Guiness Records: 7'9'' పొడవున్న శిరోజాలు.. భారత మహిళకు గిన్నిస్ రికార్డు
ABN , First Publish Date - 2023-11-30T19:45:51+05:30 IST
ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్మిత శ్రీవాత్సవ (46) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన శిరోజాలున్న మహిళగా గిన్నిస్ రికార్డు దక్కించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌కు(Uttarpradesh) చెందిన స్మిత శ్రీవాత్సవ (46) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన శిరోజాలున్న వ్యక్తిగా(Person with longest hair) గిన్నిస్ రికార్డు(Guiness Records) దక్కించుకుంది. ఆమె కురుల పొడవు ఏకంగా ఏడు అడుగుల తొమ్మిది అంగుళాలు. తనకు 14 ఏళ్ల వయసున్న నాటి నుంచి జుట్టును కత్తిరించుకోవడం మానేశానని స్మిత చెప్పింది. 1980ల నాటి హిందీ సినిమాల్లో హీరోయిన్ల కేశసంపద చూసిన స్ఫూర్తితో తాను పొడవైన జుట్టువైపు మళ్లినట్టు ఆమె చెప్పింది.
‘‘భారత సంస్కృతిలో దేవతలకు పొడవైన శిరోజాలు ఉంటాయి. స్త్రీలు జుట్టు కత్తించుకోవడం అమంగళం అన్న భావన భారతీయ సమాజంలో ఉంది. కాబట్టి, ఇక్కడి వనితలు పొడవైన కురులవైపు మొగ్గు చూపుతారు. ఇవి భారతీయ మహిళల అందాన్ని ఇనుమడింప చేస్తాయి’’ అని ఆమె వెల్లడించింది.
గిన్నిస్ రికార్డ్స్‌లో స్మిత కేశ సౌందర్యానికి కారణం కూడా పొందుపరిచారు. ఆమె వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తుంది. తలస్నానం, జుట్టు ఆరపెట్టుకోవడం, చిక్కులు తీయడం, తలదువ్వుకోవడం వరకూ అంతా పూర్తయ్యేసరికి మూడు గంటల పడుతుంది.
జడ వేసుకోకుండా బయటకు వెళ్లిన ప్రతిసారీ జనాలు తనను చూసి షాకవుతారని స్మిత చెప్పింది. అసలు ఇంత పొడవైన జుట్టు సాధ్యమని వారు నమ్మలేక నోరెళ్లబెడుతుంటారని పేర్కొంది. ‘‘కొందరు వచ్చిన నా జుట్టును చేతితో తాకుతారు. మరికొందరు నాతో సెల్ఫీ దిగుతారు. కేశపోషణకు ఏ ఉత్పత్తులు వాడతావని కూడా కొందరు అడుగుతారు’’ అని ఆమె మురిసిపోతూ చెప్పింది. తనకు గిన్నిస్ రికార్డు దక్కడంపై స్మిత హర్షం వ్యక్తి చేసింది. ఎన్నో ఏళ్ల నాటి కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. దేవుడు తన ప్రార్థనలను ఆలకించాడని స్మిత వ్యాఖ్యానించింది.