ఒక ఐఏఎస్‌ మ్యూజిక్‌ స్కూల్‌

ABN , First Publish Date - 2023-04-09T15:29:10+05:30 IST

సాధారణంగా ఐఏఎస్‌ లాంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో నిరంతరం బిజీగా ఉంటారు.

ఒక ఐఏఎస్‌ మ్యూజిక్‌ స్కూల్‌

సాధారణంగా ఐఏఎస్‌ లాంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో నిరంతరం బిజీగా ఉంటారు. రిటైర్‌ అయిన తర్వాత తమ అనుభవాలను పుస్తకాలు రాసుకుంటూనో లేదంటే ఎలాంటి ఒడుదొడుకులు లేని విశ్రాంత జీవితాన్నో కోరుకుంటారు. కానీ ఐఏఎస్‌ అధికారిగా విశేషమైన అనుభవమున్న బియ్యాల పాపారావు మాత్రం ఆశ్చర్యంగా ఫిల్మ్‌మేకింగ్‌ వైపు దృష్టిసారించారు. తన ‘న్యూవేవ్‌’ ఆలోచనలను బిగ్‌ స్ర్కీన్‌పై చూడాలనుకుంటున్నారు. మనదేశంలో ఒక ఐఏఎస్‌ అధికారి... ఫిల్మ్‌మేకర్‌గా మారడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఆసక్తి కలిగించే ఐఏఎస్‌ టు ఫిల్మ్‌మేకింగ్‌ జర్నీ ఆయన మాటల్లోనే...

‘‘ఒక ఐఏఎస్‌ అధికారిగా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సంఘటనలు నా మనోఫలకంపై దృశ్యాల్లా అలా ముద్రించుకుపోయాయి. వాటికున్న విజువల్‌ కెపాసిటీని ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి ఇతరత్రా ఏ ప్రక్రియ కూడా మ్యాచ్‌ కాదనుకుని ఫిల్మ్‌మేకింగ్‌ను ఎంచుకున్నా. సమాజంలో పిల్లలను చదువు పేరుతో తల్లిదండ్రులు ఎంత ఒత్తిడికి గురిచేస్తున్నారో తెలిసిందే. ఆటపాటలతో హాయిగా గడవాల్సిన వారి బాల్యం తీవ్రమైన ఒత్తిడికి ఎందుకు గురవుతోందనే సున్నితమైన విషయాన్ని నేను ‘మ్యూజిక్‌స్కూల్‌’ సినిమా ద్వారా చెబుతున్నా. ఇదొక న్యూవేవ్‌ సినిమా. సంగీత ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం మాస్ట్రో ఇళయరాజా గారు ఇష్టపడి పనిచేయడం ఆనందాన్నిచ్చింది. 11 పాటల్లో 3 ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ సాంగ్స్‌’. వాటిని లండన్‌లోని బ్రాడ్‌వేలో రికార్డు చేశాం. నేపథ్య సంగీతం ప్రసిద్ధ బుడాపెస్ట్‌లో రూపొందించాం. ‘జోధా అక్బర్‌’, ‘మణికర్ణిక’, ‘అక్స్‌’ వంటి ఎన్నో బాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన కిరణ్‌ దియోహన్స్‌ ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. ఆడమ్‌ ముర్రే, రాజు సుందరం, చిన్నిప్రకాశ్‌ వంటి కొరియోగ్రాఫర్లు పనిచేశారు. శ్రియా, శర్మన్‌జోషీ, ప్రకాశ్‌రాజ్‌, గాయకుడు షాన్‌, సుహాసినీ మూలే, బెంజమిన్‌ గిలానీ, గ్రేసీ గోస్వామి వంటి ప్రసిద్ధ నటీనటులున్న ‘మ్యూజిక్‌స్కూల్‌’ను ఒక న్యూవేవ్‌ సినిమాగా తీశాను.

20.jpg

ఆయన స్నేహంతో...

మాది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నెల్లికుదురు మండలంలో ఉన్న మునిగాలవీడు గ్రామం. చిన్నప్పుడు సినిమా అంటే ఏమిటో కూడా తెలియదు. పండుగలు, పబ్బాలకు ఊర్లో పద్యనాటకాలు వేసేవారు. ఎప్పుడైనా వరంగల్‌కు వెళితే ఒకటీ అరా సినిమాలు చూసేవాణ్ణి. ఉన్నత చదువుల కోసం వరంగల్‌, హైదరాబాద్‌... ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లాను. అక్కడి జేఎన్‌యూలో అసీమ్‌ చబ్రా అనే మిత్రుడు ఉండేవాడు. అతడి ద్వారానే మొట్టమొదటిసారిగా న్యూవేవ్‌ సినిమా పరిచయం అయ్యింది. శ్యాంబెనగళ్‌, గౌతంఘోష్‌, కేతన్‌ మెహతా, గిరీష్‌ కాసరవల్లి... లాంటి ఎంతోమంది గొప్ప దర్శకుల సినిమాలు చూసేవాణ్ణి. మరోవైపు ఐఏఎస్‌ కోచింగ్‌ తీసుకుని సెలెక్టయ్యాను. తొలి పోస్టింగ్‌ అసోమ్‌లో ఇచ్చారు. అక్కడే నాకు ప్రసిద్ధ అసోమ్‌ దర్శకుడు జాను బారువా పరిచయమయ్యారు. సమయం చిక్కితే ఆయన షూటింగ్‌లకు వెళ్లడం, ఆయనతో మాట్లాడటం చేసేవాణ్ణి. ఒకరకంగా సినిమా మీద నా ఆసక్తి పెరగడానికి ఆయన స్నేహమే కారణం.

21.jpg

సెలవుల్లో ఫిల్మ్‌మేకింగ్‌ కోర్స్‌...

ఒకవైపు ఐఏఎస్‌ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే సెలవుల్లో (1998) ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ’లో 3 నెలల పాటు ఫిల్మ్‌మేకింగ్‌ కోర్సు చేశా. అదే ఏడాది ‘విల్లింగ్‌ టు సాక్రిఫైజ్‌’ అనే డాక్యు మెంటరీని రూపొందించా. దానికి జాతీయ అవార్డు రావడంతో నాపై నాకు నమ్మకం ఏర్పడింది. 2000 నుంచి సీరియస్‌గా స్ర్కిప్టులు రాసుకోవడం మొదలెట్టా. అయితే విధి నిర్వహణలో బిజీగా ఉండటం వల్ల ఫిల్మ్‌మేకర్‌ అవ్వాలనే నా కోరిక అలాగే ఉండిపోయింది. అప్పటికే ఐదారు స్ర్కిప్టులు సిద్ధం చేసుకున్నా. ఐఏఎస్‌ అధికారిగా 23 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌ తర్వాత (అప్పుడే తెలంగాణ ఏర్పడింది) స్వచ్ఛంద పదవీ విరమణ చేశా. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానంతో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా (పాలసీ అడ్వైజర్‌) ఐదేళ్లపాటు సేవలందించా. 2019లో రాజీనామా చేసి నా సినిమా కలకు శ్రీకారం చుట్టాను. నాలుగేళ్లుగా (మధ్యలో కరోనా) అత్యంత వ్యయప్రయాసల కోర్చి, ఎంతోఇష్టంగా తీసిన ‘మ్యూజిక్‌స్కూల్‌’ను త్వరలో మూడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం) ప్రముఖ నిర్మాణ సంస్థలు విడుదల చేస్తున్నాయి. నా సృజన వారికి నచ్చిందంటే... ఫిల్మ్‌మేకర్‌గా నేను విజయం సాధించినట్లే కదా.’’

- చల్లా

Updated Date - 2023-04-09T15:29:19+05:30 IST