Remembering Suraiya : బంధాలను వదిలి రాలేనంది..! చెంప ఛెళ్ళు మనిపించాడు ఆహీరో..!

ABN , First Publish Date - 2023-01-31T11:47:02+05:30 IST

దేవ్ ఇదే చెప్తున్నా" నేను పెళ్ళంటూ చేసుకుంటే..అది నిన్నే.,అది వీలుకాదు కాబట్టి నా జన్మలో పెళ్ళి అంటూ చేసుకోను!

Remembering Suraiya : బంధాలను వదిలి రాలేనంది..! చెంప ఛెళ్ళు మనిపించాడు ఆహీరో..!
Suraiya

ఆత్మహత్యే అన్నిటికీ పరిష్కారం అయితే.. భూమ్మీద ఒక్క మనిషి కూడా ఉండరని ఘంటాపథంగా చెప్పొచ్చు. సమస్యలు లేని వారున్నారా? కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చు. కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేరు మానవులు అని పెద్దలు చెప్పిందే! ఎంత జటిలమైన సమస్య అయినా చావు పరిష్కారమెన్నటికీ కాదు. నీ సత్తా తెలిసేది....సమస్యలొచ్చినప్పుడే. బ్రతుకంతా సాఫీగా పూలబాటలా సాగిపోతే..నీ గొప్పేముంది! సమస్యను సవాలుగా తీసుకుంటే సాధించలేమా?

మహానటి సావిత్రి..,జెమినీ గణేశన్ కోసం,ఆయన విముఖత వలన, విరక్తితో తాగుడుకు బానిసై, బ్రతుకు చిధ్రం చేసుకున్న వైనం, ప్రజలకు ముఖ్యంగా యువతకు నచ్చింది! ఇదీ ఓ విధంగా ఆత్మహత్యా సదృశమే. కాకపోతే మరణం వెంటనే కాక మెల్ల మెల్లగా మనిషిని కబలిస్తుంది. అంతే తేడా. కానీ ప్రేమ విఫలమైనా ప్రేమించిన వాడిని గుండెల్లో నింపుకుని జీవితమంతా హాయిగా గడిపేసిన ధృవ తార సురయ్యా గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు! ప్రేమంటే రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు. రెండు హృదయాలకు సంబంధించినది! అని నిరూపించిన సురయ్యా నిజంగా అభినందనీయురాలు.

సురయ్యా లాహోర్ లో జన్మించినా, బొంబాయిలోని మెరైన్ డ్రైవ్ లో అమ్మ, అమ్మమ్మలతో ఉంటూ జె.బి.పెటిట్ హై స్కూల్ లో చేరినప్పుడు తన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా! 6 ఏళ్ళ సురయ్యాకు 12 ఏళ్ళ రాజ్ కపూర్, మ్యుజిక్ డైరెక్టర్ గా పేరుగాంచిన మదన్ మోహన్! ముగ్గురు కలిసి బొంబాయి ఆల్ ఇండియా రేడియోలో పాడే వారు. బాల నటిగా 7 ఏళ్ళకే బాల నర్గీస్ తో కలిసి మేడం ఫాషన్ అనే మూవీలో(1936) యాక్ట్ చేస్తూ పాడింది. అందులో హీరోయిన్ నర్గీస్ తల్లి జర్దన్ బాయి. 7 ఏళ్ళకే సురయ్యాలోని గాన మాధుర్యాన్ని పసిగట్టారావిడ! బాలనటిగా తమన్నా(42), స్టేషన్ మాస్టర్(1942), హమారీ బాత్(43) లాంటి మూవీస్ లో యాక్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: ఈ రెస్టారెంట్ లో పూర్తిగా పచ్చి భోజనాన్ని తినాల్సిందే...!

హమారీ బాత్ నిర్మాత దేవికా రాణి నెలకు 500 రూపాయల జీతం ఏర్పాటు చేస్తే ఆ మూవీస్ విడుదలయ్యాక కె. ఆసిఫ్ తన రేట్ ను ఏకంగా 40000 కు పెంచేశాడు చిత్రానికి. దేవికా రాణిని ఒప్పించి నటించింది. అదే ఫూల్ మూవీ. ఆ తరువాతా ఇషారాతో తారాపథంలో దూసుకెళ్ళింది సింగింగ్ స్టార్ గా! తన పాటలు తనే మధురాతి మధురంగా గానం చేసుకుంటూ అద్భుతమైన నటన, పాలరాతి శిల్పం లాంటి అందమైన సురయ్యా.., క్రమేణా నిర్మాతల పాలిటి కల్పవృక్షమయ్యిందంటే అతిశయోక్తి కాదు! 1945 నుండి 1961 దాకా హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ సురయ్యా! సురయ్యా మూవీకి లక్ష పారితోషికం తీసుకునే రోజుల్లో త్రిమూర్తులు దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, రాజ్ కపూర్ లకు ఆమె కన్నా వారి పారితోషికం తక్కువ!

WhatsApp Image 2023-01-31 at 11.45.35 AM.jpeg

విద్య(1948), జీత్(1949), షాయిర్(1949), అఫ్సార్(1950), నీలి(1950), దో సితారే(51), సనం(1951) ఇవన్నీ సురయ్యా హీరోయిన్ గా నటించిన చిత్రాలే. కాకపోతే వీటికో ప్రత్యేకత ఉంది. అప్పుడప్పుడే అప్ కమింగ్ హీరో దేవానంద్ తో కలిసి నటించిన మూవీస్. విద్య(1948) లోనే పరస్పర ఆకర్షణ ఇద్దరికీ మొదలైంది, సురయ్యా రెకమెండేషన్ తోనే దేవ్ ఇన్ని చిత్రాలు నటించాడు! కాకపోతే దేవ్ ఆనంద్ గ్రెగరీ పెక్ హెయిర్ స్టైల్ మానరిజంస్ ఇవన్నీ సురయ్యాకు భలే నచ్చాయి. దేవ్ ఆనంద్ హిందువు. సురయ్యా ముస్లిం.

పైగా అమ్మ, అమ్మమ్మ, మామయ్యలు వీరి వ్యవహారం పసిగట్టి ముందే హెచ్చరించారు. పెళ్ళికి ససేమిరా అన్నారు! ఎంతో భవిష్యత్తు ఉన్న నీకప్పుడే పెళ్ళా! అంటూ నిలువరించారు. మరి బంగారు బాతును అంత ఈజీగా వదులుకుంటారా బంధువులు!

1951 లో అఫ్సార్ షూటింగ్ లో 3000 రూపాయల వజ్రపు రింగ్ తొడిగి మరీ ప్రపోజ్ చేశాడు దేవ్ సురయ్యాకు. ఇంటికెళ్ళాక పెద్ద యుధ్ధమే జరిగింది. ఆ ఉంగరాన్ని లాగి పారేసి సముద్రంలో విసిరేసింది అమ్మమ్మ! మామయ్య ఈడ్చి కొట్టాడు! ఇదీ గ్లామర్ స్టార్ల జీవితాలు! ఇక సనం(1951) ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం. అమ్మ, అమ్మమ్మ, మామయ్యలను ఎదిరించి రాలేనంది సురయ్యా! చెంప ఛెళ్ళు మనిపించాడు దేవ్ కూడా! సురయ్యా కన్నీళ్ళతో గుండెలవిసేలా ఏడుస్తూ "దేవ్ ఇదే చెప్తున్నా" నేను పెళ్ళంటూ చేసుకుంటే..అది నిన్నే.,అది వీలుకాదు కాబట్టి నా జన్మలో పెళ్ళి అంటూ చేసుకోను!" అని చెప్తుంటే కోపంతో ఊగిపోతున్న దేవ్ విసురుగా వెళ్ళిపోయాడు! అదే వారి చివరి కలయిక. ఆ తరువాత ఇద్దరూ కలిసి నటించలేదు. 1954 లో దేవ్ కల్పనా కార్తిక్ అనే సహ నటిని హడావిడిగా రిజిస్టర్ పెళ్ళి చేసుకుని ఆరోజు మధ్యాహ్నం షూటింగ్ కు కూడా హాజరయ్యాడు!

సురయ్యా అందం, నటన, గానం అన్నీ కలబోసిన వజ్రం. అంతే కాదు 1963 లో తనకు ఇంకా ప్రజాదరణ ఉన్నాస్వయం నిర్ణయంతో తెరమరుగై 2004 లో మరణం వరకు మళ్ళీ పెళ్ళి ఊసెత్తలేదు. కనీసం ఇంటర్వ్యూలు కానీ, ఫొటోలకు పోజులు ఇవ్వడం కూడా చేయలేదు. ఒక విధమైన రెక్లూసివ్ లైఫ్ గడిపింది. 1996 లో స్క్రీన్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకునేందుకు వచ్చినప్పుడు చక్కటి మేకప్ వేసుకుని వచ్చింది. ఎంతో యాక్టివ్ గా పాల్గొన్నది సురయ్యా! దేవ్ సురయ్యా ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పదైనా...ఇద్దరికీ ప్రాణం జీవితం మీద గొప్ప అవగాహన గౌరవం ఉన్నాయని చెప్పాలి.

అందంలో అప్సరస.,గానంలో గంధర్వ కన్య.,నటన లో అద్భుత వజ్రం., ఓ కోహినూర్ తో పోల్చదగ్గ సురయ్యా వర్ధంతి ఈ రోజు.

- Prasad Kvs

Updated Date - 2023-01-31T12:40:35+05:30 IST