Share News

Bengaluru: ‘వారానికి 70 గంటల పని’ తరువాత ఇన్ఫీ నారాయణ మూర్తి మరో సూచన! రోజుకు..

ABN , First Publish Date - 2023-11-30T16:49:42+05:30 IST

త్వరితగతిన మౌలిక వసతుల కల్పన కోసం నిర్మాణం రంగంలోని కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయాలని ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

Bengaluru: ‘వారానికి 70 గంటల పని’ తరువాత ఇన్ఫీ నారాయణ మూర్తి మరో సూచన! రోజుకు..

ఇంటర్నెట్ డెస్క్: మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరిత గతిన పూర్తి చేయాలని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి(Narayana Murthy) సూచించారు. అంతేకాకుండా, ఈ రంగంలోని సిబ్బంది మూడు షిఫ్టులు (Three shifts for infrastructure sector) పనిచేయాలని అభిప్రాయపడ్డారు. బుధవారం బెంగళూరు టెక్ సమ్మిట్‌‌లో(Bengaluru Tech Summit) జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో చర్చ సందర్భంగా నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు నగరం వేగంగా అభివృద్ధి చెందేందుకు స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం కూడా అవసరమని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నైపుణ్యాలున్న మానవ వనరుల అభివృద్ధి కోసం ఇంగ్లిష్ మీడియం దోహద పడుతుందన్నారు. బెంగళూరు మెట్రోల్లాంటి ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరిత గతిన పూర్తి చేయాలని, మౌలిక వసతుల రంగంలో మూడు షిఫ్టుల అవసరం ఉందని పేర్కొన్నారు.


‘‘ఇఫ్రాస్ట్రక్చర్ రంగంలోని వారు మూడు షిఫ్టుల్లో పనిచేయాలి. మిగితా దేశాల్లోని వారు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. నేను రాత్రివేళ తిరిగొస్తున్న సమయంలోనూ సిబ్బంది పనిచేయడం చూశాను. మూడు షిప్టుల సంగతి అటుంచితే.. అక్కడ రెండు షిఫ్టులు ఉన్నాయని మాత్రం చెప్పగలను. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ముందుండాలని మనం కోరుకుంటున్నాం. అయితే, వివిధ షిష్టుల్లో పనిచేసే సిబ్బంది అవసరాలు ఏంటి, వారు కోరుకునేది ఏంటో అడిగి తెలుసుకోవాలి. అవి ఏర్పాటు చేయాలి. ఇది చేస్తే ఇండియా చైనా కంటే వేగంగా అభివృద్ధి సాధిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

భారత్ వేగంగా అభివృద్ధి చెందేందుకు యువత వారానికి 70 గంటలు పనిచేయాలని టెక్ దిగ్గజం నారాయణ మూర్తి ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రస్తావన తేగా మరికొందరు శ్రమలోనే అభివృద్ధి దాగుందని తేల్చి చెప్పారు.

Updated Date - 2023-11-30T16:57:14+05:30 IST