Chandamama : చందమామ పుస్తకాలతో పీ.హెచ్.డి. పట్టా...!

ABN , First Publish Date - 2023-01-27T14:24:02+05:30 IST

1977 వేసవి సెలవుల్లో చందమామ కథలు చదువుతుంటే నేను అలానే ఎందుకు కథలు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది.

Chandamama :  చందమామ పుస్తకాలతో పీ.హెచ్.డి. పట్టా...!
Chandamama

పుస్తకాలు చదివే వారంతా చందమామ కథలను చదివే ఉంటారు. ఇప్పటికీ చందమామ పుస్తకాలను పిల్లల చేత చదివించే పనిలోనే చాలావరకూ తల్లిదండ్రులు ఉంటారు. ఎందుకంటే చందమామ పుస్తకాల్లోని చిన్న చిన్న కథలు ఎంతో చక్కగా ఆసక్తిగా ఉంటాయి. వాటిని చదివిస్తే పుస్తకపఠనం అలవాటు అవుతుందనేది అసలు ఉద్దేశ్యం. ఇప్పుడు చందమామ పుస్తకాలు రాకపోయినా వాటి మీద అభిమానం అలాగే ఉంది. దానిని మరోసారి గుర్తుచేస్తూ బాలసాహిత్యం రచయిత దాసరి వెంకట రమణగారు చందమామ పుస్తకాలపై పీ.హెచ్. డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతి వెబ్ పంచుకున్న విశేషాలు..

1975 లో పదేళ్ళ వయసులో మొదటిసారి చందమామ పుస్తకం చూశాను. అట్ట చినిగిపోయి, జీర్ణావస్థలో ఉన్న ఆ పుస్తకం రంగుల బొమ్మలతో మంచి మంచి కథలతో నన్ను చాలా ఆకర్షించింది. అప్పుడు దాన్ని చందమామ అంటారని నాకు తెలియదు. 1977 వేసవి సెలవుల్లో చందమామ కథలు చదువుతున్న నేను అలానే ఎందుకు కథలు రాయకూడదు అనే ఆలోచనతో మొదటిసారి కథ రాశాను. కానీ దాన్ని ఏ పత్రికకూ పంపలేదు. చందమామ కథలు చదవడం ఆపలేదు.

1980 మే చందమామ సంచిక నుండి స్వంతంగా చందమామలు కొని భద్ర పరచడం మొదలు పెట్టాను. 1981 లో రెండు కథలు రాసి చందమామకు పంపితే, ఒక కథ ప్రచురణకు తీసుకున్నట్టు వెంటనే ఉత్తరం వచ్చింది.

ఆ కథ నీకేలాభం పేరుతొ చందమామ మార్చి, 1982 సంచికలో ప్రచురించబడింది. ఆ కథలో కేవలం కథ కేంద్ర బిందువు మాత్రమె నాది. దాన్ని పూర్తిగా మార్చి ఒక కథగా తీర్చి దిద్ది, చందమామలో ప్రచురించారు. నాటి నుండి రచయిత నయ్యాను. అది మొదలు చందమామామ కథలు చదువుతూ, రాస్తూ ఉన్నాను. చందమామ నన్ను ఒక రచయితగా తీర్చి దిద్దింది.

మొదట్లో పది కథలు పంపితే, ఒక్క కథ ఎన్నికయ్యేది. తర్వాత్తర్వాత పది కథలు పంపితే, ఒక్క కథ వెనక్కు వచ్చేది. చందమామ మీద అభిమానంతో పాత సంచికలు సేకరించడం మొదలు పెట్టాను. బళ్ళో ఇంటర్ బెల్ అప్పుడు ఏమైనా తినమని ఇచ్చిన డబ్బులు, ఏమీ తినకుండా దాచుకుని, వాటిని చందమామలు కొనడానికి వెచ్చించాను. ప్రస్తుతం 1947 జులై మొదటి చందమామ నుండి 2013 అక్టోబర్ చివరి చందమామ వరకు మొత్తం 766 చందమామలు వచ్చాయి. అందులో 1950 దశకంలోవి కొన్ని తప్ప అన్ని చందమామలూ సేకరించాను.

చందమామ మీద అభిమానం పెరిగి దానిమీద పరిశోధన చేయాలనిపించింది. 2004లో ఉస్మానియా యూనివర్సిటీ లో PhD కోసం జాయిన్ అయ్యాను. డిగ్రీలో మా గురువు అయినటువంటి శ్రీ డి. చంద్రశేఖర రెడ్డి గారు నా పరిశోధనకు పర్యవేక్షణ వహించారు. నా ఉద్యోగ పని వత్తిడిలో పరిశోధన చాలా కాలం పాటు కొనసాగింది. చివరికి 2022మార్చి చివరన నా పరిశోధన వ్యాసం సమర్పించాను.

10.01.2023 తేదీన పర్యవేక్షకులు, శ్రీ చంద్రశేఖర రెడ్డిగారు, ఓరియంటల్ విభాగపు తెలుగు శాఖాధ్యక్షులు శ్రీ సిల్మానాయక్ గారు, శ్రీ చంద్రశేఖర రావు, శ్రీ సిహెచ్. వెంకట రెడ్డి గార్ల నేతృత్వంలో వైవా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ, ఎగ్జామినేషన్ బ్రాంచ్ అదనపు కంట్రోలర్ ఈ రోజు 27-01-2023 అధికారికంగా నాకు పీ.హెచ్.డి. పట్టాను ప్రకటించారు

Updated Date - 2023-01-27T14:26:41+05:30 IST