Share News

Viral: మా అమ్మతో నాన్న 20 ఏళ్ల నుంచీ మాట్లాడట్లేదంటూ కొడుకు ఫిర్యాదు.. అసలేం జరిగిందోనని ఆరా తీస్తే..

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:40 PM

ఓ జపాన్ వ్యక్తి తన భార్యతో 20 ఏళ్ల పాటు మాట్లాడని ఉదంతం నెట్టింట నిత్యం చర్చనీయాంశంగా మారుతుంటుంది.

Viral: మా అమ్మతో నాన్న 20 ఏళ్ల నుంచీ మాట్లాడట్లేదంటూ కొడుకు ఫిర్యాదు.. అసలేం జరిగిందోనని ఆరా తీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఆ కుర్రాడు తన తల్లిదండ్రులను గమనిస్తున్నాడు. కానీ తండ్రి ఒక్క రోజూ కుడా తల్లితో మాట కలిపింది లేదు. ఏమి అడిగినా తలూపడం మినహా ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఊహ తెలిసే కొద్దీ ఆ కుమారుడిలో టెన్షన్ పెరిగి చివరకు సమస్యను పరిష్కరించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగాడు. తల్లిదండ్రుల గురించి ఓ టీవీ ఛానల్ వాళ్లకు సమాచారం ఇచ్చాడు. సమస్య పరిష్కరించమని కోరాడు. అలా 2016లో వెలుగులోకి వచ్చిందీ ఉదంతం.

జపాన్‌కు చెందిన ఓటూ కటాయామాకు చాలా ఏళ్ల క్రితమే యూమీ అనే మహిళతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక యూమీ దృష్టి పిల్లలపైకి మళ్లింది. ఇది కటాయామాలో భార్యపై అసంతృప్తికి దారి తీసింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చడంతో అతడు భార్యతో మాట్లాడమే మానేశాడు. ఇలా ఇద్దరి మధ్యా మాటలు లేకపోయినా వారు మరోసారి తల్లిదండ్రులయ్యారు. భర్త మనసులో ఏముందో తెలుసుకునేందుకు యూమీ ప్రయత్నించినా అతడు కసురుకుంటూ ఆమెను దూరం పెట్టేవాడు. అలా ఏకంగా రెండు దశబ్దాలు గడిచిపోయాయి (Japan man doesnt talk to his wife for 20 years). ఈలోపు పిల్లలు పెద్దవాళ్ల కావడంతో తల్లిదండ్రుల మధ్య సఖ్యత లోపించిందన్న విషయం వారికి అర్థమైంది. దీంతో, వారి కుమారుడు విషయాన్ని స్థానిక మీడియా దృష్టికి తీసుకెళ్లాడు.

2.jpg


రంగంలోకి దిగిన టీవీ ఛానల్ వాళ్లు కటయామాను మెల్లగా ప్రశ్నించడంతో అతడు 20 ఏళ్లుగా మనసులో దాచుకున్నదంతా చెప్పేశాడు. అతడి పక్కనే కూర్చుని ఇదంతా విన్న యూమీ మెల్లగా భర్తతో మాటకలిపింది. అతడి అభిరుచులను తొలిసారిగా అడగి తెలుసుకుంది. భార్యతో ఇన్నేళ్ల తరువాత మాట్లాడాక కటయామాకు తప్పు తెలిసొచ్చింది. దీంతో, తన తప్పు చేశానంటూ విచారం వ్యక్తం చేశాడు. అయితే, భర్త నుంచి నిరాదరణ ఎదుర్కొంటున్న యూమీకి విడాకులు తీసుకోవాలన్న ఆలోచన రాకపోవడం అప్పట్లో అనేక మందిని ఆశ్చర్యపరించింది. కాగా, ఘటన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నెట్టింట ఏదోమూల ఈ దంపతుల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు సరైనా ఉదాహరణ ఈ దంపతులే అంటూ పలువురు కామెంట్ చేస్తుంటారు.

Updated Date - Dec 17 , 2023 | 09:44 PM