారు ఇలాంటి దుర్భర జీవితం ఎవరికీ రాకూడదని అక్కడి ప్రజల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-04T12:53:01+05:30 IST