కలైవాణి పేరు వెనుక ఇంత కథ ఉందా.. వాణి జయరాం పుట్టగానే సిద్ధాంతి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-02-04T20:41:13+05:30 IST

సుమధుర వాణి మూగవోయింది. గాయనీమణి వాణి జయరాం (Vani Jayaram) (78) శనివారం కన్నుమూశారు. తమిళనాడు (Tamil Nadu)లోని వేలూరులో 1945 నవంబరు 30వ తేదీన....

కలైవాణి పేరు వెనుక ఇంత కథ ఉందా.. వాణి జయరాం పుట్టగానే సిద్ధాంతి ఏమన్నారంటే..

చెన్నై: సుమధుర వాణి మూగవోయింది. గాయనీమణి వాణి జయరాం (Vani Jayaram) (78) శనివారం కన్నుమూశారు. తమిళనాడు (Tamil Nadu)లోని వేలూరులో 1945 నవంబరు 30వ తేదీన పద్మావతి, దొరైస్వామి అయ్యంగార్‌ దంపతులకు జన్మించిన వాణి జయరాం అసలు పేరు కలైవాణి. ఆమె చిన్ననాటి నుంచే గీతాలాపన పట్ల శ్రద్ధ చూపేవారు. సంగీత కుటుంబంలో జన్మించిన పాప కావడంతో సహజంగానే ఆకర్షితురాలవుతోందని భావించిన తల్లిదండ్రులు.. మొదట్లో అంతగా పట్టించుకోలేదు. కానీ ఆమె గానాలాపన తీరు చూసిన తరువాత కడలూరు శ్రీనివాస అయ్యంగార్‌ అనే సంగీత విద్వాంసుని వద్ద సంగీతంలో ఓనమాలు నేర్పించారు. అనంతరం ఆమె టీఆర్‌ బాలసుబ్రమణియన్‌, త్రివేండ్రం ఆర్‌ఎస్‌ మణి వంటి మహామహుల వద్ద కర్ణాటిక్‌ సంగీతంలో రాటుదేలారు. వాణి చిన్నప్పటి నుంచి రేడియో సిలోన్‌ ఛానల్‌కు అతుక్కుపోయేవారు. అందులో వచ్చే హిందీపాటలంటే చెవి కోసుకునేవారు. సినిమా పాటల్ని వింటే కుటుంబీకులు మందలిస్తారన్న జంకుతో చాటుగానే రేడియో పాటలు వినేవారు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఆమె మద్రాస్‌లోని ఆలిండియా రేడియో (All india Radio)లో తొలిసారిగా పాట పాడడం విశేషం.

బ్యాంకు ఉద్యోగిగా జీవితం ప్రారంభం

చెన్నైలోని క్వీన్‌మేరీస్‌ కళాశాలలో డిగ్రీ పొందిన ఆమె.. స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా (State Bank of India)లో ఉద్యోగం సంపాదించారు. 1967లో ఆమె హైదరాబాద్‌ (Hyderabad) బ్రాంచ్‌కి బదిలీ అయ్యారు. 1969లో వాణికి జయరాంతో వివాహమైంది. అత్తగారిది కూడా సంగీత కుటుంబమే కావడంతో ఆమె సంగీత సాధనకు ఎలాంటి అవాంతరం లేకుండాపోయింది. ఆమె అత్త కర్నాటక సంగీత గాయని పద్మాస్వామినాధన్‌. వివాహానంతరం ఆమె ముంబాయిలో స్థిరపడాల్సి వచ్చింది. దాంతో ఆమె అభ్యర్థన మేరకు బ్యాంకు వారు ఆమెను ముంబాయికి బదిలీ చేశారు. వాణి గాన నైపుణ్యాన్ని గ్రహించిన జయరాం.. ఆమెను హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకునేందుకు సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ఖాన్‌ వద్ద చేర్పించారు. ఆయన వద్ద పొందిన కఠోరమైన శిక్షణ వాణి బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి, సంగీతాన్ని తన వృత్తిగా స్వీకరించేలా చేసింది. వాణి రెహ్మాన్‌ఖాన్‌ శిక్షణలో తుమ్రీ, గజల్‌, భజన్‌ వంటి వివిధ స్వరరూపాల సూక్ష్మ నైపుణ్యాలను కూడా నేర్చుకున్నారు. అదే ఒరవడిలో 1969లో ముంబాయిలో బహిరంగ కచేరీ ఇచ్చారు.

అదే ఏడాది గాయకుడు కుమార్‌ గంధర్వతో కలిసి మరాఠీ ఆల్బంను రికార్డ్‌ చేస్తున్న స్వరకర్త వసంత్‌ దేశాయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె స్వరాన్ని విన్న దేశాయ్‌.. అదే ఆల్బమ్‌లో ‘రుణానుబంధ చా’ అనే పాట పాడించారు. ఈ ఆల్బమ్‌ మరాఠీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే ఆమెను సినీసంగీతంలోకి నెట్టేసింది. 1970లో ‘గుడ్డి’ అనే చిత్రంలో తొలిసారి పాట పాడారు. అందులో ఆమె పాడిన ‘బోలో రే’ పాట అప్పట్లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తరువాత ఆమె పండిట్‌ రవిశంకర్‌ సంగీతం అందించిన ‘మీర’ చిత్రంలో పాడారు. ఆ తరువాత ఇక ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండాపోయింది. 1973లో విడుదలైన ‘అభిమానవంతుడు’ చిత్రం ద్వారా వాణి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వాణి జయరాం ఎస్‌ఎం సుబ్బయ్య నాయుడు చొరవతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్‌.విశ్వనాథన్‌ సంగీత దర్శకత్వంలో పాడిన ‘మల్లిగై ఎన్‌ మన్నన్‌ మయంగుమ్‌’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు పాడి మంచి పేరుతో పాటు గుర్తింపును సొంతం చేసుకున్నారు. కె.బాలచందర్‌ తీసిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్ర పాటలు దక్షిణభారతదేశంలో వాణికి మంచి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టాయి. అనంతరం శంకరాభరణం, స్వాతికిరణం వంటి చిత్రాల్లో పాటలకూ ఆమెకు జాతీయ అవార్డులు వచ్చాయి. ‘ఆనతినియ్యరా హరా...’, తెలిమంచు కరిగింది..’, ‘ఎన్నెన్నో జన్మల బంధం..’ వంటి పాటలతో ఆమె ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

అవార్డులు

వాణి జయరాంకు పలు దేశవిదేశాలకు చెందిన అవార్డులు వచ్చాయి. కేంద్రప్రభుత్వం నుంచి మూడుమార్లు జాతీయ అవార్డులు. ‘గుడ్డి’ సినిమాలో పాడినందుకు జాతీయ అవార్డు మియా తాన్‌సేన్‌ అవార్డు వచ్చింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’, త్యాగరాజర్‌ భాగవతార్‌ జీవిత సాఫల్య పురస్కారం, సంగీత పీఠ్‌ సమ్మాన్‌ అవార్డు, కాముకర అవార్డు, ముద్రా అకాడమీ అవార్డు, సుబ్రమణ్య భారతి అవార్డు, రేడియో మిర్చి జీవిత సాఫల్య పురస్కారం, కన్నదాసన్‌ అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, సుబ్బులక్ష్మి అవార్డుతో పాటు వివిధ దేశాలకు చెందిన పలు సంస్థల నుంచి సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆమెను చాలామంది ‘దక్షిణభారత మీరా’గా అభివర్ణిస్తారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గుజరాత్‌, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడ ఆమెను అవార్డులతో సత్కరించడం విశేషం.

19 భాషల్లో 11 వేల పాటలు

ఆమె తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతి, మరాఠీ, మర్వారి, హర్యాన్వి, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్‌, భోజ్‌పురి, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబి, తుళు వంటి 19 భాషల్లో సుమారు 11 వేల పాటల్ని ఆలపించారు. ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించారు. ఆమె భర్త జయరాం 2018లో కన్ను మూయడంతో ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. సంతానం లేకపోవడంతో బంధుమిత్రులతోనే ఆమె కాలక్షేపం చేస్తున్నారు.

సిద్ధాంతి సూచనతో నామకరణం

వాణి జయరాం జన్మించిన కొత్తలో ఆమె తండ్రి దురైస్వామి అయ్యంగార్‌.. ఓ జాతకాన్ని సిద్ధాంతికి చూపించగా.. ఆమె భవిష్యత్తులో మంచి గాయని అవుతుందని ఆయన చెప్పారట. అందువల్ల తనకు ‘కలైవాణి’ అని నామకరణం చేసినట్లు పలు వేదికలపై వాణిజయరాం చెప్పుకున్నారు. సుమధుర గాయనిగా పేరొందిన వాణి జయరాంకు 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల 25వ తేదీన కేంద్రప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డును స్వీకరించేందుకు కేంద్రం నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్న ఆమె ఇంతలోనే కన్ను మూయడంతో ఆమె అభిమానులు, సంగీతప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వాణి జయరాం మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, సంగీత దర్శకులు దేవా, దీనా తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Updated Date - 2023-02-04T21:00:16+05:30 IST