Hyderabad Book Fair : రచయిత వసుధేంద్రతో మీట్ ఆండ్ గ్రీట్..!

ABN , First Publish Date - 2023-01-01T21:46:02+05:30 IST

“తేజో తుంగభద్ర” చారిత్రాత్మక నవల.

 Hyderabad Book Fair : రచయిత వసుధేంద్రతో మీట్ ఆండ్ గ్రీట్..!
Hyderabad Book Fair

కథను ముగిసే చోటే మొదలుపెట్టాలి (Story has to start closer to its end) అని అంటుంటారు. కన్నడ రచయిత, వసుధేంద్రతో తెలుగు కలెక్టివ్ వారు నిర్వహించిన “మీట్ ఆండ్ గ్రీట్” ప్రోగ్రామ్ లో‍, కథలను చూడ్డానికి “రచయితకు ప్రత్యేకమైన కళ్ళు ఉండాలి, కళ్ళతోనే కాదు, ప్రపంచాన్ని పరిసరాలను పంచేద్రియాలతో అనుభవించగలగాలి” అని చెప్తూ, “రచయిత అన్నవాడు వినాలి. బాగా వినగలగాలి. అవతలివాళ్ళని సరైన ప్రశ్నలు అడిగి, వాళ్ళు చెప్పేవి ఎంత శ్రద్ధగా ఆలకించగలరనేది మంచి రచయితల లక్షణం.” అని అన్నారు.

మామూలుగా మనం సాహిత్య సభలంటే ఎత్తులో ఉన్న ఒక వేదిక, బోలెడన్ని కుర్చీలు, బొకేలు, శాలువాలు, ఎడతెరగని ఉపన్యాసాలు, పల్చగా ఉన్న జనం, ఉన్నవాళ్ళలో కూడా ఫోనుల్లోకి తలలు దూర్చేసి ఉండడాలు ఇవే మామూలైపోయిన తరుణంలో, రచయితలను పాఠకులను సమ-స్థలం (same ground) పై కూర్చోబెట్టి, ఉపన్యాసాలకు ఉద్వాసన పలికి, చక్కగా హాయిగా కబుర్లు ఆడుకునేలా ఏర్పాట్లు చేయడం, తెలుగు కలెక్టివ్ ద్వారా ఆదిత్య అన్నావఝ్ఝల చేస్తోన్న ప్రయత్నం. డిసెంబర్ 31న వసుధేంద్రతో జరిగిన కార్యక్రమం ఎంత సఫలమైందో చెప్పాలంటే, పుస్తకాలు చదవినవాళ్ళు, సాహిత్య సభలనగానే పక్కకు తప్పుకునే అలవాటున్నవాళ్ళు కూడా రెండున్నర గంటల సేపు కబుర్లలో పడిపోయారు.

అలా జరగడానికి కారణం, రచయిత తనకు తెలిసిన విషయాలను అందరినీ ఆకట్టుకునేలా చెప్పడం వల్లే. “తేజో తుంగభద్ర” చారిత్రాత్మక నవల (historical fiction). వాస్కో డి గామా, భారతదేశానికి సముద్ర దారి కనుగున్నాక పోర్చుగల్‍లోని సామాన్యులు ఇక్కడికి వలస రావడం, అక్కడి ఇక్కడి రాజకీయాల ఉక్కు చక్రాల కింద నలిగిన విధానం ఈ నవలలోని ముఖ్యాంశాలు. పుస్తకం చదివినవారికి, చదవనివారికి కూడా అర్థమయ్యేలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయనకు వచ్చినంత తెలుగులోనే వీలైనంతగా మాట్లాడారు. తేజో-తుంగభద్రలాంటి బృహద్గ్రంథాన్ని రాయడానికి చేసిన రిసెర్చ్, పరిగణలోకి తీసుకున్న అంశాలు, నవల రాయడానికి చేసుకున్న ప్లానింగ్ అన్నీ వివరంగా చెప్పుకొచ్చారు. మధ్యమధ్యలో భాషల గురించి, రచనా వ్యాసంగం గురించి ఎన్నో చమత్కారాలు.

పుస్తకం చదివేటప్పుడు పాఠకులది వినాల్సిన పాత్ర. ప్రేక్షకుడి పాత్ర. సాహిత్య సభల్లోనూ పాఠకులను ఆ వినడానికే పరిమితం చేస్తుంటారు. అలా కాకుండా, రచయితతో కరచాలనం చేసి, ఎదురుగా కూర్చుని, సంకోచాలను వదిలి ప్రశ్నలు అడుగుతూ, జవాబులకోసం ఎదురుచూస్తూ కొన్ని ఆలోచనలు పంచుకుంటుంటే ఒక కొత్త synergy ఏర్పడుతుంది. ఆ నూతనోత్సాహాన్ని అటు పాఠకులూ, ఇటు రచయితలూ తమతో పాటు ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి వేదికలను అందించడం తెలుగు కలెక్టివ్ వారి మంచి ప్రయత్నం.

-పూర్ణిమ తమ్మిరెడ్డి.

Updated Date - 2023-01-01T22:34:15+05:30 IST