Share News

ఇకపై ఎప్పుడూ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టను.. యువతి ఆగ్రహానికి షేకైపోయిన ఫ్లిప్‌కార్ట్..!

ABN , Publish Date - Dec 22 , 2023 | 08:28 PM

యువతి ఆగ్రహానికి దిగొచ్చిన ఫ్లిప్‌కార్ట్. మరో ఛాన్స్ ఇవ్వాలంటూ అభ్యర్థన!

ఇకపై ఎప్పుడూ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టను.. యువతి ఆగ్రహానికి షేకైపోయిన ఫ్లిప్‌కార్ట్..!

ఇంటర్నెట్ డెస్క్: ఈ జమానాలో సోషల్ మీడియానే ఆయుధం. మనసులో బాధ, ఆవేదన ఒక్కసారి పంచుకుంటే చాలు..మేమున్నామంటూ సాంత్వన పలికేందుకు సిద్ధమైపోతారు నెటిజన్లు. కస్టమర్ల ఫిర్యాదులను వైరల్ చేస్తూ సంస్థల దృష్టికి తీసుకెళతారు. తాజా ఘటనలో ఇదే జరిగింది. నెట్టింట ఓ యువతి ఆగ్రహం వైరల్ కావడంతో ఫ్లిప్‌కార్ట్ వెంటనే దిగొచ్చింది. సమస్య పరిష్కరించేందుకు మరో ఛాన్స్ ఇవ్వడంటూ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆ మహిళా కస్టమర్ ఫిర్యాదు నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సదరు యువతి తండ్రి ఇటీవల ఫ్లిప్‌కార్డ్‌లో (Flipkart) ఏదో వస్తువు ఆర్డర్ చేశారు. వస్తువు డెలివరీ తీసుకునే సమయంలో ఏజెంట్‌కు ఓటీపీ ఇవ్వడంలో కాస్త ఆలస్యం చేశారు. వృద్ధాప్యం, ఫోన్ వాడకంపై అవగాహన లేకపోవడం తదితర కారణాల రీత్యా కాస్తంత జాప్యం జరిగింది. ఈ మాత్రానికే ఆ డెలివరీ ఏజెంట్ రెచ్చిపోయాడు. ‘‘ఏ పనీ రాదు కానీ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు మాత్రం పెట్టేస్తారు’ అంటూ పెద్దాయనపై గయ్యిమన్నాడు. ఇదంతా చూసిన యువతికి కోపం నషాళానికి అంటింది. పెద్దాయన అని కూడా తన తండ్రితో దురుసుగా ప్రవర్తించిన డెలివరీ ఏజెంట్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం వెలిబుచ్చింది (Delivery Agent misconduct with woman's father).


‘‘నాన్న ఫ్లిప్‌కార్ట్‌లో ఏదో ఆర్డరిచ్చారు. అయితే, వస్తువు తెచ్చిన డెలివరీ ఏజెంట్‌కు ఓటీపీని (OTP) తొందరగా చెప్పలేకపోయారు. దీంతో, అతడు ఏం రాకపోయినా ఆర్డర్లు మాత్రం పెడతారంటూ దురుసుగా మాట్లాడాడు. కస్టమర్లతో ఇలాగేనా మాట్లాడేది. ఇక జన్మలో నేను ఫ్లిప్‌కార్టు‌లో ఏదీ ఆర్డరివ్వను’’ అంటూ ఆమె నెట్టింట పోస్ట్ పెట్టింది.

యువతి పోస్టుకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. అనేక మంది ఫ్లిప్‌కార్డు ఏజెంట్‌పై మండిపడ్డారు. పెద్దవారి విషయంలో జాప్యం జరగడం సహజమని, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కసురుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ప్లిఫ్‌కార్ట్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. తమ సంస్థ ఇమేజీకి సమస్య రావడంతో ఫ్లిప్‌కార్ట్ వారు వెంటనే స్పందించారు. ‘‘ఇలాంటి ఘటనల్ని మేము చాలా సీరియస్‌గా తీసుకుంటాం. మా ఎగ్జిక్యూటివ్ దురుసు ప్రవర్తనకు మేము క్షమాపణ చెబుతున్నాం. సమస్యను పరిష్కరించేందుకు మాకు మరో ఛాన్స్ ఇవ్వండి. మీ ఆర్డర్ వివరాలు డీఎమ్ చేయండి’’ అంటూ ఫ్లిప్‌కార్ట్ విజ్ఞప్తి చేసింది (Flipkart apologizes). కానీ, జనాలకు మాత్రం ఫ్లిప్‌కార్ట్ మీద కోపం తగ్గలేదు. అనేక మంది తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేస్తూ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 22 , 2023 | 08:34 PM