Japan Tokyo: టోక్యో నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోమంటున్న జపాన్ ప్రభుత్వం !.. కారణం ఇదే

ABN , First Publish Date - 2023-01-05T17:34:31+05:30 IST

మెరుగైన ఉపాధి, నాణ్యమైన జీవితానికి అవకాశాలు అధికంగా ఉన్న నగరాలు, పట్టణాలకు వలసలు (Migrations) పెరిగిపోతున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ఈ వలసలు కొత్త చిక్కులకు కారణమవుతున్నాయి.

Japan Tokyo: టోక్యో నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోమంటున్న జపాన్ ప్రభుత్వం !.. కారణం ఇదే

టోక్యో: మెరుగైన ఉపాధి, నాణ్యమైన జీవితానికి అవకాశాలు అధికంగా ఉన్న నగరాలు, పట్టణాలకు వలసలు (Migrations) పెరిగిపోతున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ఈ వలసలు కొత్త చిక్కులకు కారణమవుతున్నాయి. ఒకవైపు గ్రామీణ, మారుమూల ప్రాంతాలు ఖాళీ అయిపోతుండగా.. మరోవైపు నగరాలు-పట్టణాలు జనాభాతో (Population) కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలే జపాన్‌ను (Japan) ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని నగరం టోక్యోతోపాటు (Tokyo) పలు ప్రధాన నగరాలు ఈ విషయంలో జపాన్‌ను భయపెడుతున్నాయి. ఎంతగా అంటే గ్రామీణ, మారుమూల ప్రాంతాలు దాదాపు ఖాళీ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృద్ధులు, పెద్ద వయస్కులు మాత్రమే ఈ ప్రాంతాల్లో ఒంటరి జీవనాన్ని సాగించాల్సి వస్తోంది. ఈ ప్రమాదకర పరిస్థితులు నానాటికీ పెరిగిపోతుండడంతో జపాన్ ప్రభుత్వం పరిష్కార ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

టోక్యో నగరం నుంచి బయటకు వెళ్లి జీవించేందుకు సిద్ధమైతే కుటుంబంలోని ఒక్కో బిడ్డకు 1 మిలియన్ జపాన్ యెన్‌లు (దాదాపు రూ.6.22 లక్షలు) చెల్లించేందుకు సిద్ధమైంది. మూడేళ్లక్రితమే ఈ విధానానికి శ్రీకారం చుట్టినా పెద్ద స్పందన రాలేదు. దీంతో గతంలో కేవలం 7500 డాలర్లుగా ఉన్న రీలోకేషన్ ఫీజును 2,260 డాలర్లకు (3,00,000 యెన్‌లు) భారీ మొత్తంలో పెంచింది. టోక్యోలోని 23 ప్రధాన వార్డులు, ఇతర మెట్రోపాలిటన్ ప్రాంతాలతోపాటు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే సైటమా, చిబా, కనగవా ప్రాంతాలను ఖాళీ చేసే కుటుంబాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. గ్రేటర్ టోక్యో నుంచి బయటకు వెళ్లే కుటుంబాలకు మాత్రమే ఈ ఉద్దీపన అందనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సిటీ పరిధిలోని పర్వత ప్రాంతాలకు తరలివెళ్తే ఫీజు కూడా లభిస్తుందని తెలిపింది.

షరతులు వర్తిస్తాయ్..

నగరాన్ని వదిలివెళ్లేవారికి ఉద్దీపనకు సంబంధించి ప్రభుత్వం పలు షరతు విధించింది. ఎవరైనా డబ్బు తీసుకుని నగరాన్ని వదిలి వెళ్లిన కొంతకాలానికే మళ్లీ తిరిగి వస్తే డబ్బు మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబాలు తమ కొత్త ఇళ్లలో కనీసం 5 ఏళ్లు జీవించాలి. అంతేకాదు కుటుంబంలోని ఒక్కరైనా ఆ ప్రాంతంలో పని చేయాలి లేదా ఆ ప్రాంతంలో వ్యాపారాన్ని మొదలుపెట్టాలి. ఈ 3 షరతులు పాటించే కుటుంబాలకు అర్హతని బట్టి 1 - 3 మిలియన్ల యెన్‌ల మొత్తం దక్కనుంది. పరిస్థితుల ఆధారంగా చెల్లింపు మొత్తం పెరుగుతుంది. ఇద్దరు పిల్లలున్న కుటుంబాలకు 5 మిలియన్ యెన్‌లు (దాదాపు రూ.31 లక్షలు) చెల్లించే అవకాశం ఉంది. అయితే నగరం విడిచి వెళ్లినవారు 5 ఏళ్లలోపే తిరిగి రావాలనుకుంటే డబ్బు మొత్తం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కాగా కుటుంబాలకు చెల్లించే మొత్తం సగం భరించనుండగా.. మిగతా మొత్తాన్ని స్థానిక మునిసిపాలిటీలు చెల్లించనున్నాయి. ఈ పథకం ద్వారా 2027 నాటికి 10 వేల కుటుంబాలు నగరాన్ని విడిచిపెట్టి వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కాగా టౌన్‌లు, పట్టణాల్లో జనాభా తగ్గుదల రేటు ఆందోళనకరంగా ఉండమే ఇందుకు కారణంగా ఉంది. మరోవైపు టోక్యో, ఒసాకా, ఇతర పెద్ద నగరాలకు జనాభా వలసలు భారీగా పెరిగాయి. ఈ సమస్యను నివారించడమే లక్ష్యంగా జపాన్ ప్రభుత్వం మూడేళ్లక్రితం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో జనాభా తగ్గుదలకు గల కారణాల్లో కరోనా మహమ్మారి కూడా ఒకటని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. మరి ఉద్దీపన పెంపుతో ఫలితం ఏవిధంగా ఉంటుందో వేచిచూడాలి.

Updated Date - 2023-01-05T17:41:04+05:30 IST