China, Japan దేశాల్లో షాకింగ్ పరిణామం.. పెళ్లికి ఓకే కానీ పిల్లల్ని మాత్రం కనరట.. కారణమేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-02-04T18:27:03+05:30 IST

పెళ్లికి ఓకే అంటున్నా పిల్లలు వద్దనుకుంటున్న యువ జంటలు. చైనా, జపాన్ ప్రభుత్వాల్లో కలకలం.

China, Japan దేశాల్లో షాకింగ్ పరిణామం.. పెళ్లికి ఓకే కానీ పిల్లల్ని మాత్రం కనరట.. కారణమేంటో తెలిస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: దేశాభివృద్ధికి సహజవనరులు ఎంత కీలకమో మానవ వనరులు కూడా అంతే ముఖ్యం. దేశ ఆర్థికవ్యవస్థకు సరిపడా జనాభా లేకపోతే గడ్డు పరిస్థితులు తప్పవు. భవిష్యత్తులో తమ దేశాల్లో జనాభా తగ్గుతుందన్న భయంతో చైనా(China), జపాన్‌లు(Japan) వణికిపోతున్నాయి. జనాభా పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన చైనాలోనూ ఈ ఆందోళన నెలకొందంటే పరిస్థితి తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో.. ఆ దేశాల్లో ఏం జరుగుతోందో తెలుసుకుందాం పదండి..

ప్రస్తుతం చైనా, జపాన్‌లో పిల్లల్ని కనాలంటేనే యువ జంటలు జంకుతున్నాయి. పెళ్లికి ఓకే కానీ.. పిల్లలంటే మాత్రం నిర్మొహమాటంగా కొత్త దంపతులు నో చెప్పేస్తున్నారు. పిల్లల ఖర్చులు తాము భరించలేమని తెగేసి చెబుతున్నారు. అమ్మా..నాన్న అని పిలిపించుకునేందుకు అంత ఖర్చు భరించలేమని అనేక జంటు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో పిల్లల్ని పెంచి పెద్ద చేసేందుకు అయ్యే ఖర్చు అక్కడి తలసరి జీడీపీతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ. జపాన్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. నానాటికీ పెరుగుతున్న ఖర్చులు భరించలేక యువ జంటలు సంతానాన్ని కనేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఇంటి పని, ఆఫీసు పనుల్లో నవదంపతులు క్షణం తీరిక లేకుండా గడపడం కూడా ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. జపాన్‌లో జీవన వ్యయాలు ఇండియా కంటే 182 శాతం అధికం. చైనా జీవన వ్యయాలు భారత్‌తో పోలిస్తే 104 శాతం ఎక్కువ. దీంతో..జంటలు పిల్లలకు నో చెబుతున్నాయి. ఫలితంగా.. రెండు దేశాల్లోనూ జననాల రేటు(Declining birth rate) పడిపోతోంది. ఈ క్రమంలో ఇరు దేశాలు యువజంటలను సంతానం దిశగా ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాయి. అయితే.. ద్రవ్యోల్బణం దెబ్బకు ప్రభుత్వ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రభుత్వ వర్గాల్లో ఒత్తిడి కనిపిస్తోంది.

Updated Date - 2023-02-04T18:27:04+05:30 IST