Oscars 2023 Nominations: ఆస్కార్స్‌లో సత్తా చాటిన భారతీయ సినిమాలు.. ‘ది ఛెల్లో షో’ కు నిరాశ..

ABN , First Publish Date - 2023-01-24T20:20:30+05:30 IST

సినీ ప్రపంచంలోనే విశిష్ఠంగా భావించే ఆస్కార్స్‌లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. పలు సినిమాలు నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఇండియా నుంచి అధికారికంగా పురస్కారాల కోసం పంపించిన ‘ది ఛెల్లో షో’ (The Chhello Show) కు మాత్రం నిరాశ ఎదురైంది.

Oscars 2023 Nominations: ఆస్కార్స్‌లో సత్తా చాటిన భారతీయ సినిమాలు.. ‘ది ఛెల్లో షో’ కు నిరాశ..

సినీ ప్రపంచంలోనే విశిష్ఠంగా భావించే ఆస్కార్స్‌లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. పలు సినిమాలు నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఇండియా నుంచి అధికారికంగా పురస్కారాల కోసం పంపించిన ‘ది ఛెల్లో షో’ (The Chhello Show) కు మాత్రం నిరాశ ఎదురైంది. టాలీవుడ్ నుంచి బరిలో నిలబడిన ‘ఆర్ఆర్ఆర్’ అకాడమీ అవార్డ్‌కు అడుగు దూరంలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ (The Elephant Whisperers) ఆస్కార్ రేసులో నిలబడింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో సౌనక్‌ సేన్‌ రూపొందించిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ (All That Breathes) నామినేషన్‌ దక్కించుకుంది. గాయపడ్డ పక్షుల్ని రక్షించడమే లక్ష్యంగా జీవించే ఇద్దరు సోదరుల కథతో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ రూపొందింది. దిల్లీ నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది. ఆస్కార్ విజేతలకు పురస్కారాలను మార్చి 13న ప్రదానం చేయనున్నారు.

ఆస్కార్ నామినేషన్ దక్కడంతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. ‘‘మేం చరిత్ర సృష్టించాం. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్ దక్కించుకుందని తెలియజేయడానికి మేం సంతోషిస్తున్నాం’’ అని ‘ఆర్ఆర్ఆర్ టీమ్’ పేర్కొంది. ‘ఆర్ఆర్ఆర్’ ను 1920ల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించాడు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపుగా రూ.1200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

Updated Date - 2023-01-24T20:22:37+05:30 IST