Seethapaharanam: కథను మలుపుతిప్పే ఘట్టం సీతాపహరణమే..!

ABN , First Publish Date - 2023-01-17T15:32:17+05:30 IST

సీతారాముల అరణ్యవాసంలో ప్రముఖంగా చెప్పుకునే సంఘటన 'సీతాపహరణం' ఇది రామాయణాన్ని మలుపు తిప్పిన ఘటన.

Seethapaharanam: కథను మలుపుతిప్పే ఘట్టం సీతాపహరణమే..!
Seethapaharanam

రామాయణం భారతీయుల జీవన విధానంలో అంతర్భాగమైన మహా కావ్యం. రామాయణాన్ని చదవని వారు, ఆ కథ తెలియనివారు బహుశా తెలుగునేలపై ఉండి ఉండరు. మన సంస్కృతిలో జీర్ణించుకుపోయిన ఈ కథలో ఎన్నో పాత్రలు, ఎన్నో ఘట్టాలు, మరెన్నో జీవిత సత్యాలు. సీతారాముల అరణ్యవాసంలో ప్రముఖంగా చెప్పుకునే సంఘటన 'సీతాపహరణం' ఇది రామాయణాన్ని మలుపు తిప్పిన ఘటన. అసలు సీతాపహరణం ఘట్టమే లేకపోతే రామయణానికి అర్థమే లేదేమో. రావణుడనే రాక్షసరాజు పాత్రనే మనకు తెలియదేమో.. అంతేనా ఆంజనేయుని రాక కూడా సీతాపహరణం తరువాతనే కదా.. ఇలా ఈ ఒక్క ఘటన కథను మలుపుతిప్పి మరిన్ని పాత్రలను, విశేషాలను తెలుపుతూ మొత్తం రామాయణాన్నే రక్తికట్టించింది. రామాయణంలోని చాలా ముఖ్యమైన ఘట్టం యుద్ధంలో రావణుడి సంహారం తరువాత అగ్నిపరీక్షతో సీతను అయోధ్యకు తీసువెళ్ళాడు రాముడు.

ఈ కథను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమూ లేదు. కానీ విజయ్ శేఖర్ ఉపాధ్యాయులు రాసిన ఆధునిక 'సీతాపహరణం' నవల గురించి మాత్రం నాలుగు మాటలు చెప్పి తీరాలి. ఈ పుస్తకాన్ని తెరవగానే రచయిత మాటలు చదివాకనే కథలోకి వెళతాం. రచయిత ఇది ఖచ్చితంగా కల్పిత కథే అంటాడు. కానీ కథను చదువుతున్న పాఠకుని ఊహకు మాత్రం, ఎంత ఖచ్చితంగా ఇది కల్పితమన్నా కూడా రామాయణంలోని సీతాపహరణ ఘట్టమే గుర్తుకువస్తుంది.

సీత ఒక ప్రత్యేకమైన స్త్రీ ఆమె అందం, అణకువ, మంచితనం కలగలిసిన స్త్రీమూర్తి. అదే సీత, అపహరణకు గురైతే రాముడు తల్లడిల్లిపోయినట్టుగా ఈ సీతకూ ఒక రాముడున్నాడు. రాముడి సుగుణాలను పుణికిపుచ్చుకున్న ఈ పాత్ర నందన్.. రాముడు సీత జాడ కోసం వెతుకుతూ లంకలో ఉందని తెలుసుకుని రావణుడిపై యుద్ధానికి సన్నద్ధమవుతాడు. మరి ఈ రాముడు ఏం చేస్తాడు? ఆసక్తిగా కథను చెప్పేతీరు, మలిచిన విధానం అంతా మనకు మళ్ళీ రామాయణాన్ని తిప్పి చెపుతున్నట్టుగా అనిపిస్తుంది.

అసలు ఈ కథలోని సీతకు ఏమైంది. ఏం కష్టం వచ్చింది. అసలు సీతను ఎత్తుకెళ్ళిన వారెవరూ? చివరికి సీత, నందన్ ను చేరుకుందా? ఇదంతా తెలియాలంటే విజయ్ శేఖర్ ఉపాధ్యాయులు రాసిన సీతాపహరణం నవల చదవాల్సిందే..సాహిత్య రంగంలోకి ఒక్కో అడుగు ఆచితూచి వేస్తూ..తన ఉనికిని చక్కటి రచనలతో తెలుపుతున్న విజయ్ శేఖర్ ఉపాధ్యాయుల 'మరణంతో నా అనుభవాలు' ఫిలాసఫిక్ నవల కూడా అంతే పేరు తెచ్చుకుంది. భక్తితో చదివి తరించిపోయే ఆ రామాయణంలోని సీతారహరణానికి, థ్రిల్లర్ గా మలిచిన ఈ సీతాపహరణానికి పొంతన లేకపోయినా, ఆసక్తిగా సాగే కథా కథనం పాఠకులను చదివిస్తుంది.

సీతాపహరణం

రచన: విజయ్ శేఖర్ ఉపాధ్యాయుల

పేజీలు: 203

వెల: 225

ప్రతులకు: 040-24652387, 9705972222

-శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2023-01-17T16:30:24+05:30 IST