IT Layoffs: వామ్మో.. ఇంత మంది జాబ్ కోల్పోయారా..!

ABN , First Publish Date - 2023-02-10T17:30:36+05:30 IST

ఈ ఏడాది ఇప్పటివరకూ టెక్ కంపెనీలు ఎంత మందిని తొలగించాయంటే..

IT Layoffs: వామ్మో.. ఇంత మంది జాబ్ కోల్పోయారా..!

ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది నెలలుగా ప్రముఖ టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి(Layoffs). ఆర్థికమాంద్యం పొంచి ఉందంటూ ఖర్చుల తగ్గింపు పేరిట ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. తొలగింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ గడ్డు పరిస్థితులకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారనే వివరాలను layoffs.fyi వెబ్‌సైట్ తాజాగా ప్రకటించింది. 2023లో ఇప్పటివరకూ మొత్తం 332 కంపెనీలు 1,00,746 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయని పేర్కొంది.

ఈ ఏడాది గూగుల్(Google), మైక్రోసాఫ్ట్(Microsoft), సేల్స్‌ఫోర్స్(Salesforce), అమెజాన్(Amazon) లాంటి బడా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అందరికంటే గూగుల్ అత్యధికంగా 12 వేల మందికి పింక్ స్లిప్స్(మొత్తం సిబ్బందిలో ఆరు శాతం) ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని తీసేయగా.. అమెజాన్ 8 వేల మందికి ఇంటి దారి చూపించింది. సేల్స్‌ఫోర్స్‌లో సుమారు 8 వేల మంది, డెల్‌లో 6650 మంది, ఐబీఎమ్‌లో 3900 మంది, జూమ్‌ 1300 మంది, కాయిన్ బేస్ 950 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఉద్యోగులకు ఇంటి దారి చూపిస్తున్న సంస్థల్లో తాజాగా యాహూ వచ్చి చేరింది. మొత్తం సిబ్బందిలో 20 శాతం మందిని అంటే సుమారు 1600 మందిని తొలగించబోతున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ తొలిగింపులతో తమ ప్రచార విభాగంలోని ఉద్యోగులపై అధికంగా ప్రభావితం పడిందని చెప్పింది. అంతేకాకుండా.. ఈ వారాంతానికల్ల 1000 మందిని తొలగించబోతున్నట్టు సంస్థ ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించింది.

లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ సంస్థలు:

మైక్రోసాఫ్ట్ — 10,000 employees ( మొత్తం సిబ్బందిలో 5%)

అమెజాన్ — 8,000 ( మొత్తం సిబ్బందిలో 3% )

సేల్స్ ఫోర్స్ — 8,000 ( మొత్తం సిబ్బందిలో 10% )

డెల్ — 6,650 ( మొత్తం సిబ్బందిలో 5% )

ఐబీఎమ్ — 3,900 (మొత్తం సిబ్బందిలో 2%)

ఎస్ఏపీ — 3,000 (మొత్తం సిబ్బందిలో 3% )

జూమ్ — 1,300 (మొత్తం సిబ్బందిలో 15% )

కాయిన్ బేస్ — 950 (మొత్తం సిబ్బందిలో 20% )

యాహూ — 1,600 (మొత్తం సిబ్బందిలో 20%)

గిట్‌హబ్ — 300 (మొత్తం సిబ్బందిలో 10%)

Updated Date - 2023-02-10T17:34:34+05:30 IST