Rashmika Mandanna: ‘ఆ రోజు కచ్చితంగా చీటింగ్ చేస్తా.. ఎవరి మాట వినను’

ABN , First Publish Date - 2023-01-29T10:39:08+05:30 IST

‘ఛలో’ సమయంలో ఎంత గ్లామర్‌గా ఉందో... ఇప్పుడూ అలానే ఉంది. గ్లామర్‌ని కాపాడుకోవడం, కొత్తగా కనిపించడం..

Rashmika Mandanna: ‘ఆ రోజు కచ్చితంగా చీటింగ్ చేస్తా.. ఎవరి మాట వినను’
Rashmika Mandanna

‘ఛలో’ సమయంలో ఎంత గ్లామర్‌గా ఉందో... ఇప్పుడూ అలానే ఉంది. గ్లామర్‌ని కాపాడుకోవడం, కొత్తగా కనిపించడం.. రష్మిక మందన్నా (Rashmika Mandanna) విజయ రహస్యాలు. అయితే ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఫిట్‌నెస్‌, ఆహార నియమాలు, కాస్ట్యూమ్స్‌.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆమె శ్రద్ధ పెట్టింది. అందుకే సినిమా సినిమాకు మరింత గ్లామర్‌ కురిపిస్తోంది. తన గ్లామర్‌ సీక్రెట్స్‌ గురించి రష్మిక ఏమంటోందంటే..

వర్కవుట్‌ (Workout) తప్పనిసరి..

‘‘కథానాయికగా అడుగుపెట్టే సమయానికి నిజంగానే నాకు ఫిట్‌నెస్‌పై పెద్దగా శ్రద్ధ లేదు. గ్లామర్‌ని ఎలా కాపాడుకోవాలి? ఫిట్‌గా ఎలా ఉండాలి? అనే విషయాలపై నాకున్న అవగాహన అంతంతమాత్రమే. కాకపోతే నటిగా ఎదగాలంటే కచ్చితంగా ఈ విషయాలపై దృష్టి పెట్టాలని తెలుసు. అందుకే ‘ఛలో’ హిట్‌ అవ్వగానే ఫిజికల్‌ ట్రైనర్‌ని నియమించుకొన్నా. తన సలహాలూ సూచనలతోనే నా ఫిట్‌నెస్‌ని కాపాడుకొంటున్నా. పొద్దున లేవగానే లీటర్‌ నీళ్లు తాగడం అలవాటు చేసుకొన్నా. ఆ తరవాతే నా దినచర్య మొదలవుతుంది. రోజూ కనీసం 2 గంటలు వర్కవుట్‌ చేస్తా. వాకింగ్‌, జాగింగ్‌, స్కిప్పింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌... వాటిలో ఉంటాయి. పవర్‌ యోగా తప్పనిసరి.’’

Rashmika3.jpg

వెయిట్‌లిఫ్టింగ్‌ కూడా..

‘‘అమ్మాయిలు అన్ని రకాల వ్యాయామాలు (Exercise) చేయొచ్చు గానీ, వెయిట్‌ లిఫ్టింగ్‌కి దూరంగా ఉండాలి అని కొంతమంది చెబుతుంటారు. అదెందుకో అర్థం కాదు. నేను మాత్రం ఆ సలహాని పెడచెవిన పెట్టా. వెయిట్‌ లిఫ్టింగ్‌ని సైతం నా వ్యాయామంలో భాగం చేశా. ఎప్పుడూ ఒకే రకమైన వ్యాయామం చేయకూడదు. ఇదివరకు బ్యాడ్మింటన్‌ బాగా ఆడేదాన్ని. ఇప్పుడు అంత సమయం ఉండడం లేదు. ఈమధ్యనే వాలీబాల్‌ కూడా నేర్చుకొన్నా. వారానికి ఒకసారి స్విమ్మింగ్‌ మస్ట్‌.’’

షూటింగులుంటే..

‘‘ప్రతీ విషయంలోనూ క్రమశిక్షణతోనే ఉంటా. కాకపోతే త్వరగా నిద్రపోవడం, వేకువజామున లేవడం... ఇవి రెండూ అలవాటు కాలేదు. ఈ విషయంలోనే నేను మారాలి. షూటింగ్‌ ఉంటే ఎలాగూ పొద్దున్నే లేస్తా. ఏడింటికల్లా సెట్లో ఉంటా. తిరిగొచ్చాకే నా కసరత్తులు. షూటింగ్‌ లేకపోతే మాత్రం లేటుగా నిద్రలేస్తా. పార్టీలకు వెళ్లే అలవాటు లేకపోయినా రాత్రి నిద్రపోవడం ఆలస్యం అవుతుంటుంది. ఇదంతా ఓటీటీల పుణ్యమే. నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా సిరీస్‌ మొదలెడితే అది పూర్తయ్యేంత వరకూ నిద్ర రాదు.’’

Rashmika1.jpg

అవంటే అలర్జీ!

‘‘నేను ఎగ్‌టేరియన్‌ని. నా డైట్‌లో కాయగూరలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రైస్‌ తక్కువగా తీసుకొంటా. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్‌ తప్పనిసరి. దోశలంటే చాలా ఇష్టం. మధ్యాహ్న భోజనం వేడి వేడి రసంతో లాగించడం బాగుంటుంది. సౌత్‌ ఇండియన్‌ థాలీకి ప్రాధాన్యం ఇస్తాను. రాత్రి డిన్నర్‌ చాలా లైట్‌గా ఉంటుంది. ఒక్కోసారి ఏమీ తినకుండానే నిద్రపోతా. స్వీట్‌ పొటాటో, క్యాప్సికమ్‌, టొమాటో అంటే అలర్జీ. అవి నా ప్లేట్‌లో కనిపించవు.’’

చీటింగ్‌ డే (Cheating Day)..

‘‘వారంలో ఒక్కరోజైనా చీటింగ్‌ డే ఉంటుంది. ఆరోజున స్వీట్స్‌ బాగా లాగిస్తా. హైదరాబాద్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. ప్రతీ రెస్టారెంట్‌లోనూ ఓ స్పెషల్‌ డిష్‌ ఉంటుంది. దాన్ని ట్రై చేయడానికి ఇష్టపడతా. ఎవరూ గుర్తు పట్టకుండా హ్యాటూ, మాస్కూ పెట్టుకొని రెస్టారెంట్లలో ఇష్టమైనవన్నీ తినడం బాగుంటుంది. నా స్నేహితులంతా భోజన ప్రియులే. వాళ్లతో కూర్చున్నానంటే డైటింగ్‌ మాటే మర్చిపోతాను.’’

Rashmika2.jpg

అందానికి నిర్వచనం..

‘‘అందానికి నిర్వచనం అంటూ ఏమీ లేదు. అద్దంలో చూసుకొన్నప్పుడు ‘ఫిట్‌గా ఉన్నాం’ అనే ఫీలింగ్‌ వస్తే చాలు. కొంతమంది బబ్లీగా ఉంటేనే బాగుంటారు. వాళ్లు ఎవరి కోసమో శరీరాకృతి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆరు నెలలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి... ఆ మార్పు మీకే తెలుస్తుంది.’’

Updated Date - 2023-01-29T10:56:49+05:30 IST