Viral Video: పొట్ట కూటి కోసం 95 ఏళ్ల వృద్ధుడి జీవన పోరాటం.. అతడి అడ్రస్ కనుక్కుని మరీ ఇద్దరు కుర్రాళ్లు ఏం చేశారంటే..!

ABN , First Publish Date - 2023-06-02T17:54:38+05:30 IST

95 ఏళ్ల వయసులోనూ పట్టెడన్నం కోసం పోరాటం కొనసాగిస్తున్న ఓ వృద్ధుడిని ఆదుకునేందుకు నెటిజన్లు ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: పొట్ట కూటి కోసం 95 ఏళ్ల వృద్ధుడి జీవన పోరాటం.. అతడి అడ్రస్ కనుక్కుని మరీ ఇద్దరు కుర్రాళ్లు ఏం చేశారంటే..!

ఇంటర్నెట్ డెస్క్: బోసి నోరు.. ఎముకల పోగుగా మారిన దేహం..పట్టిపీడిస్తున్న వృద్ధాప్యం..ఒంట్లో కొంచెమైనా ఓపిక లేని పరిస్థితి! 95 ఏళ్ల వయసులోనూ ఆ పెద్దాయనకు జీవనపోరాటం తప్పలేదు. పట్టెడన్నం పెట్టేవాళ్లు లేరో ఏమో కానీ ఆయన బతుకుపోరును యథావిధిగా కొనసాగిస్తున్నాడు. పెళ్లిళ్లు జరుగుతున్న ఇళ్ల వద్ద నిలబడి తన మెడలో వేలాడేసుకున్న డోలు వాయిస్తూ భిక్షాటన చేస్తుంటాడు. వారి సంతోషంలో తానూ భాగమవుతాడు. ప్రతిఫలంగా రూపాయో రెండో ఆశిస్తాడు. మనసున్న మారాజులు ఇస్తున్నారు. మిగతా వారు తమ దారిన తాము వెళ్లిపోతున్నారు. అయినా ఆ వృద్ధుడు నిరాసపడలేదు. కాసేపు నేలపై కూర్చుని సేద తీరాక మళ్లీ డోలు వాయిస్తూ కూటి కోసం పోరాటం కొనసాగించాడు.

కష్టాల్లో ఉన్నవాళ్లకు దేవుడు ఏదో రూపంలో అండగా నిలుస్తాడని అంటారు. ఈ వృద్ధుడి విషయంలోనూ అదే జరిగింది. పెద్దాయన పరిస్థితిని దగ్గరుండి చూసిన ఇద్దరు యువకుల మనసంతా వేదనతో నిండిపోయింది. దీంతో, వారు ఆయనకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తొలుత పెద్దాయన పరిస్థితిని వీడియో తీసి నెట్టింట్లో షేర్(Viral Video) చేశారు. ఆయనను ఆదుకునేందుకు ముందుకు రమ్మని నెటిజన్లను అభ్యర్థించారు. మరోవైపు.. తమ వంతు బాధ్యత నిర్వహించేందుకు వారూ రంగంలోకి దిగారు. పెద్దాయన ఇంటి అడ్రస్ కనుక్కుని మరీ వెళ్లి ఆయనకు నెలకు సరిపడా పచారీ సామాన్లు కొనిచ్చారు(Netizens help elderly person).

ఇక పెద్దాయన పరిస్థితి చూసి చలించిపోయిన నెటిజన్లు ఆయనను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. అనేక మంది డిజిటల్ మాధ్యమాల ద్వారా వృద్దుడికి సాయం చేశారు. తాను ఒంటరిని అనుకున్న వృద్ధుడికి సోషల్ మీడియా మహిమతో జగమంత కుటుంబం ఏర్పడింది. అన్ని వైపుల నుంచి సాయం వచ్చి పడుతుండటంతో పెద్దాయన కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. నెట్టింట వైరల్ అవుతున్న వృద్ధుడి వీడియో చూసి అనేక మంది కామెంట్లు చేశారు. పెద్దాయన పోరాటం ఎందరికో గుణపాఠమని కొందరు కామెంట్ చేశారు. ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకూ పోరాటం కొనసాగించాలని, జీవితమంటే అంటే ఇదేనని ఎమోషనల్ పోస్టులు పెట్టారు.

Updated Date - 2023-06-02T17:54:41+05:30 IST